జెంటిల్మన్‌తో అనవసరంగా కెలుక్కుంటున్నారు

www.mannamweb.com


మెగా ఫ్యామిలీ(Mega family)- అల్లు అర్జున్‌(allu arjun) మధ్య గొడవ రోజురోజుకు ముదురుతున్నదే కానీ సద్దుమణగడం లేదు. అందరూ మర్చిపోయారనుకుంటున్న టైమ్‌లో ఎవరో ఒకరు వివాదాన్ని కెలుకుతున్నారు.

నిజానికి ఈ గొడవలో అల్లు అర్జున్‌(Allu arjun) ఎప్పుడూ హద్దు మీరలేదు. హద్దుదాటి ప్రవర్తించలేదు. మాట తూలలేదు. పరోక్ష వ్యాఖ్యలు కూడా చేయలేదు. ఇప్పటికీ మెగాస్టార్‌ చిరంజీవి(Chiranjeevi) పట్ల అదే గౌరవాన్ని వ్యక్తపరుస్తారు. చిరంజీవి గాడ్‌ఫాదర్‌లాగే చూస్తారు. ఆయన గౌరవానికి ఎప్పుడూ భంగం కలిగించలేదు. చిరంజీవి అనే వ్యక్తి లేకపోతే తాను ఈస్థాయిలో ఉండేవాడినే కాదని మనసా వాచా కర్మణా బలంగా నమ్ముతాడు. ఆ కృతజ్ఞతా భావం అల్లు అర్జున్‌లో ఎప్పుడు కనిపిస్తుంటుంది. ఆ మాటకొస్తే మెగాస్టార్‌ చిరంజీవి లేకపోతే ఆ కాంపౌండ్‌ నుంచి పవన్‌ కల్యాణ్‌తో(Pawan kalyan) సహా ఇంత మంది హీరోలు వచ్చేవారే కాదు. చిరంజీవి తనకు మార్గ దర్శకుడు కాబట్టి ఆయన పట్ల పితృసమానమైన గౌరవం బన్నీకి ఉండాలి. అంతే కానీ చిరంజీవితో పాటు ఆయన తమ్ముళ్లను, మేనల్లులను, తమ్ముడి పిల్లలను అందరినీ గౌరవించాలనడం సబబు కాదు. అప్పుడెప్పుడే పవన్‌ విషయంలో చెప్పను బ్రదర్‌ అన్న దగ్గర్నుంచి రీసెంట్‌గా నాకు నచ్చితేనే వస్తా అనే కామెంట్‌ వరకు ఎక్కడా లైన్‌ దాటలేదు. ఈ రెండు వ్యాఖ్యలు చిరంజీవి గౌరవానికి భంగం కలిగించలేదు. మెగాస్టార్‌ను అవమానించలేదు. చెప్పను బ్రదర్‌ అన్న డైలాగుతో పవన్‌ ఫ్యాన్స్‌ బాగా నొచ్చుకున్నారు. నొచ్చుకునేంత భారమైన డైలాగేం కాదది! ఇతర హీరోల ఫంక్షన్‌లకు వెళ్లి జై పవన్‌ కల్యాణ్‌ అని నినాదాలు చేస్తుంటే ఆ హీరోలకు నొప్పి కలగకుండా ఎలా ఉంటుంది? ఇక మొన్నటి ఎన్నికల విషయానికి వస్తే .. నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌(YSRCP) అభ్యర్థిగా తన మిత్రుడు రవి(Ravi) పోటీ చేస్తున్నాడు కాబట్టి ప్రచారానికి వెళ్లాడు అల్లు అర్జున్‌. ఇందులో తప్పేముంది? పవన్‌ ఫ్యాన్స్‌కు తప్పు ఎందుకనిపించిందంటే పవన్‌ కల్యాణ్‌కు ట్వట్‌ ద్వారా విషెస్‌ చెప్పి, నంద్యాలకు ఎన్నికల ప్రచారానికి వెళ్లినందుకు! పవన్‌ ఫ్యాన్సే కాదు, నాగబాబు కూడా హద్దుమీరారు. ‘తమతో ఉంటూ ప్రత్యర్థుల కోసం పని చేసేవాడు తమ వాడైన పరాయివాడేనని, తమతో నిలబడేవాడు పరాయివాడైన తమ వాడే ‘ అంటూ త్రివిక్రమ్‌ స్టయిల్‌లో ఓ భారీ డైలాగ్‌ను సోషల్‌ మీడియాలో వదిలారు. అంతే అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌ విరుచుకుపడ్డారు. అప్పుడు కానీ నాగబాబుకు తను చేసిన తప్పేమిటో అర్థం కాలేదు. వెంటనే తన ఎక్స్‌ అకౌంట్‌ను డీ యాక్టివేట్‌ చేసుకున్నాడు. కొన్ని రోజుల పాటు దాని జోలికి వెళ్లలేదు. అంతా కామ్‌ అయ్యాక మళ్లీ రీ యాక్టివేట్‌ చేసుకున్నారు. ఆ ట్వీట్‌ తొలగించానని ప్రకటించుకున్నారు.

ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీ(TDP) సారథ్యంలోని కూటమి ఘన విజయం సాధించింది. జనసేన(Janasena) పార్టీ పోటీ చేసిన 21 స్థానాల్లోనూ గెలుపొందింది. ఈ విజయం మెగా హీరోలకు బూస్టునిచ్చింది. వారిలో ఉత్సాహం తన్నుకుని వచ్చింది. ఆవేశం ఎండకాలంలో థర్మామీటర్‌లోని పాదరసంలా సర్రుమని పైకి లేచింది. సాయిధరమ్‌ తేజ్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో అల్లు అర్జున్‌ను అన్ ఫాలో చేశాడు. దాని వల్ల ప్రయోజనమేమిటో ఆయనకే తెలియాలి. నాగబాబు కూతురు నీహారిక అంతే! తన కమిటీ కుర్రోళ్లు సినిమా ప్రమోషన్‌ కోసం హీరోలందరి మద్దతును కోరిందే తప్ప అల్లు అర్జున్‌ను మాటమాత్రం కూడా అడగలేదు. మొన్నామధ్య బెంగళూరుకు వెళ్లిన పవన్‌ కల్యాణ్‌ అక్కడో ఓ మాటన్నారు. కొన్నాళ్ల కిందట హీరోలు అడవులను రక్షించే పాత్రలు వేసేవారు. ఈ మధ్యన హీరోలు స్మగ్లర్‌ వంటి పాత్రలు వేస్తూ సొసైటీకి రాంగ్‌ మెసేజ్‌ ఇస్తున్నారు అన్న అర్థంలో ఓ వ్యాఖ్య చేశారు. ఇది ఎవరిని ఉద్దేశించి అన్నదో తెలుసుకోలేని అజ్ఞానలెవ్వరూ లేరు. మరి నీ మాటేమిటోనని అల్లు అర్జున్‌ ప్యాన్స్‌ ఎదురుతిరిగారు. గుడుంబా శంకర్‌, ఓజీల మాటేమిటని నిలదీయడంతో పవన్‌ కల్యాణ్‌ సైలెంటయ్యారు. రీసెంట్‌ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ యాక్టివిస్టు ప్రదీప్‌ చింతా ట్విట్టర్‌లో పవన్‌ను ఉద్దేశిస్తూ ఆ కామెంట్‌ పెట్టారు. దానికి సాయి ధరమ్‌ తేజ్‌ రెస్పాండ్‌ అయ్యారు. ఇద్దరి మధ్య మాటలు సాగాయి. ప్రదీప్‌ చింతా (chinta Pradeep)అడిగే ప్రశ్నలకు సాయి ధరమ్‌ తేజ్‌(Sai dharam tej) జవాబు చెప్పలేక సైలెంటయ్యాడు. ఇంత జరుగుతున్నా అల్లు అర్జున్‌ మాత్రం ఎక్కడా సీన్‌లోకి రాలేదు. ఎవరినీ ఏమీ అనలేదు. మెగా కాంపౌండ్‌ హీరోలు తెరమీదకు వచ్చారే తప్ప బన్నీ రాలేదు. బన్నీలో పరిణతి ఉంది. ‘నాకు ఇష్టమైతే వస్తా. నా మనసుకు నచ్చితే వస్తా’ అని తన స్టాండ్‌ ఏమిటో చెప్పాడే తప్ప ఎవరినీ విమర్శించలేదు. మెగా కాంపౌండ్‌ వాదనే చిత్రంగా ఉంది. పవన్‌కు సపోర్ట్ చేయాల్సిందేనని బన్నీని ఎలా అడుగుతారు? ఓ ఇంట్లో నలుగురు సభ్యులు ఉంటే నలుగురిదీ ఒకే అభిరుచి ఉండదు కదా! ఒకరు ఓ పార్టీకి సపోర్ట్ చేస్తే మరొకరు మరో పార్టీ పక్షాన నిలబడవచ్చు. అంత మాత్రం చేత ఆ కుటుంబం విచ్ఛిన్నం కాదు కదా! ఫ్యామిలీ అన్నాక ఆ రకమైన వాతావరణం ఉండాలి. ఎవరి అభిరుచి వారికి ఉంటుంది. ఫ్యామిలీ అంతా రెస్టారెంట్‌కు వెళ్లినప్పుడు ఇంటి యజమాని అందరికీ ఒకే ఫుడ్డు ఆర్డర్‌ ఇవ్వడు. ఎవరికి ఏం కావాలో ముందు అడుగుతాడు. ఆ సూత్రం అన్నింటా ఉంటుంది. అల్లు అర్జున్‌కు మాత్రం అభిరుచులు, చాయిస్‌లు ఉండకూడదా? తన తండ్రి బావ తమ్ముడు ఎన్నికల్లో నిలబడితే ఆయన కోసం ప్రచారం చేయాలన్న నిమయం ఏమి లేదు కదా! చేయకపోతే కొంపలేమి అంటుకోవు కదా! అలా బలవంతం పెట్టడం కూడా భావ్యం కాదు. అంది హుందాతనం అనిపించుకోదు. ఆత్మాభిమానం, ఆత్మగౌరం అంటూ స్టేట్‌మెంట్లు ఇస్తున్న వీరిలో టన్నుల కొద్ది అవి ఉన్నాయా అంటే అదీ లేదు. కొన్నాళ్ల కిందట బాలకృష్ణ వీరిని ఉద్దేశించే అలగాజనం, బురదజాతి, మా బ్లడ్‌ బ్రీడ్‌ వేరు అనేటటువంటి వ్యాఖ్యాలు ఎన్నో చేశారు. అప్పుడు ఆగ్రహంతో, వీరావేశంతో రేగిపోయిన వీరే ఇప్పుడు బాలకృష్ణ ముందు చేతులు కట్టుకుని నిల్చుంటున్నారు. అంతెందుకు 2018లో చంద్రబాబునాయుడును తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన పవన్‌ కల్యాణ్‌ ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు పక్కన డిప్యూటీ సీఎంగా ఉంటున్నారు. పైగా రోజూ తెలుగుదేశం పార్టీ క్యాడర్‌ కంటే ఎక్కువగా చంద్రబాబును పొగుడుతున్నారు. వీళ్లకు ఇలాంటి చాయిస్‌లు ఉండొచ్చు, తమ బాగు కోసం శత్రువుతో కూడా చేతులు కలపవచ్చు. అల్లు అర్జున్‌ మాత్రం తన స్నేహితుడి కోసం ఏమీ చేయకూడదు. ఇదెక్కడి లాజిక్‌! ఇందులో ఏమాత్రమైనా న్యాయం ఉందా? చిరంజీవిలా మిగతా వారు ఎందుకు హుందాగా ఉండలేకపోతున్నారు? అందరూ ఒక్కటిగా ఉంటే సంతోషపడేది మెగా ఫ్యామిలీనే కదా! ఎవరో ఒకరు పెద్ద మనసు చేసుకుని సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవడం మంచిది.