Car Subscription: కొనకుండానే షి’కారు’ కల సాకారం.. ఈ కొత్త మోడల్‌తో నెలకో కొత్త కారు మీ సొంతం..

రోనా అనంతర పరిణామాల్లో కార్లలో ప్రయాణాలు పెరిగాయి. పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ కన్నా ఏదైనా కారులో అయితే కుటుంబంతో కలిసి ప్రయాణించొచ్చు అని ఎక్కువ శాతం మంది భావిస్తున్నారు.


ఈ క్రమంలో కార్ల వినియోగం పెరిగింది. అయితే కొంత మందికి కార్లల ప్రయాణం అంటే ఇష్టం ఉంటుంది కానీ.. దానిని కొనేంత స్తోమత ఉండదు. పోనీ సెకండ్ హ్యాండ్ కారు కొందామంటే దానికొచ్చే రిపేర్లు ఇబ్బంది పెడతాయి. అందుకే మరో ఆప్షన్లో మార్కెట్లో అందుబాటులోకి వచ్చింది. అదే కార్ సబ్‌స్క్రిప్షన్ లేదా లీజ్ మోడల్. అన్ని ప్రముఖ ఆటోమోబైల్ కంపెనీలు ఈ విధానాన్ని అమలు చేస్తున్నాయి. ఈ సబ్‌స్క్రిప్షన్ మోడల్లో మీకు నచ్చిన కారును మీరు కోరుకున్నంత కాలం పాటు వాడుకునేందుకు అవకాశం ఉంటుంది. అందుకోసం ప్రతి నెలా నిర్ధేశిత మొత్తం చెల్లిస్తే సరిపోతోంది. కార్ మెయింటెనెన్స్ తో మీకు పనిలేదు.. జస్ట్ పెట్రోల్ లేదా డీజిల్, టోల్ చార్జీలు చెల్లించుకుంటే సరిపోతుంది. వినడానికి బావుంది కదా.. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

కార్ సబ్‌స్క్రిప్షన్ మోడల్ ఇదే..

దేశంలోని దాదాపు అన్ని ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు ఈ కార్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్లను అందిస్తున్నాయి. అయితే మీరు ఈ మోడల్ ని సబ్ స్కైబ్ చేసుకోవాలంటే కొంత మొత్తాన్ని మీరు డిపాజిట్ చేయాల్సి వస్తుంది. అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పాలంటే డౌన్ పేమెంట్ చెల్లించాల్సి వస్తుంది. మీరు ఎంచుకున్న కారు మోడల్ ని బట్టి మీరు చెల్లించాల్సిన డిపాజిట్ ఆధారపడి ఉంటుంది. దీంతో పాటు ప్రతి నెల దానికి అద్దె చెల్లించాల్సి ఉంటుంది.

కార్ సబ్‌స్క్రిప్షన్ మోడల్ వల్ల ప్రయోజనాలు..

  • కారు కొనుగోలు చేయాలంటే అది చాలా ధనంతో కూడుకున్నది. దాని కోసం లోన్లు తీసుకోవడం, ప్రతి నెలా దానిని చెల్లించడం ఇబ్బందిగా ఉంటుంది.
  • అలాగే ఎక్కువగా కార్లు మారుస్తూ ఉండే వారికి ఇది బాగా ప్రయోజనకరంగా ఉంటుంది. మీకు నచ్చిన కారు కోసం సబ్ స్రైబ్ చేసుకోవచ్చు.. ఎప్పుడు కావాలంటే అప్పుడు వదులుకోవచ్చు.
  • అయితే కారు మీ వద్ద ఉన్నప్పుడే చేయాల్సిన మెయింటెనెన్స్, ఇన్సురెన్స్, ట్యాక్స్ వంటి వన్నీ మీరు నెలవారీ చెల్లించే ఫీజులోనే కవర్ అవుతాయి.
  • మన దేశంలో ఈ విధంగా అంతగా ప్రాచుర్యంలోకి రాలేదు గానీ.. యూఎస్, యూరోప్ లలో ఈ ట్రెండ్ పాపులర్ అయ్యింది.
  • మీరు వెళ్లే దూరాలను ముందుగానే చెబితే.. తక్కువ దూరాలు ఉంటే మీ సబ్​స్క్రిప్షన్ చార్జీలు కూడా బాగా తగ్గుతాయి. ఒకవేళ తక్కువ దూరాలకు సబ్​స్క్రిప్షన్ తీసుకుని ఎక్కువ దూరాలు వెళ్తే.. అదనపు చార్జీలు చెల్లించాల్సి వస్తుంది.

కార్ సబ్​స్క్రిప్షన్ ఎలా తీసుకోవాలి..

మన దేశంలో ఈ సబ్​స్క్రిప్షన్ ప్లాన్ తీసుకోవాలంటే వ్యక్తుల పాన్ కార్డు, ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్ కం ప్రూఫ్ సమర్పించాల్సి ఉంటుంది. వ్యాపారం కోసం తీసుకుంటే మీ బ్యాంక్ స్టేట్ మెంట్లు, ఐటీ రిటర్న్ కూడా ఇవ్వాలి. కంపెనీ పేరు మీద తీసుకుంటే ఆరు నెలల ఆ కంపెనీ బ్యాంక్ స్టేట్ మెంట్ కూడా సమర్పించాలి.

కార్ రెంటల్‌కి కార్ సబ్​స్క్రిప్షన్‌కి తేడా ఏంటి..

ఈ విధానం గురించి చెప్పగానే చాలా మందికి కార్ రెంటల్ గుర్తొచ్చి ఉంటుంది. అయితే కార్ రెంటల్స్ కి కార్ సబ్​స్క్రిప్షన్ కి చాలా తేడా ఉంది. కార్ రెంటల్ అనేది తక్షణ అవసరాల కోసం మాత్రం ఉపయోగపడే పద్ధతి మాత్రమే. ఏదైనా ట్రావెల్ ఏజెన్సీ నుంచి కారును అద్దెకు తీసుకుని, గంటలు, రోజుల వ్యవధిలో కారును వాడుకోవచ్చు. అదే సమయంలో కార్ సబ్ సబ్​స్క్రిప్షన్ అనేది నెలవారీగా ఉంటుంది. దీని కోసం ముందుగానే కొంత డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఈ సబ్​స్క్రిప్షన్ తో పోల్చితే రెంటల్స్ ఖర్చు ఎక్కువగా ఉంటుంది.