అమరావతి: ప్రజలు తమ సమస్యలను వాట్సప్ ద్వారా కాకుండా hello.lokesh@ap.gov.in మెయిల్‌కు పంపాలని విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తమ సమస్యలపై వాట్సప్ మెసేజ్‌లు పంపుతుండడంతో మంత్రి వాట్సప్‌ను మాతృసంస్థ మెటా బ్లాక్ చేసింది.
వేలాది మంది తమ సమస్యలను వాట్సప్ చెయ్యడం వల్ల సాంకేతిక సమస్యతో బ్లాక్ అయినట్లు నారా లోకేశ్ ఓ ప్రకటనలో వెల్లడించారు. దీంతో hello.lokesh@ap.gov.in మెయిల్ ఐడీ ద్వారా ప్రజలు తనకు సమాచారం, సమస్యలను తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. తానే అందరి సమస్యలు నేరుగా చూస్తానని స్పష్టం చేశారు. పేరు, ఊరు, మొబైల్ నెంబర్, మెయిల్ ఐడీ, సమస్య-సహాయానికి సంబంధించిన పూర్తి వివరాలు వినతులలో పొందుపరచాలని సూచించారు. యువగళం పాదయాత్రలో నిర్వహించిన ‘హలో లోకేశ్’ కార్యక్రమం పేరుతోనే ఈ మెయిల్ ఐడీని లోకేశ్ క్రియేట్ చేసుకున్నారు.