భారత్‌లోని అత్యంత ప్రజాదరణ పొందిన సెడాన్‌లలో ఒకటైన మారుతీ సుజుకీ డిజైర్ ఉత్పత్తి 30 లక్షల యూనిట్లను అధిగమించి ఒక ప్రధాన మైలురాయిని సాధించిందని మారుతీ ఈ రోజు(సోమవారం) ప్రకటించింది. ఇది మారుతీ సుజుకీ కార్ల శ్రేణిలో కీలకమైన మోడల్‌గా ఉంది. 2008లో కారు అరంగ్రేటం చేసిన దాదాపు 17 ఏళ్ల తర్వాత ఈ ఘనత సాధించింది. డిజైర్, 2015లో 10 లక్షల యూనిట్ల మైలురాయిని చేరుకుంది. 2019 నాటికి ఈ సంఖ్య రెట్టింపు(20 లక్షలు) అయ్యింది. సెడాన్ మార్కెట్‌లో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. ప్రస్తుత కాలంలో మార్కెట్‌లో ఎస్‌యూవీలు విస్తృతంగా ఆధిపత్యం చెలాయిస్తున్నప్పటికీ, భారత్‌లో..డిజైర్ ధరలో సరసమైన, ఇంధన ఆదాలో సమర్ధంతమైన మోడల్‌గా పేరుగాంచింది.
2008లో ఎగుమతులు ప్రారంభమైనప్పటి నుంచి 48 దేశాలకు దాదాపు 2.60 లక్షల యూనిట్లు ఎగుమతి అయ్యాయి. డిజైర్ కార్లు ఎగుమతి అయిన దేశాల్లో..లాటిన్ అమెరికా, ఆఫ్రికా, ఆగ్నేయాసియా, మధ్యప్రాచ్య దేశాలు ప్రముఖంగా ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఇది మారుతీ సుజుకీకి సంబంధించిన రెండవ అత్యధిక ఎగుమతి మోడల్‌గా పేరుగాంచింది. ఆల్టో, స్విఫ్ట్, వ్యాగన్‌ఆర్ వంటి కార్ల వలె 30 లక్షల ఉత్పత్తి మార్కును అధిగమించిన అతి తక్కువ మారుతీ సుజుకీ మోడళ్లలో డిజైర్ ఒకటి.