మంచు ఇంట వ్యవహారాలు కొత్త టర్న్ తీసుకుంటున్నాయి. మోహన్ బాబు వివాదం సంచలనంగా మారింది. కేసులు..విచారణ.. బైండ్ ఓవర్లు చోటు చేసుకున్నాయి. ఆ తరువాత క్రమేణా వివాదం సర్దుమనిగింది.
మనోజ్ తిరిగి సినిమా షూటింగ్ లో బిజీ అయ్యారు. ఇదే సమయంలో మనోజ్ – మౌనిక దంపతులు సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు. ఆళ్లగడ్డ వేదికగా తమ పొలిటికల్ ఎంట్రీ పైన ప్రకటన చేయనున్నట్లు ప్రచారం సాగుతోంది.
పొలిటికల్ ఎంట్రీ
మోహన్ బాబు నివాసంలో వివాదంతో రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరిగింది. మనోజ్ పై దాడి .. మోహన్ బాబు ఆస్పత్రిలో చేరిక…పోలీసు కేసులు…మీడియా పై దాడిలో మోహన్ బాబు పై హత్యాయత్నం కేసు నమోదు అయ్యాయి. ఈ వివాదం సర్దుమనిగింది. ఎవరి పనుల్లో వారు బిజీ అవుతున్నారు. ఈ సమయంలోనే మనోజ్ – మౌనిక ఇద్దరూ ఆళ్ళగడ్డకు వెళ్తున్నారు. వారిద్దరూ ఆళ్ళగడ్డకు భారీ కార్ల ర్యాలీతో బయల్దేరుతున్నారు. కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఉన్న భూమా కుటుంబ మద్దతు దారులకు సమాచారం ఇచ్చారు. వారంతా ఆళ్ళగడ్డకు చేరుకుంటున్నట్లు తెలుస్తోంది.
పవన్ తో సత్సంబంధాలు
వీరితో సమావేశం ద్వారా మనోజ్ – మౌనిక కీలక ప్రకటనకు సిద్దం అయినట్లు సమాచారం. వీరి పొలిటికల్ ఎంట్రీకి వేదికగా ఆళ్ళగడ్డను ఎంచుకున్నట్లు చెబుతున్నారు. గతంలోనే భూమా మౌనిక ఎన్నికల్లో పోటీ చేసే అంశం పైన చర్చ జరిగింది. అయితే, గత ఎన్నికల్లో భూమా అఖిల ప్రియ టీడీపీ నుంచి ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా గెలుపొందారు. మౌనిక వివాహం చేసుకోవటంతో రాజకీయ ఎంట్రీ నిలిచిపోయింది. కాగా, తాజా వివాదంతో తాము రాజకీయంగా బలపడాలని ఈ ఇద్దరూ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నుంచే తమ పొలిటికల్ ఇన్నింగ్స్ ను ప్రారంభించాలని డిసైడ్ అయినట్లు సమాచారం.
జనసేనలో ఎంట్రీ
మౌనిక – మనోజ్ ఇద్దరూ జనసేనలో చేరేందుకు సిద్దమైనట్లు భూమా మద్దతు దారుల్లో కర్నూలు జిల్లాలో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. గతంలో మోహన్ బాబు టీడీపీ నుంచి రాజ్యసభ సభ్యుడి గా పని చేసారు. అటు మౌనిక సోదరి అఖిల టీడీపీ ఎమ్మెల్యేగా ఉండటంతో.. జనసేన వైపు ఈ ఇద్దరు ఆసక్తిగా ఉన్నట్లు చెబుతున్నారు. మనోజ్ తొలి నుంచి పవన్ తో సన్నిహితంగానే ఉంటు న్నారు. అలాగే మనోజ్ పట్ల పవన్ కల్యాణ్ ఎంతో స్నేహపూర్వకంగా ఉంటారు. దీంతో, ఇద్దరూ జనసేన నుంచి రాజకీయ ప్రయాణం చేస్తున్నట్లుగా రేపు (సోమవారం) ప్రకటన చేస్తారనే ప్రచారం సాగుతోంది. త్వరలోనే పవన్ సమక్షంలో జనసేనలో చేరుతారనే వాదన వినిపిస్తోంది. దీంతో, నిజంగా ఈ ఇద్దరూ పొలిటికల్ ఎంట్రీ ఇస్తారా.. రాజకీయంగా ఏం చేయబోతున్నారనే ఆసక్తి ఇప్పుడు సినీ, పొలిటికల్ ఇండస్ట్రీలో కనిపిస్తోంది.