‘మత్తు వదలరా’, ‘మత్తు వదలరా 2’ విజయాలు సాధించడంలో కమెడియన్ సత్యది కీలక పాత్ర.
ఆ సినిమాల దర్శకుడు రితేష్ రాణాతో సత్య చేసిన తాజా సినిమా ‘జెట్లీ’. ఇందులో ఆయన హీరో. ‘వెన్నెల’ కిశోర్ కీలక పాత్ర చేశారు. రియా సింఘా హీరోయిన్. మే 1న థియేటర్లలో విడుదలైందీ సినిమా. ‘మత్తు వదలరా’ తరహాలో నవ్వించారా? ఈ సినిమా ఎలా ఉంది? అంటే…
కథ (Jetlee Movie Story): ప్రజలు తమ బ్యాంకులో డిపాజిట్ చేసిన డబ్బును క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్ చేస్తారు ప్రజాపతి బ్యాంకు ఫౌండర్ ప్రజాపతి (అజయ్). సుమారు 15 వేల కోట్లు గల్లంతు కావడంతో బ్యాంకు దివాలా తీస్తుంది. దాంతో విదేశాలకు పారిపోతాడు ప్రజాపతి. అతణ్ణి వెనక్కి తీసుకు రావడానికి ఏజెంట్ శివానీ రాయ్ (రియా సింఘా)ను నియమిస్తారు. ప్రజాపతిని పట్టుకుని ప్రత్యేక విమానంలో ఇండియాకు తీసుకు వస్తున్న తరుణంలో ఎటాక్ జరుగుతుంది.
ప్రజాపతిని చంపాలని కొందరు, అతణ్ణి ప్రాణాలతో వేరే దేశానికి తరలించాలని మరికొందరు ప్రయత్నిస్తారు. ఆ విమానంలో ఉన్న జెట్లీ అలియాస్ డాక్టర్ వేదవ్యాస్ (సత్య) ఏం చేశాడు? అతను గతం ఎలా మర్చిపోయాడు? ప్రజాపతికి, జెట్లీకి ఉన్న సంబంధం ఏమిటి? చివరకు ఏమైంది? అనేది సినిమా.
విశ్లేషణ (Jetlee Review Telugu): మెమరీ లాస్ కాన్సెప్ట్ తెలుగు ప్రేక్షకులకు కొత్త కాదు. గతం మరవడానికి ముందు ‘గజినీ’లో మంచి ప్రేమ కథ, మరిచిన తర్వాత సీరియస్ యాక్షన్ చూశారు. ‘బాసూ మనకు మెమరీ లాస్’ అంటూ ‘కిక్’లో రవితేజ కావాల్సినంత నవ్వించారు. ఆ సినిమాలో మెమరీ లాస్ అలీ రోల్ సైతం ఎంతో నవ్విస్తుంది. ఆ మెమరీ లాస్ కాన్సెప్ట్ తీసుకుని సినిమా స్టార్టింగ్ టు ఎండింగ్ నవ్వించాలని ట్రై చేశారు దర్శకుడు రితేష్ రాణా.
కామెడీ సన్నివేశాలు తీయడంలో రితేష్ రాణాకు ఓ స్టైల్ ఉంది. ‘మత్తు వదలరా’లో ప్రేక్షకులు చూశారు. ఆ కామెడీని ఎంజాయ్ చేశారు. రితేష్ రాణాది టిపికల్ రైటింగ్ స్టైల్. కామెడీ వర్కవుట్ అయితే ‘మత్తు వదలరా’ టైపు విజయం వస్తుంది. బ్యాలెన్స్ తప్పితే ‘హ్యాపీ బర్త్ డే’ అవుతుంది. ఆ సినిమా కమర్షియల్గా ఫెయిల్ అయినా… సత్య, ‘వెన్నెల’ కిశోర్ కామెడీ సీన్స్ కొన్ని బావుంటాయి. ఈసారి వాళ్లిద్దరూ ఫుల్ లెంగ్త్ రోల్స్ చేసినా కామెడీ ఆశించినంత లేదు. ఇటువంటి సినిమాలకు సీన్స్, కామెడీ టైమింగ్ ఇంపార్టెంట్. అందులోనూ కథంతా ఒక్క చోట తిరిగేటప్పుడు ఆ విషయం ప్రేక్షకుల దృష్టిలోకి రాకుండా నవ్వించాలి. బ్యాక్ టు బ్యాక్ థ్రిల్ ఇవ్వాలి.
