తెలంగాణ ప్రభుత్వం ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం

తెలంగాణలోని ప్రభుత్వ ఇంటర్ కాలేజీల్లో ఎందరో పేద విద్యార్థులు చదువుకుంటున్నారు. వారికి మేలు జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. తాజాగా.. ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.


ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. అధికారులను ఆదేశించారు. దీంతో ఆఫీసర్లు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు.

ఆమెదం లభిస్తే..

అధికారులు సిద్ధం చేసిన ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తే.. 2025-26 విద్యా సంవత్సరం నుంచి మధ్యాహ్న భోజనం పథకాన్ని అమలు చేయనున్నారు. ప్రస్తుతం తెలంగాణలో 425 ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలు ఉన్నాయి. ఈ కళాశాలల్లో 1.70 లక్షల మంది చదువుకుంటున్నారు. అయితే.. ఈ కాలేజీలు నియోజకవర్గ, మండల కేంద్రాల్లో ఉన్నాయి. దీంతో చాలామంది విద్యార్థులు దూర ప్రాంతాల నుంచి కాలేజీలకు వస్తున్నారు.

డ్రాపౌట్లు పెరుగుతున్నాయ్..

దూరం నుంచి వచ్చేవారు తొందరగా బయలుదేరాల్సి వస్తోంది. దీంతో భోజనం తెచ్చుకోవడం వీలు కావడం లేదు. ఫలితంగా మధ్యాహ్నానికే ఇళ్లకు వెళ్లిపోతున్నారు. దీంతో డ్రాపౌట్లు పెరిగిపోతున్నాయి. హాజరు శాతం కూడా 50కి మించడం లేదు. ఇలాంటి పరిస్థితిని మార్చడానికి ప్రభుత్వం మధ్యాహ్న భోజనం పథకాన్ని ఇంటర్ విద్యార్థులకూ వర్తింపజేయాలని నిర్ణయించినట్టు సమచారాం.

ఏటా రూ.100 కోట్లు..

ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకంపై త్వరలోనే ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పిస్తామని అధికారులు చెబుతున్నారు. రాబోయే బడ్జెట్‌లో ఈ పథకానికి నిధులు కేటాయించే అవకాశాలున్నాయని వివరిస్తున్నారు. ఈ నెలాఖరు లోపు ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పిస్తామని చెబుతున్నారు. ఈ పథకం అమలు జరిగితే.. ఒక్కో విద్యార్థిపై పూటకు రూ.20 నుంచి రూ.25 వరకు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. సంవత్సరానికి రూ.100 నుంచి రూ.120 కోట్లు అవసరమవుతాయని అంచనా వేస్తున్నారు.

గతంలోనూ..

ఇప్పుడే కాదు.. గతంలోనూ ప్రభుత్వ జూనియర్, డిగ్రీ, బీఈడీ, డీఈడీ, పాలిటెక్నిక్‌ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అక్షయ పాత్ర ఫౌండేషన్‌ ద్వారా అమలు చేయాలని గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన కమిటీ స్పష్టం చేసింది. 2018-19 విద్యా సంవత్సరంలో ఈ పథకాన్ని ప్రారంభించాలని ప్లాన్ చేశారు. కానీ అమలు కాలేదు.

ఇటీవల ఏపీలో..

పక్కనన్న ఏపీలో ఇటీవలే ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించారు. కాలేజీలకు దగ్గర్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో వండి.. సరఫరా చేస్తున్నారు. అక్కడి మెనూపై కూడా విద్యార్థులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మంత్రి లోకేష్ ఈ పథకం అమలుపై స్పెషల్ ఫోకస్ పెట్టి పర్యవేక్షిస్తున్నారు.