హ్యాకింగ్ అనేది ప్రపంచ వ్యాప్తంగా అన్ని కంపెనీలకు పెద్ద సమస్యగా మారింది. దాని బారి నుంచి రక్షణ పొందటానికి ఆయా కంపెనీలు అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.
ప్రపంచంలోనే అతి పెద్ద ఐటీ కంపెనీ అయిన మైక్రోసాఫ్ట్ కూడా దీనికి మినహాయింపు కాదు. హ్యాకింగ్ బారి నుంచి తప్పించుకోవడానికి ఆ కంపెనీ తీసుకున్న నిర్ణయం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. చైనాలో పనిచేసే తమ కంపెనీ ఉద్యోగులు పని సంబంధిత విషయాలనే కేవలం ఐఫోన్లను మాత్రమే ఉపయోగించాని, ఆండ్రాయిడ్ పరికరాల వాడకాన్ని ఆపివేయాలని ఆదేశించింది.
భద్రతా కారణాలు..
మైక్రోస్టాఫ్ట్ కంపెనీ తీసుకున్న ఈ నిర్ణయం వెనుక భద్రతా పరమైన కారణాలు ఉన్నాయి. చైనాలో తమ సంస్థ సైబర్ సెక్యూరిటీని బలోపేతం చేయడమే దీని వెనుక ఉద్దేశం. మైక్రోసాఫ్ట్ కు చెందిన గ్లోబల్ సెక్యూర్ ఫ్యూచర్ ఇనిషియేటివ్ (ఎస్ఎఫ్ఐ)లో భాగంగా ఉద్యోగుల సైబర్ సెక్యూరిటీ పద్ధతులను మెరుగుపరుస్తోంది. తాజా ఆదేశాల ప్రకారం చైనాలో పనిచేస్తున్న ఆ కంపెనీ ఉద్యోగులు తాము పని చేసే కంప్యూటర్లు, ఫోన్లకు లాగిన్ అయినప్పుడు గుర్తింపు ధ్రువీకరణ కోసం కేవలం ఆపిల్ పరికరాలను మాత్రమే ఉపయోగించాలి.
డేటాకు ముప్పు లేకుండా..
చైనాలో గూగుల్ ప్లే సేవలు లేవు. హువాయ్, షియోమి వంటి స్థానిక కంపెనీలు తమ సొంత ప్లాట్ ఫాంలను డెవలప్ చేస్తున్నాయి. ఈ క్రమంలో ఆండ్రాయిడ్ ఫోన్ల ను ఉపయోగించడం వల్ల డేటాకు ఏదైనా ముప్పు ఏర్పడుతుందని మైక్రోసాఫ్ట్ భావిస్తోంది. అలాగే చైనా కూడా మైక్రోసాఫ్ట్ లాంటి సొంత ఆపరేటింగ్ సిస్టమ్ ను తయారు చేయడానికి ప్రయత్నాలు చేయడం కూడా దీనికి ప్రధాన కారణం.
సిబ్బందికి పరికరాలు..
ఈ నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ కంపెనీ ప్రస్తుతం ఆండ్రాయిడ్ హ్యాండ్ సెట్లను ఉపయోగిస్తున్న సిబ్బందికి ఐఫోన్ 15 పరికాలను అందజేస్తోంది. గూగుల్ సేవలు అందుబాటులో ఉన్న హాంకాంగ్‌తో సహా చైనాలోని వివిధ హబ్‌లలో వీటిని అందుబాటులో ఉంచాలని నిర్ణయం తీసుకుంది.
హ్యాకర్ల నుంచి రక్షణ..
ఇటీవల పెరుగుతున్న భద్రతాపరమైన ఆందోళనల నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ ఈ చర్య తీసుకుంది. హ్యాకర్ల నుంచి ఆ కంపెనీ పదే పదే దాడులను ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ ఎస్ఎఫ్ఐ ద్వారా అత్యంత ప్రతిష్టాత్మకమైన భద్రత చర్యలకు నడుంబిగించింది.
సైబర్ భద్రత..
మైక్రోసాఫ్ట్ తీసుకున్న కొత్త నిర్ణయాన్ని బహిరంగంగా తెలియజేయలేదు. కానీ ప్రపంచవ్యాప్తంగా సైబర్ భద్రతను మెరుగుపరచడానికి ఆ కంపెనీ తీసుకున్న చర్యగా దీనిని భావిస్తున్నారు. క్లౌడ్ దుర్బలత్వాలను వేగంగా పరిష్కరించడం, క్రెడెన్షియల్ రక్షణను బలోపేతం చేయడం, ఉద్యోగుల కోసం బహుళ కారకాల ప్రమాణీకరణను అమలు చేయడం వంటివి దీనిలో ఉన్నాయి.