ప్రస్తుతం దేశంలో 7 సీటర్ కార్లను జనాలు ఎక్కువగా కొంటున్నారు. గత కొన్ని నెలలుగా ఈ ట్రెండ్ విపరీతంగా పెరుగుతోంది. రెండు ఫ్యామిలీలకు సరిపోయేలా మంచి కంఫర్ట్ ఉండే కార్లను జనాలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. తక్కువ ధరలో ఎక్కువ మంది ప్రయాణించేలా ఇవి ఉన్నాయి. ఎస్‌యూవీ, హ్యాచ్‌బ్యాక్స్ కంటే ఎక్కువగా ఎంపీవీలకే జనాలు ఓటేస్తున్నారు. మారుతి నుంచి ఎర్టిగా, రెనాల్ట్ ట్రైబర్, మారుతి సుజుకి XL 6, టయోటా రూమియాన్ వంటివి మంచి డిమాండ్ కలిగి ఉన్నాయి. ఇవే కాక 2010 లో భారత్‌లో లాంచ్ చేసిన మారుతి సుజుకి ఈకో (Maruti Suzuki Eeco) కారు/ వ్యాన్ మంచి ఫ్యామిలీ కారుగా ఉంది.
ఈ ఈకో కారులో ఏడుగురు సౌకర్యవంతమైన ప్రయాణించవచ్చు. ఇందులో ఉండే విశాలమైన 7 సీట్లు, డిజైన్, సరసమైన ధర, అద్భుతమైన మైలేజీతో మార్కెట్‌లో ప్రసిద్ది చెందింది. ఈ ఈకో కారు చాలా తక్కువ ధరలో కొనుగోలుకి అందుబాటులో ఉండటం వల్ల జనాలు దీనిని కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇది పెట్రోల్, సీఎన్‌జీ ఆప్షన్లలో కొనుగోలుకి అందుబాటులో ఉంది.
ఈ కారు పెట్రోల్ ఇంజిన్‌లో లీటరుకు 20 కిలోమీటర్ల మైలేజీని, సీఎన్‌జీ వెర్షన్‌లో 27 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. భారీ మైలేజీ, తక్కువ మెయింటైనెన్స్‌తో వచ్చే ఈ కారులో రెండు ఫ్యామిలీలు హాయిగా ప్రయాణించవచ్చు ఈ కారులోని 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్ 81 bhp, 104.4 nm టార్క్‌ని, సీఎన్‌జీ వెర్షన్ 72 bhp, 95 nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ మారుతి సుజుకి ఈకో 5-సీటర్ స్టాండర్డ్ (O), 5-సీటర్ AC (O), 5-సీటర్ AC సీఎన్‌జీ (O), 7-సీటర్ స్టాండర్డ్ (O) అనే నాలుగు వేరియంట్లలో దీనిని కొనుగోలు చేయవచ్చు. కస్టమర్లకు తమకు నచ్చిన విధంగా 5 సీటర్ లేదా 7 సీటర్ కార్లలో కొనుగోలు చేయవచ్చు. అలాగే కస్టమర్లు తమకు నచ్చిన విధంగా కస్టమైజ్ చేసుకోవచ్చు.
ఈ కారులో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్, ఫ్రంట్ సీట్ బెల్ట్ రిమైండర్, స్పీడ్ అలర్ట్, రేర్ పార్కింగ్ సెన్సార్స్ వంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. ఇక ఫీచర్ల పరంగా స్పీడోమీటర్, రిక్లైనింగ్ ఫ్రంట్ సీట్స్, మాన్యువల్ ఏసీ, 12వీ ఛార్జింగ్ సాకెట్ వంటి ఫీచర్లు అందించారు. ఈ కారు వారాంతాలు, సెలవు దినాల్లో విహార యాత్రలకు, అలాగే ట్రావెల్ వినియోగం కోసం సౌకర్యవంతంగా ఉంటుంది. ఈ కారులో ఎక్కువ లగేజీని కూడా తీసుకెళ్లవచ్చు. ఇది 275 నుంచి 540 లీటర్ల బూట్ స్పేస్‌ని కలిగి ఉంది. మొత్తం మీద ఈ కారులో లగేజీ ప్లస్, 7 గురు ప్యాసింజర్లు ఇబ్బంది లేకుండా పోవచ్చు. ఈ మారుతి సుజుకి ఈకో కారు/వ్యాన్‌కి ప్రస్తుతం దాని విభాగంలో ప్రత్యక్ష ప్రత్యర్థి కార్లు లేవు. మంచి కంఫర్ట్ రైడింగ్ కోసం దీనిని ఎంచుకోవచ్చు.
దీనిని మెటాలిక్ గ్లిస్టెనింగ్ గ్రే, బ్లూయిష్ బ్లాక్, మెటాలిక్ బ్రిస్క్ బ్లూ, మెటాలిక్ సిల్కీ సిల్వర్, సాలిడ్ వైట్ వంటి మోనోటోన్ కలర్స్‌లో లభిస్తుంది. మంచి కారుని కొనాలనుకునే వారు దీనిని కళ్లు మూసుకుని కొనుగోలు చేయవచ్చు. 2010 నుంచి ఈ కారు మంచి పాపులారిటీతో సేల్స్‌లో దూసుకుపోతుంది. దీని ధరలు రూ. 5.32 లక్షల నుంచి రూ. 6.58 లక్షల మధ్య ఉన్నాయి.