దేశంలోని వివిధ బ్యాంకుల్లో వేలాది కోట్ల అన్‌క్లెయిమ్ డిపాజిట్లు ఉన్నాయి. మరి ఇంతకీ ఆ డబ్బును ఎవరైనా సొంతం చేసుకోగలరా.? నిజంగా అర్హులైన వ్యక్తులకు ఆ డబ్బు డిపాజిట్ అవుతుందా.? అనేది ఇప్పుడు మనం తెలుసుకుందామా..
ఆర్‌బీఐ నివేదిక ప్రకారం, బ్యాంకుల్లో క్లెయిమ్ చేయని డిపాజిట్లు గత ఏడాదితో పోలిస్తే 26 శాతం పెరిగాయి. మార్చి 2024 నాటికి ఆ అమౌంట్ రూ.78,213 కోట్లకు చేరుకుంది. మార్చి 2023 చివరి నాటికి, డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్‌నెస్ ఫండ్‌లో జమ చేసిన మొత్తం రూ.62,225 కోట్లు. కో-ఆపరేటివ్ బ్యాంకులతో సహా బ్యాంకులలో 10 లేదా అంతకంటే ఎక్కువ ఏళ్లుగా తమ ఖాతాలలో ఉన్న క్లెయిమ్ చేయని డిపాజిట్లను ఆర్‌బీఐ డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్‌నెస్ ఫండ్‌కు బదిలీ చేస్తాయి.
డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్‌నెస్ ఫండ్ అంటే ఏమిటి?
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2014 సంవత్సరంలో డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్‌నెస్ ఫండ్(DEAF)ని స్థాపించింది. వాస్తవానికి, క్లెయిమ్ చేయని డిపాజిట్లు బ్యాంకుల వద్ద ఉన్నా.. డేంజరే. జనాలు తమ డబ్బును డిపాజిట్ చేసి.. మర్చిపోవడం లేదా అకాల మరణం కారణంగా లోకాన్ని విడిచి వెళ్లిపోవడం జరుగుతుంది. ఆ డబ్బు తమదే అంటూ ఎవరైనా క్లెయిమ్‌దారుడు పక్కా ప్రూఫ్స్‌తో వచ్చే వరకు బ్యాంకులు అంత మొత్తాన్ని తమ వద్ద ఉంచుకుంటాయి. కానీ ఈ ఫండ్ ఏర్పాటుతో అటు ప్రభుత్వ.. ఇటు ప్రైవేట్ రంగ బ్యాంకులకు సమస్య తీరిందని చెప్పొచ్చు. సెంట్రల్ బ్యాంక్ నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం వారు క్లెయిమ్ చేయని మొత్తాన్ని ఈ ఫండ్‌లో డిపాజిట్ చేస్తారు. క్లెయిమ్‌దారుడు వచ్చినప్పుడు.. ఈ డబ్బును తిరిగి ఇచ్చే ప్రక్రియ ప్రారంభిస్తారు.
ఎలా క్లెయిమ్ చేయాలి.?
అన్ని బ్యాంకులు పేర్లు, చిరునామాలతో పనిచేయని ఖాతాలు, అన్‌క్లెయిమ్ చేయని అకౌంట్ల జాబితాను విడుదల చేస్తాయి.
మీ పేరు ఏదైనా జాబితాలో ఉందో లేదో. దీన్ని తెలుసుకోవడానికి, ప్రతి బ్యాంకు వెబ్‌సైట్‌ను సందర్శించండి.
మీరు మీ పేరు లేదా బంధువు పేరును కనుగొంటే, సమీపంలోని బ్యాంక్ బ్రాంచ్‌ని సందర్శించి.. ప్రక్రియను స్టార్ట్ చేసి.. సంతకం చేసి, అప్లికేషన్ ఫారమ్‌ను సమర్పించండి.
KYC ప్రక్రియను పూర్తి చేయడానికి అవసరమైన పత్రాలను సమర్పించండి.
ఖాతాదారుడు చనిపోయి ఉంటే.. రిజిస్టర్డ్ నామినీ లేకుంటే, లేదా రిజిస్టర్డ్ నామినీ కూడా చనిపోయి ఉంటే, ఆ మొత్తాన్ని లబ్ధిదారుడు వీలునామా ప్రకారం లేదా వారసత్వ ధృవీకరణ పత్రం లేదా ప్రొబేట్ అందించడం ద్వారా క్లెయిమ్ చేయవచ్చు.
పెద్ద మొత్తంలో ఉంటే, కొన్ని బ్యాంకులకు కుటుంబ సభ్యులందరి నుండి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా అవసరం కావచ్చు.
బ్యాంక్ ద్వారా అన్ని డాక్యుమెంట్‌ల వెరిఫికేషన్ తర్వాత, మొత్తం, వడ్డీతో సహా, ఏదైనా ఉంటే, క్లెయిమ్‌దారుడుకు బదిలీ అవుతుంది.
క్లెయిమ్‌లు చేయడానికి ఎటువంటి కాలపరిమితి లేదు, అయితే బ్యాంకులు అటువంటి క్లెయిమ్ అభ్యర్థనలను అన్ని సపోర్టింగ్ డాక్యుమెంట్‌లతో ఫైల్ చేసిన 15 రోజులలోపు పరిష్కరిస్తాయి.