తమిళనాట టీవీకే ప్రభంజనం.. విజయ్ ఇంటి వద్ద భద్రత పెంపు

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ స్థాపించిన ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) అనూహ్య రీతిలో దూసుకుపోతోంది. కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి నిలకడగా ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్న టీవీకే, ప్రస్తుతం 90కి పైగా స్థానాల్లో ముందంజలో ఉండి ప్రత్యర్థి పార్టీలకు గట్టి పోటీనిస్తోంది.


తొలి ఎన్నికల్లోనే విజయ్ పార్టీ ఈ స్థాయిలో ప్రభావం చూపుతుండటంతో తమిళ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. టీవీకే అంచనాలకు మించి రాణిస్తుండటంతో చెన్నైలోని విజయ్ నివాసం వద్ద సందడి నెలకొంది. ఎన్నికల ఫలితాల ట్రెండ్స్ చూసి ఉత్సాహంలో ఉన్న అభిమానులు, పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో ఆయన ఇంటికి చేరుకునే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రభుత్వం విజయ్ ఇంటి వద్ద భద్రతను భారీగా పెంచింది.

విజయ్ నివాసం ఉండే ప్రాంతానికి అదనపు పోలీసు బలగాలను తరలించారు. ఆ పరిసరాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు పటిష్టమైన చర్యలు చేపట్టారు. ఇప్పటికే ఆయన ఇంటి వైపు వచ్చే రహదారులన్నింటినీ పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ముందస్తు జాగ్రత్తగా ఆ మార్గంలో ఇతర వాహనాల రాకపోకలను నిలిపివేశారు. కేవలం అనుమతి ఉన్న వాహనాలను మాత్రమే లోపలికి పంపిస్తూ, ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టారు. అభిమానుల తాకిడి పెరిగే కొద్దీ భద్రతను మరింత కఠినతరం చేస్తామని ఉన్నతాధికారులు వెల్లడించారు. గెలుపు ఖాయమని భావిస్తున్న తరుణంలో చెన్నై వ్యాప్తంగా టీవీకే శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నాయి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.