ఇరాక్‌లోని ఓ షాపింగ్ మాల్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 50 మంది మృతి చెందారు. అనేక మంది గాయపడ్డారు.
ఇరాక్‌లోని అల్ కుట్ నగరంలోని ఓ షాపింగ్ మాల్‌లో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 50 మంది మృతి చెందినట్లు వసిత్ ప్రావిన్స్ గవర్నర్ మహ్మద్ అల్ మియాహిని తెలిపారు. ఒక భవనంలో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. దారుణంగా పొగలు వెలువడ్డాయి.
షాపింగ్ సెంటర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య 50కి చేరిందని గవర్నర్ తెలిపారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని, అయితే ప్రాథమిక దర్యాప్తు ఫలితాలు 48 గంటల్లో తెలుస్తాయని ఇరాన్ అధికారిక వార్తా సంస్థ ఐఎన్ ఏ తెలిపింది. భవనం, మాల్ యజమానిపై కేసులు నమోదు చేసినట్టుగా పేర్కొంది.
అల్-కుట్‌లోని ఐదు అంతస్తుల భవనంలో మంటలు చెలరేగుతున్నట్లు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు చూపించాయి. అగ్నిప్రమాదానికి గల కారణం వెంటనే తెలియరాలేదు. దర్యాప్తు ద్వారా ప్రాథమిక ఫలితాలను 48 గంటల్లో ప్రకటిస్తామని గవర్నర్ చెప్పారని ఐఎన్ఏ నివేదించింది.
































