తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు మోకాళ్లపై కూర్చుని కార్యకర్తకు నమస్కారం చేశారు. వరద బాధితులు కష్టాల్లో ఉంటే నియోజకవర్గ ప్రజలు స్పందించిన తీరుకు ఆయన ఫిదా అయ్యారు. వారికి ధన్యవాదాలు చెబుతూ ఎమోషన్ అయ్యారు. మోకాళ్ళపై కూర్చుని వరద బాధితులకు అండగా నిలిచిన వారికి నమస్కారం చేశారు. ఎమ్మెల్యే ఇలా చేయడంతో పక్కనే ఉన్న కూటమి నేతలు కూడా భావోద్వేగానికి గురయ్యారు. ఈ ఘటన నల్లజర్లలో జరిగింది. వరద బాధితులకు విరాళాలు ఇవ్వాలి అనే ముఖ్యమంత్రి పిలుపుమేరకు నియోజక వర్గంలోని నాయకులు, ప్రజలు రూ. 60 లక్షల పైచిలుకును ప్రతీ గ్రామం నుండి విరాళాలు సేకరించి ముఖ్యమంత్రి సహాయనిధికి అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియా సమావేశం ఏర్పాటు చేసి దాతలకు కృతజ్ఞతలు తెలియచేశారు. వరదలు మొదలైన రోజు నుండి ఆహారం, నిత్యవసర వస్తువులు వాహనాల్లో విజయవాడకు తరలించామని తెలిపారు. వరద బాధితులకు సాయం చేయడానికి గోపాలపురం నియోజకవర్గ నాయకులు, ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారని అభినందించారు.