మలయాళంలో రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రికార్డు సృష్టించిన ‘మంజుమ్మల్ బాయ్స్’ మూవీ తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుందా?
Manjummel Boys telugu review: చిత్రం: మంజుమ్మల్ బాయ్స్; నటీనటులు: సౌబిన్ షాహిర్, గణపతి, ఖలీద్ రెహమాన్, శ్రీనాథ్ భాసి, జార్జ్ మరియన్, లాల్ జూనియర్ తదితరులు; సంగీతం: సుశిన్ శ్యామ్; ఛాయాగ్రహణం: షైజు ఖలీద్; దర్శకత్వం: చిదంబరం; నిర్మాణ సంస్థ: మైత్రీ మూవీ మేకర్స్; విడుదల తేదీ: 06-04-2024
ఈ మధ్య కాలంలో మలయాళంలో బాగా వినిపించిన బ్లాక్‌బస్టర్ హిట్స్‌లో మంజుమ్మల్ బాయ్స్ ఒకటి. రూ.20కోట్ల పరిమిత బడ్జెట్‌తో నిర్మితమైన ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఏకంగా రూ.200కోట్ల పైచిలుకు వసూళ్లు రాబట్టి కొత్త రికార్డులు నెలకొల్పింది. దీంతో ఇప్పుడా సినిమాని అదే పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్. మరి ఈ చిత్ర కథేంటి? ఇది తెలుగు ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతి అందించింది? ఇక్కడా భారీ వసూళ్లు కొల్లగొట్టే అవకాశముందా?
కథేంటంటే: కేరళలోని కొచ్చికి చెందిన కుట్టన్ (షౌబిన్ షాహిర్), సుభాష్ (శ్రీనాథ్ భాషి)తో పాటు వారి స్నేహితులందరూ సొంత ఊళ్లోనే చిన్నాచితకా ఉద్యోగాలు చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారు. ఈ గ్యాంగ్‌కు మంజుమ్మల్ బాయ్స్ పేరుతో ఓ అసోసియేషన్ ఉంటుంది. వీరంతా కలిసి ఓసారి కొడైకెనాల్ ట్రిప్‌నకు వెళ్తారు. ఈ విహారయాత్రకు సుభాష్ తొలుత రానని చెప్పినా.. కుట్టన్ బలవంతం మీద ఆఖరి నిమిషంలో కారెక్కుతాడు. ఈ మంజుమ్మల్ బ్యాచ్ కొడైకెనాల్‌లోని అందమైన ప్రదేశాలన్నీ చూశాక ఆఖరిలో గుణ కేవ్స్ చూడటానికి వెళ్తారు. ఆ గుహలు బయట నుంచి చూడటానికి ఎంత రమణీయంగా ఉంటాయో.. అంతే ప్రమాదకరం కూడా. ఎందుకంటే అక్కడ వందల అడుగుల లోతున్న ఎన్నో ప్రమాదకరమైన లోయలుంటాయి. వాటిలో డెవిల్స్ కిచెన్ కూడా ఒకటి. దాదాపు 150 అడుగులకు పైగా లోతున్న ఆ లోయలో 13మందికి పైగా పడగా.. ఏ ఒక్కరూ ప్రాణాలతో తిరిగి రాలేదు. అందుకే గుణ కేవ్స్‌లోని ఆ ప్రమాదకర లోయలున్న ప్రాంతాలున్న చోటుకు వెళ్లడాన్ని అటవీశాఖ వారు.. పోలీసులు నిషేధిస్తారు. కానీ, మంజుమ్మల్ బాయ్స్ అక్కడున్న అటవీ సిబ్బంది కళ్లుగప్పి.. ఫెన్సింగ్ దాటి గుణ కేవ్స్‌లోని ఆ ప్రమాదకరమైన ప్రదేశానికి వెళ్తారు. అక్కడ వారంతా సరదాగా గడుపుతుండగా అనుకోకుండా సుభాష్ అక్కడే ఉన్న అతి ప్రమాదకరమైన డెవిల్స్ కిచెన్ లోయలోకి జారిపడతాడు. మరి ఆ తర్వాత ఏమైంది? ఆ లోయ నుంచి సుభాష్‌ను ప్రాణాలతో కాపాడి తీసుకురావడానికి తోటి మిత్రులంతా ఏం చేశారు? పోలీసులు వాళ్లపై తిరగబడటానికి కారణమేంటి? ఆ ప్రమాదకరమైన లోయలోకి వెళ్లడానికి పోలీసులు, ఫైర్ డిపార్ట్‌మెంట్ సిబ్బందే భయపడుతున్నప్పుడు సుభాష్‌ను రక్షించేందుకు కుట్టన్ మాత్రమే లోయలోకి దిగేందుకు ఎందుకు సిద్ధపడ్డాడు?వాళ్లిద్దరూ ఆఖరికి ప్రాణాలతో బయట పడ్డారా? లేదా?అన్నది తెరపై చూసి తెలుసుకోవాలి.
