MLC Jeevan Reddy: జీవన్‌ రెడ్డి ఎపిసోడ్‌లో మరో కీలక ట్విస్ట్‌!

తెలంగాణలో జగిత్యాల కాంగ్రెస్‌ రాజకీయం ఆసక్తికరంగా మారింది. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరడంతో హస్తం పార్టీలో ముసలం చోటుచేసుకుంది.


సంజయ్‌ చేరికతో ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి కాంగ్రెస్‌కు రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే జీవన్‌ రెడ్డి సోమవారం రాత్రి హైదరాబాద్‌ చేరుకున్నారు. దీంతో, ఈ పంచాయతీ సిటీకి చేరుకుంది.

అయితే, సోమావారమంతా జీవన్‌ రెడ్డి ఇంటి వద్ద హైడ్రామా కొనసాగింది. కాంగ్రెస్‌ కార్యకర్తలు, మద్దతుదారులు భారీ సంఖ్యలో జీవన్‌ రెడ్డి ఇంటి వద్దకు చేరుకున్నారు. కార్యకర్తలతో భేటీ సందర్భంగా జీవన్‌ రెడ్డి రాజీనామాకు సిద్ధమయ్యారు. దీంతో, రంగంలోకి దిగిన కాంగ్రెస్‌ మంత్రులు, ఎమ్మెల్యేలు జీవన్‌ రెడ్డితో చర్చలు జరిపారు. జీవన్‌ రెడ్డితో మంత్రి శ్రీధర్‌ బాబు చర్చలు జరిపినా ఫలించలేదు. ఈ క్రమంలో జీవన్‌ రెడ్డి, కార్యకర్తల మనోభావాలను హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తానని శ్రీధర్‌ బాబు హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా జీవన్‌ రెడ్డి కాంగ్రెస్‌ హైకమాండ్‌కు ఒక్కరోజు సమయం ఇచ్చినట్టు సమాచారం. లేకపోతే తాను రాజీనామా సిద్ధమని జీవన్‌ రెడ్డి తేల్చి చెప్పినట్టు పార్టీలో ప్రచారం జరుగుతోంది. మరోవైపు.. జీవన్‌ రెడ్డి హైదరాబాద్‌కు చేరుకోవడంతో ఆయనకు మద్దతుగా జగిత్యాల నియోజకవర్గంలో ప్రతీ గ్రామం నుంచి ఆయన కలిసేందుకు నేడు(మంగళవారం) కార్యకర్తలంతా ఇక్కడికి రావడానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది. అయితే, అధిష్టానం నుంచి జీవన్‌ రెడ్డికి హామీ దక్కకపోతే రాజీనామాకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది.

నన్ను సంప్రదించకుండా ఎలా?
జగిత్యాలలో తనపై పోటీ చేసి గెలిచిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేను తనతో కనీసం సంప్రదించకుండా పార్టీలో చేర్చుకోవడాన్ని జీవన్‌రెడ్డి జీర్ణించుకోలేకపోయారు. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా కాంగ్రెస్‌కు విధేయుడిగా కొనసాగుతున్న తనను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకుండా ఎలా వ్యవహరిస్తారని ఆయన నిలదీసినట్లు తెలిసింది. తన అవసరం పార్టీకి లేదని భావించే, కనీస సమాచారం ఇవ్వకుండా సంజయ్‌ను కాంగ్రెస్‌లో చేర్చుకున్నారని ఆయన అన్నట్టు సమాచారం.

మూడు విడతలు తలపడిన జీవన్‌రెడ్డి, సంజయ్‌
జగిత్యాల నియోజకవర్గంలో జీవన్‌రెడ్డి ప్రస్థానం 1983 నుంచి మొదలైంది. అప్పటి నుంచి 2014 వరకు పలు పర్యాయాలు ఎమ్మెల్యేగా కొనసాగారు. ఇక 2014 నుంచి మూడు పర్యాయాలు సంజయ్, జీవన్‌రెడ్డి రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్నారు. 2014లో జీవన్‌రెడ్డి గెలిచినప్పటికీ, 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో సంజయ్‌ చేతిలో ఓడిపోయారు. 2024లో నిజామాబాద్‌ ఎంపీ అభ్యర్ధిగా కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. 2018లో ఎమ్మెల్యేగా పరాజయం తర్వాత 2019లో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించారు. ఇలావుండగా కాంగ్రెస్‌లో సంజయ్‌ చేరికను వ్యతిరేకిస్తూ కిసాన్‌ కాంగ్రెస్‌ స్టేట్‌ కో ఆర్డినేటర్‌ పదవీకి వాకిటి సత్యంరెడ్డి రాజీనామా చేశారు.