ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇన్ సర్వీస్ టీచర్లకు ప్రత్యేకంగా టెట్ నిర్వహించాలని నిర్ణయించింది. ఈ పరీక్షను ఈ ఏడాది డిసెంబరులో నిర్వహించే అవకాశం ఉంది. దీనిపై పాఠశాల విద్యాశాఖ ఇప్పటికే ఫైలు పెట్టింది. ఇటీవల టెట్ నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ ప్రత్యేకంగా నిర్వహించాలని ఉపాధ్యాయుల నుండి డిమాండ్లు పెరిగాయి. రాష్ట్రంలో సుమారు 80 వేల మందికి పైగా ఇన్ సర్వీస్ టీచర్లు టెట్ అర్హత పొందాల్సి ఉంది. టీచర్లందరూ టెట్ అర్హత సాధించాల్సిందేనని గతేడాది సెప్టెంబరులో సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరించింది.
ఈ క్రమంలో పలు విద్యారంగ అంశాలపై ఎమ్మెల్సీలు భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, వేపాడ చిరంజీవి, కంచర్ల శ్రీకాంత్ సోమవారం విద్యాశాఖ మంత్రి లోకేశ్ ను, పాఠశాల విద్య డైరెక్టర్ తమీమ్ అన్సారీని వేర్వేరుగా కలిశారు. ఈ సమావేశాల్లో ప్రత్యేక టెట్ కు సానుకూల నిర్ణయం వచ్చింది. ఇప్పటికే ఇచ్చిన టెట్ నోటిఫికేషన్ లోనూ ఇన్ సర్వీస్ టీచర్లు దరఖాస్తు చేసుకుని టెట్ రాసుకోవచ్చు. గతేడాది చివర్లో నిర్వహించిన టెట్ లో 15 వేల మందికి పైగా ఇన్ సర్వీస్ టీచర్లు టెట్ అర్హత సాధించారు. మిగిలిన వారి కోసం ప్రత్యేక టెట్ నిర్వహించనున్నారు.
ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిల విషయంలోనూ ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఇకపై ప్రతినెలా రూ.200 కోట్లు చొప్పున నిధులు విడుదల చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. అలాగే ఏపీపీఎస్సీ ద్వారా జరిగే నోటిఫికేషన్లలో గరిష్ఠ వయోపరిమితిని రెండు లేదా మూడు సంవత్సరాలు పెంచే అవకాశం కనిపిస్తోంది. కాంట్రాక్టు, మినిమం టైమ్ స్కేలుపై పనిచేస్తున్న టీచర్లకు పదవీ విరమణ వయసును 60 నుండి 62 సంవత్సరాలకు పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది.
2003లో నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలు పొంది 2004 తర్వాత ఉద్యోగాల్లో చేరిన వారికి పాత పెన్షన్ స్కీమ్ అమలుకు ఇప్పటికే నిర్ణయం తీసుకోగా, త్వరలో అధికారికంగా ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. దీంతో 11 వేల మంది టీచర్లకు మేలు జరుగుతుంది. గతేడాది బదిలీల్లో బదిలీ అయినా పాత స్థానాల్లోనే కొనసాగుతున్న 900 మంది టీచర్లను ఈనెలలో బదిలీ స్థానానికి పంపేందుకు పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపడుతోంది.
ఈ పరిణామాలతో రాష్ట్ర ఉపాధ్యాయుల్లో ఆశావహత నెలకొంది. ప్రత్యేక టెట్ నిర్వహణ, పెన్షన్ స్కీమ్ అమలు, వయోపరిమితి పెంపు, ఫీజు రీయింబర్స్ మెంట్ తదితర అంశాలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించడం ఉపాధ్యాయ సంఘాలను సంతృప్తిపరిచింది. ఇక కొత్త ఉత్తర్వులతో ఉపాధ్యాయుల సమస్యలకు పూర్తి స్థాయిలో పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నారు.





















