ఏపీ రాజకీయాల్లో కొత్త ట్రెండ్ కనిపిస్తోంది. సాధారణంగా ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా, ప్రభుత్వ పథకాలకు ఆ ప్రభుత్వాధినేత ఫోటోలు, సంబంధిత శాఖ మంత్రి ఫోటోలు పెట్టడం ఆనవాయితీగా వస్తోంది.
కానీ,విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. విద్యాశాఖను పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉంచుతూ ప్రశంసలు పొందుతున్నారు.
లోకేష్ ప్రతి సందర్భంలోనూ చెప్తూనే ఉన్నారు. ఆయన మొదట విద్యాశాఖను తీసుకునే ముందు సవాల్ తో కూడుకున్న శాఖను తీసుకుంటున్నావ్ అని ఆయన హితం కోరేవారు చాలామంది చెప్పారట.వారందరికీ ఆయన చెప్పింది ఒక్కటే. సవాళ్ళను తట్టుకొని కొత్త చరిత్రను సృష్టించడం నా టార్గెట్ అని. ఇప్పుడు లోకేష్తన పనితీరుతో కొత్త చరిత్రకు జీవం పోస్తున్నారు.
వైసీపీ హయాంలో పాఠశాలలు సైతం రాజకీయాలకు అడ్డాగా ఉండేవనేది ఓపెన్ సీక్రెట్. గతంలో పాఠశాలలకు ఉన్న పార్టీ రంగులను లోకేష్ బాధ్యతలు తీసుకున్నాక తొలగించడమే కాకుండా, విద్యార్థులకు అందించే కిట్లు, నోట్ బుక్స్ , స్పోర్ట్స్ మెటిరియల్ పై ఎక్కడ తన ఫోటోకానీ, చంద్రబాబు ఫోటోకానీ ఉండొద్దు అని లోకేష్ తీసుకున్న డెసిషన్ ఆయన చిత్తశుద్దికి నిదర్శనం.
గురువారం ప్రకటించిన పదో తరగతి ఫలితాల సందర్భంగా ప్రముఖ దినపత్రికల్లో నేడు ఫుల్ పేజీ యాడ్స్ పత్రిక ప్రకటనలు అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశాయి. ప్రభుత్వ ప్రకటనలో ఖచ్చితంగా సీఎం, మంత్రుల ఫోటోలు తప్పనిసరిగా ఉండటమే కాకుండా, పెద్దగా కూడా ఉంటాయి. కానీ,ఈరోజు వచ్చిన యాడ్స్ లో ఎక్కడా సీఎం, మినిస్టర్స్ ఫొటోస్ లేవు. కేవలం విద్యార్థులు, వారు సాధించిన మార్కులు, స్కూల్స్ డీటెయిల్స్ మాత్రమే ప్రచురించారు.
కార్పోరేట్ స్కూల్స్ కు ధీటుగా ప్రభుత్వ విద్యాసంస్థలను మార్చడమే లక్ష్యంగా లోకేష్ శ్రమిస్తున్నారు. ఇందుకోసం ఏమేం చేయాలన్నదానిపై ఫోకస్ పెట్టి, వాటన్నింటిని చక్కబెడుతున్నారు. ప్రభుత్వ పాఠశాలలపై రాష్ట్రవ్యాప్తంగా నమ్మకాన్ని కల్గించడమే కాకుండా, ఎక్కడైనా ఏదైనా పొరపాటు జరిగితే దాన్ని రాజకీయ కోణంలో కాకుండా తప్పను అంగీకరించి, పరిష్కారాన్ని చూపడంతో లోకేష్ విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు.
రాజకీయాలకు విద్యాశాఖను దూరంగా ఉంచుతూ ఆయన సాగిస్తున్న ఈ పవిత్ర యజ్ఞం..స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. ఆయన అనుసరిస్తున్న ఈ విధానం వచ్చే విద్యాసంవత్సరం మరిన్ని రాష్ట్రాలు అనుసరించే అవకాశం లేకపోలేదు.











