ప్రపంచంలోనే అత్యంత విలువైనది వజ్రం. బంగారానికి మించిన విలువ దీనికి ఉంటుంది. భూమిలో వందల కిలోమీటర్ల లోతులో ఇవి దొరకుతాయి. వాటిని కనిపెట్టి, వెతికి తీయడం కూడా పెద్ద ప్రయత్నమే.
ఇంత అరుదుగా దొరుకుతుంది కాబట్టే వజ్రానికి చాలా ఎక్కువ విలువ ఉంటుంది. సామాన్య, మధ్య తరగతి ప్రజలకు వీటిని కొనడం అనేది తీరని కలే.
సహజ వజ్రాలు..
భూమిలో దొరికే వజ్రాలను సహజ వజ్రాలు అంటారు. ఇవి తయారు కావడానికి కొన్ని వందల ఏళ్లు పడుతుంది. వీటి ధర కూడా కోట్లలో ఉంటుంది. ఈ నేపథ్యంలో ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ (ఎల్జీడీ) తెరమీదకు వచ్చాయి. వీటిని ల్యాబ్ లలో తయారు చేస్తారు. గట్టిదనం, నాణ్యత విషయంలో సహజ వజ్రాల మాదిరిగానే ఉంటాయి. కానీ ల్యాబ్ లలో తయారు చేసే అవకాశం ఉండడంతో ధర ప్రజలకు అందుబాటులో ఉంటుంది.
ల్యాబ్ గ్రోన్ డైమండ్స్..
ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ కొన్ని వారాలలోనే తయారవుతాయి. పెళ్లిళ్లు, శుభకార్యాలు, ఇతర ముఖ్యమైన సందర్బాలలో బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఇంకొంచెం ఉన్నతంగా ఉండాలనుకునే వారు వజ్రాభరణాలను ఎంచుకుంటున్నారు. వారికి ఈ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ అనుకూలంగా ఉంటాయి. వీటితో తయారు చేసిన ఉంగరాలు, ఆభరణాలకు ఇప్పుడిప్పుడే ఆదరణ పెరుగుతోంది.
ధర తక్కువ..
ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ ధర తక్కువగా ఉండడం వల్ల దేశంలో వినియోగం పెరుగుతుందని, అలాగే ఎగుమతులు కూడా పెరుగుతాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 7 నుంచి 9 శాతం పెరిగి 1,500 నుంచి 1,530 మిలియన్ల యూఎస్ డాలర్లకు చేరుకుంటాయని అంచనా వేస్తున్నారు. ఎందుకంటే సహజంగా తవ్విన వజ్రాల ధర కోట్లలో ఉండడంతో వాటికి డిమాండ్ మందకొడిగా ఉంటోంది. కేవలం ధనికులు మాత్రమే వాటిని కొనగలుతున్నారు. దీంతో మధ్య తరగతి ప్రజలకు ల్యాబ్ గ్రోన్ డైమండ్ల వైపు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో వాటి మార్కెట్ పెరుగుతోంది.
పెరుగుతున్న వినియోగం..
మానవ నిర్మిత వజ్రాల ధర తక్కువ కావడంతో దేశీయంగా వినియోగం, ఎగుమతులు పెరుగుతాయని భావిస్తున్నారు. ఎల్జీడీ ఎగుమతులు 7 నుంచి 9 శాతం పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక, రాజకీయ, ఆర్థిక మార్పులు జరుగుతున్నాయి. రత్నాలు, ఆభరణాల పరిశ్రమలు కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో ఎల్జీడీ విక్రయాలతో లోటును భర్తీ చేసుకోనున్నాయి.
డిమాండ్ పెరిగే అవకాశం..
ఇటీవల ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ ఎగుమతులు క్షీణించాయి. ఏవై 2024లో దాదాపు 16.5 శాతం క్షీణత కనిపించింది. దీంతో ఏవై 2025లో ఎగుమతులు పెరుగుతాయని భావిస్తున్నారు. సహజంగా తవ్విన వజ్రాలకు డిమాండ్ మందగించే అవకాశం ఉన్నందున, ఎల్జీడీకి ఎక్కువవుతుందని అంచనా వేస్తున్నారు.
మన దేశంలో..
మన దేశం ఏడాదికి ల్యాబ్ లో మూడు మిలియన్ల వజ్రాలను ఉత్పత్తి చేస్తున్నారు. ప్రపంచ ఉత్పత్తిలో 15 శాతం వాటాను కలిగి ఉంది. అలాగే రెండో అతిపెద్ద ఉత్పత్తిదారుగా ఉంది. మనతో పాటు చైనా, యూఎస్ఏ, సింగపూర్, రష్యా వంటి దేశాలు కూడా ల్యాబ్ గ్రోన్ వజ్రాలను తయారు చేస్తున్నాయి. మన దేశం నుంచి వీటి ఎగుమతులు 2023లో 1,680.22 మిలియన్ల యూఎస్ డాలర్లు కాగా, 2024లో 1,402.30 మిలియన్ల డాలర్లకు పడిపోయాయి.