‘జెట్లీ’కి బ్యాడ్ లక్ ఏమిటంటే… ఇంటర్వెల్ వరకు కథ అసలు ముందుకు కదలదు. అక్కడక్కడే తిరిగిన ఫీలింగ్ కలుగుతుంది. ప్రీ ఇంటర్వెల్ ట్విస్ట్, అక్కడ యాక్షన్ సీక్వెన్స్ కాస్త ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాయి. ఇంటర్వెల్ తర్వాత ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తూ థ్రిల్ & కామెడీ పంచాలని చూశారు. హైజాక్, బాంబు బ్లాస్ట్ అంటూ చిత్ర విచిత్రమైన సన్నివేశాలు రాశారు. స్పూఫ్ కామెడీ చేయాలని చూశారు. చిరు, బాలయ్య రిఫరెన్సులు ఇచ్చారు. అయితే ఏదీ వర్కవుట్ కాలేదు. అంతా సాగదీత వ్యవహారంలా అనిపించింది. చివరిలో వచ్చే ఓ ట్విస్ట్ మాత్రం ఓకే అనిపిస్తుంది.
రైటింగ్ పరంగా రితేష్ రాణా & టీమ్ ఫెయిల్యూర్ ‘జెట్లీ’లో కనిపిస్తుంది. కామెడీకి నో రూల్స్ ఏమీ ఉండవు. ఇటువంటి సినిమాలకు ప్రేక్షకులు లాజిక్కులూ చూడరు. ఓ పంచ్ పేలితే చాలు నవ్వేస్తారు. కానీ, అటువంటి నవ్వులు కొన్ని మాత్రమే ‘జెట్లీ’లో ఉన్నాయి. టెక్నికల్ పరంగా కాలభైరవ నేపథ్య సంగీతం బావుంది. సుజీత్ సారంగ్ కెమెరా వర్క్ & ప్రొడక్షన్ డిజైన్ ట్యాలెంట్, ప్రొడ్యూసర్లు పెట్టిన ఖర్చు ఫ్లైట్లో కనిపించింది. అదంతా బూడిదలో పోసిన పన్నీరు అయ్యింది.
సత్య మంచి కమెడియన్. యంగ్ జనరేషన్లో అటువంటి టైమింగ్ రేర్. కథ, సీన్ వంటి వాటితో సంబంధం లేకుండా నవ్వించగలరు. అయితే ‘జెట్లీ’లో ఆ సత్య మిస్ అయ్యారు. కొన్ని చోట్ల నవ్వించారు. కానీ, మెజారిటీ పోర్షన్స్ చూస్తే సక్సెస్ కాలేదు. ‘వెన్నెల’ కిశోర్ మాత్రం నవ్వించారు. హీరోయిన్ రియా సింఘాకు యాక్షన్ చేసే అవకాశం వచ్చింది. యాక్షన్ సీన్లు వరకు బాగా చేశారు. అజయ్, కబీర్ సింగ్ దుహాన్, వడ్లమాని శ్రీనివాస్ వంటి నటీనటులు రొటీన్ రోల్స్ చేశారు.
సత్యతో ‘మత్తు వదలరా’ తరహా వినోదాన్ని దర్శకుడు రితేష్ రాణా అందిస్తారని అనుకుంటే… మరో ‘హ్యాపీ బర్త్ డే’ తీశారు. సత్య & వెన్నెల కిశోర్ కొంత కామెడీ చేశారు. అయితే… రెండు గంటలు థియేటర్లలో కూర్చోబెట్టడానికి ఆ కామెడీ సరిపోదు. రైటింగ్, ఎగ్జిక్యూషన్లో రితేష్ రాణా లెక్క తప్పింది. దాంతో కామెడీకి బదులు బోరింగ్ మూమెంట్స్ ఎక్కువ అయ్యాయి. థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకులు ఎంటర్టైన్ అవ్వడం బహుత్ కష్ట్ హై.
















