హిమాచల్ ప్రదేశ్‌లో రుతుపవనాల ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. క్లౌడ్ బరస్ట్‌లు ఆయా ప్రాంతాలను అతలాకుతలం చేస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడటం, ఆకస్మిక వరదల కారణంగా పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.
అయితే మండి జిల్లాల్లో అర్దరాత్రి ఒక కుక్క అరుపుల కారణంగా 67 మంది వరద విపత్తు నుంచి క్షేమంగా బయటపడ్డారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి…
జూన్ 30 అర్దరాత్రి సమయంలో హిమాచల్ ప్రదేశ్‌లోని చాలా ప్రాంతాలను క్లౌడ్ బరస్ట్ కారణంగా వరదలు ముంచెత్తాయి. మండి జిల్లా ధరంపూర్ ప్రాంతంలోని సియాతి గ్రామం కూడా వరదలకు తీవ్ర ప్రభావితమైంది. అయితే అర్దరాత్రి సమయంలో అందరు నిద్రలో ఉన్నారు. అయితే గ్రామంలోని నరేంద్ర అనే వ్యక్తి ఇంట్లోని కుక్క మాత్రం బిగ్గరగా మొరగడం ప్రారంభించింది. దీంతో నరేంద్ర బయటకు రాగా… ఇంటి గోడలో పగుళ్లు, భారీగా నీరు రావడం గమనించాడు. అతడు వెంటనే తన కుటుంబంతో కలిసి బయటకు వెళ్లాడు.
అనంతరం నరేంద్ర గ్రామంలోని ఇతర వ్యక్తులను నిద్రలేపి…వారిని సురక్షితంగా పారిపోమని కోరాడు. దీంతో గ్రామస్తులు అందరూ భారీ వర్షంలోనే తమ ప్రాణాలను కాపాడుకునేందుకు గ్రామం నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత కొద్దిసేపటికే పెద్ద ఎత్తున కొండచరియలు విరిగిపడి గ్రామంలో పదుల సంఖ్యలో ఇళ్లను నేలమట్టం చేశాయి. గ్రామంలో చాలా వరకు ఇళ్లు ధ్వంసం కాగా… ప్రస్తుతం నాలుగైదు ఇళ్ళు మాత్రమే కనిపిస్తున్నాయి. ప్రాణాలతో బయటపడిన సియాతి గ్రామ ప్రజలు గత ఏడు రోజులుగా త్రియంబల గ్రామంలో నైనా దేవి ఆలయంలో ఆశ్రయం పొందుతున్నారు. అయితే తమ ఊరు మొత్తం వరదలు, కొండచరియలు కారణంగా ధ్వంసం కావడంతో వారు తీవ్రంగా ఆందోళనలో, నిరాశలో మునిగిపోయారు. వారికి ఇతర గ్రామల ప్రజలు, ప్రభుత్వం సాయం అందిస్తుంది.
ఇందుకు సంబంధించి నరేంద్ర మాట్లాడుతూ… తాను ఇంటి రెండో అంతస్తులో నిద్రిస్తున్న సమయంలో, కుక్క అకస్మాత్తుగా బిగ్గరగా మొరగడం ప్రారంభించిందని తెలిపారు. అర్ధరాత్రి సమయంలో వర్షం కురుస్తుండటంతో అరవడం ప్రారంభించిందని అన్నారు. తాను వెంటనే నిద్రలేచి కుక్క ఉన్నచోటుకు వెళ్లానని… ఇంటి గోడలో పెద్ద పగుళ్లు కనిపించాయని, నీరు లోపలికి ప్రవేశించడం ప్రారంభమైందని తెలిపారు. తాను కుక్కతో కలిసి కిందికి పరిగెత్తి అందరినీ నిద్రలేపానని చెప్పారు. గ్రామస్తులను కూడా అప్రమత్తం చేశానని తెలిపారు.
అయితే కుక్క అరుపుల కారణంగా 20 కుటుంబాలకు చెందిన 67 మంది సురక్షిత ప్రాంతానికి తరలివెళ్లి ప్రాణాలు నిలబెట్టుకున్నట్టుగా చెబుతున్నారు. కొన్ని జంతువులకు ప్రకృతి వైపరీత్యాలను ముందుగానే పసిగట్టే సామర్థ్యం ఉందని అంటున్నారు. అయితే మొత్తానికి సియాతి గ్రామం చోటుచేసుకున్న ఘటనను పలువురు మిరాకిల్ అని పేర్కొంటున్నారు.
ఇక, హిమాచల్ ప్రదేశ్‌లో రుతుపవనాల కారణంగా వర్షం ప్రారంభమైనప్పటీ నుంచి కనీసం 78 మంది మరణించారు. వీరిలో 50 మంది కొండచరియలు విరిగిపడటం, ఆకస్మిక వరదలు,వంటి వర్ష సంబంధిత సంఘటనలలో మరణించగా… 28 మంది రోడ్డు ప్రమాదాలలో మరణించారని హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (ఎస్‌డీఎంఏ) తెలిపింది.
































