మలేరియా అనేది ప్రాణాంతక వ్యాధి. ఉష్ణమండల దేశాల్లో ఈ వ్యాధి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ మలేరియా వ్యాధిని నివారించడానికి, నయం చేయడానికి చికిత్స ఉంది. సరైన రోగ నిర్ధారణ, మెరుగైన చికిత్స లేకపోతే సంక్లిష్ట స్థితిలో ఉన్న మలేరియా ప్రాణాంతక వ్యాధిగా రూపాంతరం చెందుతుంది.
మలేరియా జీవిత చక్రం:
మలేరియా సంక్రమణ అనేది ఒక మనిషిని ఆడ అనాఫిలిస్ దోమ కుట్టడం ద్వారా ప్లాస్మోడియం పరాన్నజీవులు స్పోరోజాయిటెస్ రూపంలో రక్త ప్రవాహంలోకి ప్రవేశిస్తాయి. ఈ స్పోరోజాయిటెస్ వెంటనే కాలేయంలోకి ప్రవేశిస్తాయి. కాలేయ కణాల్లో ఈ స్పోరోజాయిటెస్ సంఖ్య అనేది అలైంగికంగానే 7 నుంచి 10 రోజుల్లోనే పెరిగిపోతుంది. ఈ సమయంలో ఎలాంటి లక్షణాలు కనిపించవు.
మలేరియా వ్యాప్తి కారణాలు:
మలేరియా అనేది ప్లాస్మోడియం పరాన్నజీవుల వల్ల కలిగే తీవ్రమైన జ్వరంతో కూడిన వ్యాధి. ఇది ఆడ అనాఫిలిస్ దోమల కాటు ద్వారా వ్యాప్తి చెందుతుంది. మలేరియా అంటువ్యాధి కాదు. ఇది ఒక మనిషి నుంచి మరొక మనిషికి వ్యాప్తి చెందదు. అనాఫిలిస్ దోమల కాటు ద్వారా మలేరియా సంక్రమిస్తుంది. 5 రకాల జాతులకు చెందిన పరాన్నజీవులు మనుషుల్లో మలేరియా వ్యాధి సంక్రమణకు కారణమవుతాయి. వీటిలో ప్లాస్మోడియం ఫాల్సిపరం, ప్లాస్మోడియం వైవాక్స్ పరాన్నజీవులు మాత్రం భారీ ముప్పును కలిగిస్తాయి. అనాఫిలిస్ దోమల్లో మొత్తం 400 రకాల జాతులు ఉన్నాయి. వీటిలో సుమారు 40 జాతుల దోమలు మలేరియా వ్యాప్తి వాహకాలుగా ఉన్నాయి. స్థానిక దోమలు సహా వివిధ కారకాల ఆధారంగా కొన్ని ప్రాంతాల్లో మలేరియా రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. సీజన్ మీద కూడా మలేరియా వ్యాప్తి అనేది ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా వర్షాకాలంలో ఉష్ణమండల దేశాల్లో మలేరియా రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది.
మలేరియా లక్షణాలు:
ప్రారంభ దశలో మలేరియా లక్షణాలు కూడా బ్యాక్టీరియా, వైరస్, పారాసైట్స్ కారణంగా వచ్చే ఇతర అంటువ్యాధులనే పోలి ఉంటాయి. మలేరియా అనేది ఫ్లూ వంటి లక్షణంతో మొదలవుతుంది.
జ్వరం (అతి సాధారణమైన లక్షణం)
చలి
తలనొప్పి
చెమట పట్టడం
అలసట
వాంతులు
వికారం
ఒళ్ళు నొప్పులు
నీరసంగా ఉన్నట్టు అనిపించడం
పిల్లల్లో లక్షణాలు:
పిల్లల్లో మలేరియా లక్షణాలు కూడా ఫ్లూ, జలుబు వ్యాధుల్లానే ఉంటాయి. ఈ లక్షణాలను కనిపెట్టడం చాలా కష్టం.
