ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ సంక్షేమ పథకాల అమలుకు వేగంగా అడుగులు వేస్తోంది. దాంతో.. రేషన్‌కార్డుల జారీపై ఫోకస్ పెట్టింది. దానిలో భాగంగా.. కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియను త్వరలో ప్రారంభించబోతున్న ఏపీ ప్రభుత్వం.. మ్యారేజ్ సర్టిఫికేట్ ఆధారంగా రేషన్‌కార్డులు జారీ చేసేందుకు ప్రయత్నిస్తోంది. అలాగే.. 2019-24 మధ్య కాలంలో వైసీపీ ప్రభుత్వం రేషన్ కార్డులపై జగన్ బొమ్మ ముద్రించడంతోపాటు.. ఆ పార్టీ రంగులతో కార్డులు ఇవ్వగా.. ఇప్పుడు వాటిని కూడా మార్చి కొత్తవి ఇవ్వాలని డిసైడ్ అయింది. దీనికి సంబంధించి పలు రకాల డిజైన్లను పరిశీలిస్తున్నారు ప్రభుత్వ పెద్దలు.
ఇక.. ఏపీలో ప్రస్తుతం 1.48 కోట్ల రేషన్ కార్డులు ఉండగా.. వాటిలో 89 లక్షల రేషన్ కార్డులకు ఆహారభద్రత చట్టం కింద కేంద్రం నిత్యావసరాలు అందిస్తోంది. మిగిలిన కార్డులకు రేషన్ ఖర్చు ఏపీ సర్కారే భరిస్తోంది. వీటిని కూడా కేంద్ర ఆహార భద్రతా చట్టం పరిధిలోకి తీసుకోవాలని ఏపీ డిమాండ్ చేస్తున్నప్పటికీ రూల్స్‌ను తెరపైకి తెస్తోంది కేంద్రం. మరోవైపు.. దరఖాస్తు చేసుకుంటే ఐదు రోజుల్లోనే అర్హులందరికీ రేషన్‌కార్డులు ఇస్తామని 2020లో అప్పటి వైసీపీ ప్రభుత్వం ప్రకటించింది. కానీ.. కార్డుల సంఖ్య పెరిగితే ఏపీ ప్రభుత్వంపై భారం పడుతుందనే ఉద్దేశంతో గత ఐదేళ్లలో కొత్త రేషన్‌కార్డులకు జగన్ ప్రభుత్వం కోతపెట్టిందని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. గత ఐదేళ్లలో ఇచ్చిన లక్షా పదివేల కొత్త కార్డులే అందుకు నిదర్శనం అంటున్నారు. నిజానికి.. పెళ్లైనవారికి కొత్తగా కార్డులు ఇవ్వాలంటే.. అప్పటికే ఉన్న కుటుంబ రేషన్‌కార్డుల నుంచి వారి పేర్లు తొలగించాల్సి ఉంటుంది. కానీ.. దానికి అనుమతి ఇవ్వకపోవడంతో కొత్తగా పెళ్లైనవారికి కార్డులు అందలేదు. దాంతో.. ఈ సమస్యను పరిష్కరించేందుకు మ్యారేజ్ సర్టిఫికేట్ ఆధారంగా కొత్త జంటలకు రేషన్ కార్డు జారీ చేయాలని ఎన్డీయే ప్రభుత్వం ఫిక్స్ అయింది.