కూటమి సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెగా డీఎస్సీ నియామక ప్రక్రియ ఇప్పటికే ముగిసిన సంగతి తెలిసిందే. అయితే ఈ నియామకాల్లో దొర్లిన తప్పిదాలు ఇప్పుడు అధికారులను చిక్కుల్లో పడేసే పరిస్థితి వచ్చింది.
అసలేం జరిగిందంటే.. ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ సెలక్షన్ లిస్టులో పేర్లు ఉండి కూడా ఉద్యోగాలు లభించని పలువురు అభ్యర్థులు తాజాగా రాష్ట్ర సచివాలయం వద్ద నిరసన చేపట్టారు. మేం 1:1 నిష్పత్తిలో డీఎస్సీ పోస్టులకు ఎంపికయ్యామని, మాకు అభినందనలు కూడా తెలిపారు. ఉద్యోగం ఖాయమని చెప్పారు. తీరా చూస్తే సెలక్షన్ లిస్టులో మా పేరు లేదు. అలాగని రిజెక్ట్ లిస్టులో కూడా మీ పేరు లేదు. మమ్మల్ని ఇంత మోసం ఎలా చేస్తారు? అంటూ పలువురు డీఎస్సీ అభ్యర్థులు వాపోయారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ సచివాలయం మెయిన్ గేట్ వద్ద ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆందోళన చేపట్టారు.
ఈ క్రమంలో మంత్రి లోకేశ్‌ను కలిసేందుకు అనుమతించాలని డిమాండ్ చేశారు. ధ్రువపత్రాల పరిశీలన కోసం పంపిన కాల్ లెటర్లు ప్రదర్శిస్తూ… తమకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు. మా పేర్లు లిస్టులో ఎందుకు లేవో ఎవరూ వివరించడం లేదని అన్నారు. ఇంటర్వ్యూకు హాజరయ్యాం. ధ్రుపపత్రాలు పరిశీలించారు. ఎంఈఓలు మాకు ఉద్యోగం వచ్చిందని అభినందించారు. మా పేర్లు సెలక్షన్ లిస్టులోను, రిజెక్టు లిస్టులోనూ లేవు. దీనిపై ఎవరూ స్పష్టత ఇవ్వట్లేదు. మేమంతా మధ్యతరగతి వాళ్లం. ఈ ఉద్యోగమే మా భవిష్యత్తు. అధికారుల నిర్లక్ష్యం వల్ల మాకు ఇలా అన్యాయం జరిగింది. ప్రభుత్వం స్పందించాలంటూ బాధిత అభ్యర్థులు కన్నీటి పర్యంతమయ్యారు.
తెలంగాణ ఎంబీబీఎస్ యాజమాన్య కోటా రెండో విడత సీట్ల కేటాయింపు పూర్తి
తెలంగాణ రాష్ట్రంలో యాజమాన్య కోటాలో రెండో విడత ప్రైవేటు కాలేజీల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తయినట్లు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రకటించింది. అక్టోబరు 10వ తేదీ మధ్యాహ్నం 3 గంటలలోపు సీటు పొందిన విద్యార్ధులు సంబంధిత కాలేజీల్లో రిపోర్టు చేయాలని యూనివర్సిటీ తన ప్రకటనలో స్పష్టం చేసింది.
