పిల్లల్లో మలేరియా ప్రారంభ లక్షణాలు:
చిరాకు
మగత (నిద్ర మబ్బు)
ఆకలి మందగించడం
నిద్ర పట్టకపోవడం
చలి
శ్వాస వేగంగా తీసుకోవడంతో పాటు జ్వరం
పిల్లల్లో మలేరియాకి కారణమయ్యే ఇతర లక్షణాలు:
అధిక ఉష్ణోగ్రత
చెమటలు పట్టడం
తలనొప్పి
గందరగోళానికి గురవ్వడం
అలసట
నీరసంగా అనిపించడం
కడుపు నొప్పి
డయేరియా (అతిసారం, నీళ్ల విరేచనాలు)
ఆకలి మందగించడం
కండరాల నొప్పులు
చర్మం పసుపుగా మారడం లేదా కళ్ళు తెల్లగా మారడం
గొంతు నొప్పి
దగ్గు
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
పిల్లల్లో మలేరియాకి తీవ్ర లక్షణాలు:
అలసట
గందరగోళం
మూర్ఛ
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
మలేరియా లక్షణాలు అనేవి దోమ కుట్టిన 6 నుంచి 30 రోజుల తర్వాత కనిపిస్తాయి. కొన్ని సందర్భాల్లో ఈ లక్షణాలు కనిపించడానికి ఏడాది సమయం పడుతుంది. చిన్న పిల్లలు, గర్భిణీలు తీవ్ర అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది.
పెద్దల్లో మలేరియా లక్షణాలు:
అధిక ఉష్ణోగ్రతతో కూడిన జ్వరం.. కొన్నిసార్లు 41 డిగ్రీల సెల్సియస్ కి చేరుతుంది.
15 నుంచి 60 నిమిషాల పాటు చలితో వణుకుతుంటారు.
కండరాల నొప్పులు
అలసట
తలనొప్పి
వికారం
వాంతులు
డయేరియా (నీళ్ల విరేచనాలు)
చెమట పట్టడం
గందరగోళం
ఆకలి మందగించడం
చర్మం పసుపు రంగులోకి మారడం లేదా కళ్ళు తెలుపు రంగులోకి మారడం
గొంతు నొప్పు
దగ్గు
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
నీరసంగా ఉన్న అనుభూతి కలగడం
పిల్లల్లో మలేరియా – తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
తాజా కూరగాయలు, తాజా పళ్ళు తినిపించాలి. దీని వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
పిల్లలకు ఎలాంటి పోషకాహారం ఇవ్వాలో అనేది పిల్లల వైద్యులను సంప్రదించి తెలుసుకోవాలి.
ఆరోగ్యకరమైన రసాలు, ద్రవాలను అందించాలి.
ఇంట్లో పరిసరాలను శుభ్రంగా ఉంచాలి. దోమలను ఇంట్లోకి రాకుండా జాగ్రత్త పడాలి.
పిల్లలకు జ్వరం వచ్చినప్పుడు వయసుకు తగ్గా మందులు మాత్రమే వేయాలి.
పెద్దల్లో మలేరియా – తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
సూర్యాస్తమయం తర్వాత డీఈఈటీ, ఐఆర్ 3535 లేదా ఐకారిడిన్ కలిగిన ఈపీఏ రిజిస్టర్డ్ క్రిమి వికర్షకాన్ని (ఇన్సెక్ట్ రిపెల్లెంట్) చర్మంపై పోసుకోవాలి.
సన్ స్క్రీన్ ని కూడా వేసుకోవచ్చు.
పొడవాటి చేతులు కలిగిన చొక్కాలు, ప్యాంట్లు ధరించాలి.
షర్ట్ ని ప్యాంటు లోపలకి దోపాలి. కాళ్ళకి సాక్సులు వేసుకోవాలి.
దోమ తెర కింద నిద్రపోవాలి. ముఖ్యంగా పెర్మెత్రిన్ వంటి పురుగుమందులతో చికిత్స అందే వీలు ఉంటుంది.
