Mangrove forests : మడ అడవులపై మళ్లీ అక్రమార్కుల కన్ను

అక్రమార్కులు విడతలవారీగా మడ అడవులపై కన్నేస్తున్నారు. బందరు మండలం కానూరు గ్రామ పరిధిలో ఈ వ్యవహారాలు గుట్టుగా జరుగుతున్నాయి. నవంబరులోనే మడ అడవుల ఆక్రమణకు ఓ వ్యక్తి ప్రయత్నించగా అధికారులు అడ్డుకున్నారు. రెండు రోజులుగా అదే వ్యక్తి మళ్లీ అడవుల్లోని చెట్లను నరికి వేస్తుండటంతో స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటివరకు అధికారులు కన్నెత్తి కూడా చూడకపోవడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


ప్రకృతి విపత్తులు సంభవించిన సమయంలో సముద్రతీరంలోని గ్రామాలకు రక్షణ గోడగా ఉండే మడ అడవుల భూములను ఆక్రమించే యత్నాలు మళ్లీ తెరపైకి వచ్చాయి. బందరు మండలం కానూరు రెవెన్యూ గ్రామ పరిధిలోని మడ అడవులు ఏపుగా ఉన్న ప్రాంతంలో చెట్లను నరికి ప్రభుత్వ భూములను ఆక్రమించేందుకు నాలుగు రోజులుగా కొందరు వ్యక్తులు ప్రయత్నిస్తున్నారు. అయినా రెవెన్యూ అధికారులు అటువైపు కన్నెత్తి చూడట్లేదు. కానూరులోని ప్రభుత్వ భూముల్లో సహజసిద్ధంగా పెరిగిన మడచెట్లను యంత్రాల ద్వారా కోసేసి, ప్రభుత్వ భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నాలు చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. గత ఏడాది నవంబరులో ఈ ప్రాంతంలోని మడభూములను కొందరు ఆక్రమించేందుకు ప్రయత్నాలు చేయగా, రెవెన్యూ అధికారులు అడ్డుకున్నారు. రెండు నెలల విరామం అనంతరం మళ్లీ ఆక్రమణలు ప్రారంభమయ్యాయి.

70 ఎకరాలకుపైగా ఆక్రమించే యత్నం

బందరు మండలం కానూరు రెవెన్యూ గ్రామ పరిధిలో వందలాది ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. లజ్జబండ డ్రెయినేజీ పక్కనే ఉన్న ఈ భూమిలో మడ అడవులు ఉన్నాయి. బంటుమిల్లి మండలం మణిమేశ్వరానికి చెందిన ఓ వ్యక్తి ఇటీవల కాలంలో ఈ భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నాలు ప్రారంభించాడు. 70 ఎకరాల భూమిలోని మడచెట్లను నరికివేయించే పనులు చే యిస్తున్నాడు. ఈనెల 22, 23 తే దీల్లో ఆటోల్లో కూలీలను తీసుకొచ్చి మరీ మడచెట్లు నరికే పనులు చేయించాడు. గురువారం పనులు నిలిపివేసి, శుక్రవారం మళ్లీ మొదలుపెట్టాడు. ఈ అంశంపై స్థానికులు స్థానిక వీఆర్వోకు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినా మడచెట్ల నరికివేతను ఆపేందుకు రెవెన్యూ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

తొలుత ఆక్రమణ.. ఆ తర్వాత లీజుకు..

కానూరు, పెదపట్నం గ్రామాల్లోని మడ అడవులను ఐదు, పది ఎకరాల చొప్పున రొయ్యల చెరువులుగా మార్చేసిన అనంతరం ఈ భూములు తమకు చెందినట్లుగా ఆక్రమణదారులు చూపిస్తారు. కొంతకాలం తరువాత ఆ ప్రభుత్వ భూములను భీమవరానికి చెందిన బడాబాబులకు లీజుకిచ్చి ఏడాదికి ఎకరాకు రూ.70 వేల నుంచి రూ.80 వేల చొప్పున వసూలు చేస్తారు. ఈ ఆనవాయితీ కొన్నేళ్లుగా జరుగుతోంది. ఇదే ఆనవాయితీని మణిమేశ్వరానికి చెందిన వ్యక్తి అమలు చేసేందుకు ప్రణాళిక రూపొందించాడని స్థానికులు చెబుతున్నారు.

రొయ్యల సాగుకు అనుకూలమనే..

కానూరు-పెదపట్నం గ్రామాల మధ్యగా లజ్జబండ డ్రెయినేజీ ప్రవహిస్తుంది. అక్కడి నుంచి సముద్రంలో కలుస్తుంది. కానూరు రెవెన్యూ గ్రామ పరిధిలో లజ్జబండ డ్రెయినేజీకి ఇరువైపులా ప్రభుత్వ భూముల్లో మడ అడవులు విస్తరించి ఉన్నాయి. ఇక్కడ సముద్రం నుంచి ఉప్పునీరు లజ్జబండ డ్రెయినేజీ ద్వారా వచ్చి వెళ్తుంటుంది. దీంతో ఈ ప్రాంతం రొయ్యల సాగుకు అనుకూలంగా మారింది. ఈ ప్రాంతంపై మణిమేశ్వరానికి చెందిన ఓ వ్యక్తి కన్నేశాడని స్థానికులు చెబుతున్నారు. భీమవరానికి చెందిన కొందరు వ్యక్తులతో కలిసి ఈ భూములను గుట్టుచప్పుడు కాకుండా ఆక్రమించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడని తెలుస్తోంది. తొలివిడతగా మడచెట్లను నరికేసి, కొంతకాలంపాటు భూమిని తమ ఆధీనంలో ఉంచుకుని, ఆ తరువాత రెవెన్యూ అధికారులను, స్థానిక రాజకీయ నాయకులను మచ్చిక చేసుకుని వేసవిలో రొయ్యల చెరువులుగా మార్చేందుకు ఎత్తుగడ వేశాడని సమాచారం.

పరిశీలించి చర్యలు తీసుకుంటాం

ఈ ఆక్రమణ వ్యవహారంపై పూర్తిస్థాయి వివరాలు సేకరిస్తాం. అటవీ శాఖ అధికారులతో కూడా మాట్లాడి మడ చెట్లను నరుకుతున్న, ప్రభుత్వ భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్న వారిపై తగు చర్యలు తీసుకుంటాం.