ఎలా సాగిందంటే: ఇది యథార్థ కథ. 2006లో గుణ కేవ్స్‌లో చిక్కుకున్న తన మిత్రుడ్ని రక్షించుకునేందుకు ఎర్నాకులం మంజుమ్మల్ బాయ్స్ చేసిన సాహసానికి తెర రూపమే ఈ చిత్రం. దీన్ని దర్శకుడు చిదంబరం ఎంతో నిజాయితీగా సహజత్వం ఉట్టిపడేలా తెరపై చూపించగలిగాడు. సినిమా చూస్తున్నంత సేపూ ఆ ఇరుకు లోయలో.. ఆ కటిక చీకట్ల మధ్య తామే చిక్కుకున్నామేమో అని ప్రేక్షకులకు అనిపించేలా కథని ఉత్కంఠభరితంగా నడిపించాడు. నిజానికి కొన్ని మలయాళ కథల్లో స్లోనేరేషన్ సహనానికి పరీక్ష పెడుతుందనే విమర్శ తరచూ వినిపిస్తుంటుంది. ఇది ఈ చిత్ర విషయంలోనూ తప్పకుండా మళ్లీ వినిపిస్తుంది. మంజుమ్మల్ బాయ్స్ నేపథ్యాన్ని.. వారి ప్రపంచాన్ని పరిచయం చేస్తూ నెమ్మదిగా మొదలైన కథ ఆ తర్వాత బలంగా పట్టేస్తుంది. నిజానికి విరామం వరకు అసలు కథ మొదలు కాకున్నా.. పెద్దగా డ్రామా, మలుపులు లేకున్నా మంజుమ్మల్ గ్యాంగ్ అల్లరి బాగానే కాలక్షేపం చేయిస్తుంది. వీళ్లు ఎప్పుడైతే గుణ కేవ్స్ చూడాలని నిర్ణయించుకుంటారో అక్కడే కథ మలుపు తిరుగుతుంది. ఇక సుభాష్ డెవిల్స్ కిచెన్‌లో పడిన తర్వాత నుంచి కథ ఒక్కసారిగా ఉత్కంఠభరితంగా మారిపోతుంది. అక్కడి నుంచి చివరి వరకు సుభాష్‌ను ఎలా బయటకు తీసుకొస్తారా? అన్న ఆసక్తి ప్రేక్షకుల్ని తొలిచేస్తుంటుంది. ద్వితీయార్ధమంతా ఈ సర్వైవల్ డ్రామాతోనే ముందుకు సాగుతుంది.