పెర్మెత్రిన్ కలిగిన ఉత్పత్తులను దుస్తులకు, దోమ తెరలకు అప్లై చేయవచ్చు.
కిటికీలు మూసేయండి.
కాయిల్స్ ని, వేపరైజర్స్ (ఆవిరికారకాలను) వాడండి.
మందులు వేసుకోండి.
మలేరియా సాధారణంగా ఉండే ఏరియాలకు వెళ్లే ముందు డాక్టర్ ని కలిసి కీమో ప్రొఫైలాక్సిస్ వంటి యాంటీ మలేరియల్ మందులు తీసుకోవాలి.
ఈ జాగ్రత్తలన్నీ మలేరియా ఉన్న ఏరియాకి వెళ్లే కొన్ని రోజుల ముందు పాటించాలి. అలానే ఆ ప్రాంతం నుంచి తిరిగి వచ్చాక కూడా కొన్ని వారాల పాటు పాటించాలి.
మలేరియా వ్యాధికి అందుబాటులో ఉన్న చికిత్సలు:
మలేరియా చికిత్స చేయదగిన వ్యాధి. ఆర్టెమిసినిన్ ఆధారిత కాంబినేషన్ థెరపీలు (ఏసీటీస్) అనేవి యాంటీమలేరియల్ మందులుగా ఇవాళ అందుబాటులో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రాణాంతక వ్యాధిగా ఉన్న ప్లాస్మోడియం ఫాల్సిపరం మలేరియాకి ఇది సిఫార్సు చేయబడిన చికిత్స విధానాల్లో ఒకటిగా ఉంది. ఏసీటీస్ అనేవి ఆర్టెమిసియా యాన్యువ, దాని అనుబంధ డ్రగ్ నుంచి సేకరించిన ఆర్టెమిసినిన్ ఉత్పన్నాలు సహా రెండు యాక్టివ్ ఫార్మాస్యూటికల్స్ ని వివిధ విధానాలతో కంబైన్ చేస్తాయి. మొదటి మూడు రోజుల చికిత్స సమయంలో ఆర్టెమిసినిన్ సమ్మేళనం మలేరియాకి కారణమైన పరాన్నజీవుల సంఖ్యను తగ్గించేస్తుంది. దీని అనుబంధ డ్రగ్ మిగతా పరాన్న జీవుల సంఖ్యను తొలగిస్తుంది.
ఆర్టెమిసినిన్ ఉత్పన్నాలకు ప్రత్యామ్నాయంగా ఇన్ని సంవత్సరాల్లో మార్కెట్లోకి ఎలాంటి మందులు అందుబాటులోకి వచ్చే అవకాశం లేనందున ఆర్టెమిసినిన్ మలేరియాకి చికిత్సగా ఉంది. అయితే ఈ మందుని ఒక వ్యక్తికి మలేరియా పాజిటివ్ అని నిర్ధారణ అయితేనే చికిత్స కోసం వాడాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) సిఫార్సు చేస్తుంది. అలా అని ఆర్టెమిసియా మొక్కకు చెందిన పదార్థాలను టీలో, ట్యాబ్లెట్స్ లో లేదా క్యాప్సుల్స్ లో వేసుకుంటే మలేరియా తగ్గుతుందని చేసే ప్రచారాలని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్స్ సపోర్ట్ చేయడం లేదు. గత దశాబ్ద కాలంగా యాంటీమలేరియల్ మందులనేవి మలేరియాను వ్యాప్తి చేసే పరాన్నజీవులను నిరోధించే ముప్పుగా ఉంటూ వ్యతిరేకంగా పోరాడుతున్నాయి. ఆర్టెమిసినిన్ అనేది మలేరియా సోకిన చాలా మంది రోగుల ఆరోగ్యాన్ని తిరిగి మామూలు చేయగలిగిందని.. ఇదొక్కటే మలేరియా వ్యాధికి చికిత్స అని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ధారించింది. రెండు వారాల్లో మలేరియా వ్యాధి నయమవుతుంది.
