ప్రపంచ సినిమా వేదికపై అత్యున్నత పురస్కారంగా భావించే ఆస్కార్ నిబంధనలు మారాయి. 2027లో జరగనున్న 99వ ఆస్కార్ వేడుకల కోసం అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.
భారతీయ నిర్మాతల్లో
ఈ మార్పులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ సర్కిల్స్‌లో చర్చనీయాంశంగా మారడమే కాకుండా, భారతీయ చిత్రనిర్మాతల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తున్నాయి. ముఖ్యంగా ‘బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్’ కేటగిరీలో భారత్ వంటి దేశాలకు ఇది పెద్ద ఊరటనిచ్చే పరిణామం.
భారత చిత్రాలకు బహుళ అవకాశాలు
ఇప్పటివరకు ఉన్న నిబంధనల ప్రకారం, ‘ఉత్తమ అంతర్జాతీయ చిత్రం’ కేటగిరీకి ప్రతి దేశం నుంచి కేవలం ఒక్క సినిమాను మాత్రమే అధికారికంగా పంపే అవకాశం ఉండేది. దీనివల్ల మన దేశంలో ఆర్ఆర్ఆర్ వంటి భారీ చిత్రాలు వచ్చినా, ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎంపిక చేసిన ఒకే ఒక్క సినిమాకే ఆస్కార్ రేసులో ఉండే అర్హత దక్కేది.
కానీ, ఇప్పుడు సీన్ మారింది. ఆయా దేశాల అధికారిక ఎంట్రీలతో సంబంధం లేకుండా.. బెర్లిన్, కేన్స్, వెనిస్, సన్ డాన్స్, టొరంటో లేదా బుసాన్ వంటి ప్రతిష్టాత్మక అంతర్జాతీయ చలనచిత్ర వేడుకల్లో టాప్ అవార్డులు గెలుచుకున్న సినిమాలు నేరుగా ఆస్కార్ బరిలో నిలబడొచ్చు. అంటే, భవిష్యత్తులో భారత్ నుంచి ఒకే ఏడాది రెండు మూడు సినిమాలు కూడా ఆస్కార్ నామినేషన్ల కోసం పోటీ పడొచ్చు.
నటీనటులకు డబుల్ ధమాకా
మరో ఆసక్తికరమైన మార్పు యాక్టింగ్ కేటగిరీలో జరిగింది. గతంలో ఒక నటుడు ఒకే కేటగిరీలో (ఉదాహరణకు బెస్ట్ యాక్టర్) రెండు వేర్వేరు సినిమాలకు టాప్ ఓట్లు సాధించినా, కేవలం ఒకే సినిమాకు మాత్రమే నామినేషన్ ఇచ్చేవారు. ఇకపై అలా కాదు. ఒక నటుడు రెండు వేర్వేరు చిత్రాల్లో అద్భుత ప్రదర్శన ఇచ్చి, రెండింటికీ ఓట్లు సాధిస్తే.. ఆ రెండింటికీ నామినేషన్లు పొందే వీలుంటుంది. ఇది నటీనటుల ప్రతిభకు దక్కే నిజమైన గౌరవంగా విశ్లేషకులు భావిస్తున్నారు.
ఏఐ (AI) పై ఉక్కుపాదం
సాంకేతికత పెరిగిపోతున్న తరుణంలో ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’ (AI) సృష్టించే ముప్పును అకాడమీ ముందుగానే పసిగట్టింది. నటీనటుల విభాగంలో మానవ ప్రమేయం తప్పనిసరి అని స్పష్టం చేసింది. నటుల అనుమతి లేకుండా వారి రూపాన్ని వాడినా (Likeness), ఏఐ సాయంతో పాత్రలను సృష్టించినా అవి అనర్హమవుతాయి.
రచన విభాగంలో కూడా స్క్రిప్ట్ కచ్చితంగా మనిషి రాసి ఉండాలని, ఏఐ వాడకంపై పూర్తి సమాచారం ఇవ్వాలని ఆదేశించింది. సాంకేతికత ఎన్ని మార్పులు తెచ్చినా, మనిషి సృజనాత్మకతకే అగ్రతాంబూలం అని అకాడమీ నొక్కి చెప్పింది.
డైరెక్టర్లకే క్రెడిట్
ఇప్పటివరకు బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ అవార్డు గెలిస్తే, ఆ గౌరవం సదరు దేశానికి దక్కినట్లుగా భావించేవారు. కానీ 2027 నుంచి ఈ అవార్డును ఆ చిత్ర దర్శకుడికి ప్రధానం చేస్తారు. ఆస్కార్ రికార్డు పుస్తకాల్లో కూడా దర్శకుడి పేరే ప్రముఖంగా కనిపిస్తుంది.
అలాగే కాస్టింగ్ డైరెక్టర్లకు ఇచ్చే స్టాచ్యూల సంఖ్యను రెండు నుంచి మూడుకు పెంచారు. సినిమాటోగ్రఫీ, విజువల్ ఎఫెక్ట్స్ వంటి విభాగాల్లో కూడా ఓటింగ్ ప్రక్రియను మరింత పారదర్శకంగా మార్చారు.
99వ ఆస్కార్ వేడుకలు 2027 మార్చి 14న జరగనున్నాయి. ఈ కొత్త నిబంధనలు ఆస్కార్ రేసును మరింత రసవత్తరంగా మార్చడమే కాకుండా, ప్రతిభ గల దర్శకులకు ప్రపంచ వేదికపై గుర్తింపు తెచ్చేలా ఉన్నాయి.



