సుభాష్ లోయలో పడ్డాక లోపల తన పరిస్థితి ఏంటో తెలియక తోటి మిత్రులంతా పడే ఆవేదన మదిని బరువెక్కిస్తుంది. ఇలాంటి ప్రమాదకర పరిస్థితుల్లో చిక్కుకున్నప్పుడు పోలీసులు స్పందించే తీరును సినిమాలో చాలా సహజంగా చూపించారు. పోలీసులతో పాటు స్థానిక ప్రజలు మంజుమ్మల్ బాయ్స్‌కు సాయం చేసేందుకు ముందుకు రాకున్నా.. మిత్రుడ్ని కాపాడుకునేందుకు వాళ్లు పడే ఆరాటం, తపన ప్రేక్షకుల్ని కట్టిపడేస్తాయి. లోయలోకి వర్షపు నీరు ఉప్పెనలా ముంచెత్తుతుంటే ఆ ప్రవాహాన్ని అడ్డుకునేందుకు తోటి స్నేహితులంతా అడ్డుగా పడుకోవడం ఉద్వేగభరితంగా అనిపిస్తుంది. నిజానికి సుభాష్ లోయలో పడ్డాక తనకెదురయ్యే ప్రాణపాయ పరిస్థితులతో కొంత డ్రామా క్రియేట్ చేసుకునే అవకాశముంది. కానీ, దాన్ని దర్శకుడు వాడుకోలేదు. కాకపోతే తన ప్రస్తుత పరిస్థితిని ఓవైపు చూపిస్తూనే.. మరోవైపు చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తూ కథకు బలమైన ఎమోషన్స్ అందించే ప్రయత్నం చేశాడు. అవి ముగింపును భావోద్వేగభరితంగా మార్చడంలో బాగా ఉపయోగపడ్డాయి. సుభాష్‌ను రక్షించేందుకు కుట్టన్ లోయలోకి దిగే ఎపిసోడ్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుంది. లోయలో నెత్తురోడుతూ నిస్సహాయంగా పడి ఉన్న సుభాష్‌ను చూస్తున్నప్పుడు అప్రయత్నంగానే కళ్లు చెమ్మగిల్లుతాయి. ఇక ఆ ఇరుకైన లోయలో ఎన్నో సవాళ్లు దాటుకొని సుభాష్‌ను కుట్టన్ చేరుకున్నప్పుడు వచ్చే ఓ చిన్న ట్విస్ట్ ప్రేక్షకుల్ని ఉలిక్కిపడేలా చేస్తుంది. ముగింపు అందరి మనసుల్ని బరువెక్కిస్తుంది.
ఎవరెలా చేశారంటే: కుట్టన్‌గా షౌబిన్ షాహిర్‌తో పాటు మిగిలిన మిత్ర బృందమంతా సహజమైన నటనతో ఆకట్టుకున్నారు. వాళ్లు చేసే అల్లరి పనులు, గొడవలు, వారి స్నేహ బంధం ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యేలా చాలా సహజంగా ఉంటాయి. దర్శకుడు కథను నిజాయితీగా తెరపై చూపించే ప్రయత్నం చేశాడు. కాకపోతే సినిమాలో పెద్దగా వేగం కనిపించదు. అలాగే ద్వితీయార్ధంలో మరీ ట్విస్ట్‌లు, మలుపులు కూడా కనిపించవు. కానీ, సినిమాలో ఎక్కడా ఉత్కంఠతకు లోటుండదు. గుణ కేవ్ సెటప్ ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ. దాన్ని ఛాయాగ్రాహకుడు తన కెమెరాతో ఎంతో చక్కగా ఒడిసి పట్టాడు. కమల్ కల్ట్ సినిమా గుణ నేపథ్యాన్ని.. ఆ చిత్రంలోని కమ్మని నీ ప్రేమ లేఖలే పాటను దర్శకుడు ఈ చిత్రంలో చక్కగా వాడుకున్నాడు. అలాగే నేపథ్య సంగీతం కూడా సినిమాని మరో స్థాయిలో నిలబెట్టింది. టెక్నికల్‌గా ఈ చిత్రం చాలా ఉన్నతంగా కనిపిస్తుంది.
బలాలు
+ కథా నేపథ్యం
+ ఉత్కంఠతకు గురి చేసే ద్వితీయార్ధం
+ విజువల్స్, నేపథ్య సంగీతం
బలహీనతలు
– నెమ్మదిగా సాగే కథనం
చివరిగా: మంజుమ్మల్ బాయ్స్.. కట్టిపడేసే సర్వైవల్ థ్రిల్లర్.
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!