మలేరియా పరీక్షలు:
జ్వరం ఉన్న వ్యక్తికి రక్తపరీక్ష చేయడం అనేది చాలా అవసరం. ఈ పరీక్ష వల్ల ఆ వ్యక్తికి మలేరియా ఉందా లేదా అనేది తెలుస్తుంది. బ్లడ్ టెస్ట్ చేయకుండా ఆ వ్యక్తికి మలేరియా ఉందో లేదో అన్న విషయం డాక్టర్ కూడా చెప్పలేరు. మలేరియా టెస్ట్ పేరు అంటే బ్లడ్ టెస్ట్ ఒకటి ఉంది. ఈ బ్లడ్ టెస్టులో రెండు రకాలు ఉన్నాయి. ఒకటి స్లైడ్ టెస్ట్, రెండు ర్యాపిడ్ డయాగ్నోసిస్ టెస్ట్ (ఆర్డీటీ).
స్లైడ్ టెస్ట్:
వేలి నుంచి కొన్ని రక్తపు చుక్కలు తీసుకుని గాజు స్లైడ్ మీద వేస్తారు. ఆ తర్వాత దాన్ని మైక్రోస్కోప్ కింద ల్యాబరేటరీ టెక్నీషియన్ పరీక్షిస్తారు. ఆ పరీక్షల్లో టెక్నీషియన్ కనుక ప్లాస్మోడియం ఆర్గానిజమ్స్ ని ఉన్నట్లు గుర్తిస్తే కనుక స్లైడ్ టెస్ట్ నివేదిక పాజిటివ్ అని నిర్ధారించబడుతుంది. ఒకవేళ స్లైడ్ టెస్ట్ ని గ్రామంలోని హెల్త్ వర్కర్ చేస్తే కనుక.. వారు రక్తనమూనాను ల్యాబరేటరీకి పంపిస్తారు. రిపోర్ట్స్ రావడానికి కొన్ని రోజులు పట్టచ్చు. ఈ విధానం వల్ల రెండు రకాల మలేరియా వ్యాధిని గుర్తించవచ్చు.
ర్యాపిడ్ డయాగ్నోసిస్ టెస్ట్ (ఆర్డీటీ):
వేలి నుంచి ఒక చుక్క రక్తాన్ని సేకరించి వెంటనే టెస్ట్ స్ట్రిప్ మీద వేస్తారు. కొన్ని చుక్కల సొల్యూషన్ ని యాడ్ చేసిన కొన్ని నిమిషాల తర్వాత స్ట్రిప్ మీద ఒక ఎర్ర గీత కనబడుతుంది. రెండు ఎర్ర గీతలు కనబడితే కనుక ఫాల్సిపరం మలేరియా పాజిటివ్ అని నిర్ధారణ అయినట్టు. ప్రస్తుతం ఈ టెస్టు ద్వారా ఫాల్సిపరం మలేరియా ప్రమాదకర స్థితిని మాత్రమే గుర్తించగలదు. వైవాక్స్ మలేరియాని ప్రమాదకర స్థితిని గుర్తించడానికి కూడా ఈ ర్యాపిడ్ డయాగ్నోసిస్ టెస్ట్ అందుబాటులో ఉంది. ఈ టెస్టు వల్ల ల్యాబరేటరీ అవసరం ఉండదు. కేవలం 15 నిమిషాల్లోనే ఫలితం వస్తుంది. ఈ ర్యాపిడ్ డయాగ్నోసిస్ టెస్ట్ అనేది ముందుగానే ప్రాణాంతక మలేరియా రకాలను గుర్తించి ప్రాణాలను కాపాడడంలో ఉపయోగపడుతుంది. ఈ టెస్ట్ ఖరీదైనది. అయితే భారత ప్రభుత్వం ఉచితంగా ఈ టెస్టుని సరఫరా చేస్తుంది.
గమనిక: ఇది మీకు అవగాహన కోసం ఇవ్వబడిన సమాచారం మాత్రమే. మలేరియా చికిత్స విధానం, నివారణ వంటి విషయాల గురించి వైద్యులను అడిగి తెలుసుకోవడం మేలు.