ఒక నగరం భూమి మీద నిర్మించబడటం సహజం.. కానీ ఒక మహా నగరం నెమ్మదిగా భూమిలోకి కూరుకుపోతుంటే? వినడానికి వింతగా ఉన్నా, సుమారు 2.2 కోట్ల జనాభా నివసించే మెక్సికో నగరం ఇప్పుడు సరిగ్గా ఇలాంటి వినాశకరమైన పరిస్థితినే ఎదుర్కొంటోంది.
నాసా (NASA) ఉపగ్రహ డేటా విశ్లేషణ ప్రకారం, ఈ నగరం ప్రతి ఏటా దాదాపు 10 అంగుళాల (25 సెం.మీ) మేర భూమిలోకి మునిగిపోతోంది. అంతరిక్షం నుంచి సైతం స్పష్టంగా కనిపిస్తున్న ఈ ‘కుంగుదల’ ఆ నగర భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తోంది.
సుమారు 3,000 చదరపు మైళ్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ నగరం, ప్రాచీన సరస్సు అడుగున మెత్తటి మట్టిపై నిర్మితమైంది. శతాబ్దాల క్రితం ఇక్కడి వీధులు కాలువలుగా ఉండేవంటే ఆశ్చర్యం కలగక మానదు. పునాదుల్లో ఉన్న ఈ మట్టి నైజం వల్ల నగరం ఎప్పుడూ కాస్త కుంగిపోతూనే ఉండేది. అయితే, గత వందేళ్లుగా పెరుగుతున్న జనాభా అవసరాల కోసం భూగర్భజలాలను విపరీతంగా తోడటం వల్ల పరిస్థితి విషమించింది. భూమి పొరల్లో ఉన్న నీటి నిల్వలు (Aquifers) కుంచించుకుపోవడంతో, భూమి కుంగే వేగం గణనీయంగా పెరిగింది.
చారిత్రక సంపదకు ‘గ్రహణం’
ఈ అసమాన కుంగుదల వల్ల మెక్సికో నగర గర్వకారణమైన చారిత్రక కట్టడాలు విలవిలలాడుతున్నాయి. 1573లో నిర్మాణం ప్రారంభమైన సుప్రసిద్ధ ‘మెట్రోపాలిటన్ కేథడ్రల్’ ఇప్పటికే ఒక పక్కకు వంగిపోయి పతనావస్థకు చేరువైంది. నగరంలోని వీధులు వంకరలు తిరిగి, భవనాలు పగుళ్లతో నిండిపోవడం చూస్తుంటే ఈ సంక్షోభ తీవ్రత అర్థమవుతుంది. కేవలం భవనాలే కాదు, కీలకమైన డ్రైనేజీ వ్యవస్థ, సబ్వే నెట్వర్క్, తాగునీటి సరఫరా పైపులైన్లు సైతం ఈ ఒత్తిడికి ధ్వంసమవుతున్నాయి.
ముందున్నది నీటి యుద్ధమేనా?
“మెక్సికో నగర మౌలిక వసతులపై ఇది చూపిస్తున్న ప్రభావం చాలా పెద్ద సమస్య” అని మెక్సికో నేషనల్ అటానమస్ యూనివర్సిటీ పరిశోధకుడు ఎన్రిక్ క్యాబ్రల్ హెచ్చరిస్తున్నారు. భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో నీటి కొరత ఒక తీవ్రమైన సవాలుగా మారింది. భవిష్యత్తులో ఈ సమస్య లక్షలాది మంది నివాసితుల మనుగడకే ముప్పుగా మారవచ్చు. నీటి నిర్వహణలో తక్షణ మార్పులు చేయకపోతే, ఈ మహా నగరం తన ఉనికిని కోల్పోయే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మహానగరాల్లో మౌలిక వసతుల రక్షణ, నీటి పొదుపు ఎంత కీలకమో ప్రపంచానికి మెక్సికో నగరం ఒక హెచ్చరికగా నిలుస్తోంది.


















