ఏపీలో ఎంబిబిఎస్‌ వెబ్‌ ఆప్షన్లు ప్రారంభం, 8వ తేదీ వరకు ఆప్షన్ల నమోదు గడువు

www.mannamweb.com


ఆంధ్రప్రదేశ్‌ ఎంబిబిఎస్‌ కోర్సుల్లో కన్వీనర్ కోటాలో చేరాలనుకునే విద్యార్థులు వెబ్ ఆప్షన్లను నమోదు చేయడానికి ఎన్టీఆర్‌ హెల్త్ యూనివర్శిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. సెప్టెంబర్ 8వ తేదీ వరకు విద్యార్థులు తమ ఆప్షన్లను నమోదు చేసుకోవచ్చు.

2024-25 విద్యా సంవత్సరంలో వైద్య విద్యలో ప్రవేశాల పొందే విద్యార్థులకు విజయవాడ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ కీలక అప్టేట్ ఇచ్చింది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

ఆంధ్రప్రదేశ్‌లోని మెడికల్ కాలేజీల్లో కన్వీనర్ కోటా ఎంబీబీఎస్ సీట్లను భర్తీ చేయడానికి వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవాలని విజయవాడ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వ విద్యాలయం బుధవారం నోటిపికేషన్ విడుదల చేసింది. సెప్టెంబర్ 4వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుంచి సెప్టెంబర్ 8వ తేదీ మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యార్థులు తమ ఆప్షన్లు ఎంచుకొనే అవకాశం ఉంది.

ఏపీలోని ఆంధ్రా విశ్వవిద్యాలయం పరిధిలో 10 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలతో పాటు, 11 ప్రైవేటు మెడికల్ కళాశాలల్లో మొత్తం 3520 సీట్లు ఉన్నాయి. వాటిలో ఆల్ ఇండియా కోటా కింద 246 సీట్లను మినహా యించి మిగిలిన 2072 సీట్లను కన్వీనర్ కోటాలో భర్తీ చేస్తారు.

తిరుపతి శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం (ఎస్వీయూ) పరిధిలో 7 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, 7 ప్రైవేటు వైద్య కళాశాలల్లో మొత్తం 2315 సీట్లు ఉన్నాయి. వీటిలో ఆల్ ఇండియా కోటాలో 195 సీట్లను మినహాయించి మిగిలిన 1533 సీట్లను భర్తీ చేస్తారు.

మైనార్టీ విద్యాసంస్థల్లో ఆంధ్రా యూనివర్శిటీ పరిధిలోని నిమ్రాలో 150 సీట్లకు 50 శాతం, ఎస్వీయూ పరిధిలోని కడప ఫాతిమా వైద్య కళాశాలలో 100సీట్లలో 50 సీట్లను కన్వీనర్ కోటాలో భర్తీ చేస్తారు. రాష్ట్ర వ్యాప్త వైద్య కళాశాలైన విజయవాడ సిద్దార్థలోని 175 ఎంబీబీఎస్ సీట్లలో ఆల్ ఇండియా కోటాలో 28 సీట్లు మిన హాయించి మిగిలిన 149 సీట్లు కన్వీనర్ కోటా కింద భర్తీ చేస్తారు.

ఇప్పటికే ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం 18,488 మందితో తాత్కాలిక మెరిట్‌ లిస్ట్‌ విడుదల చేసి రోస్టర్‌ పాయింట్ల ప్రకారం ర్యాంకులు కేటాయించింది. దీనిపై అభ్యంతరాలుంటే తెలియజేయాలని సూచించింది. అభ్యంతరాల పరిశీలన తర్వాత తుది మెరిట్ లిస్ట్‌ను కేటాయించనున్నారు.