మోడీ మెచ్చిన టీడీపీ నేతకే గవర్నర్ పదవి ?

తెలుగుదేశం పార్టీకి వాజ్ పేయి ప్రధానిగా ఉన్న సమయంలోనే చాలా ప్రాధాన్యత దక్కింది. అప్పట్లో టీడీపీకి చెందిన వారికి గవర్నర్ పదవులు కూడా ఇచ్చారు. అయితే 2014లో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చాక మాత్రం మిత్రులకు గవర్నర్ పదవులు ఇవ్వడం అన్నది పెద్దగా లేకుండా పోయింది.


తెలుగుదేశం పార్టీ 2014కీ బీజేపీతో పొత్తు పెట్టుకుని ఏపీలో అధికరంలోకి వచ్చింది. కేంద్రంలో కూడా బీజేపీ పాలన వచ్చింది. ఆ సమయంలో తెలంగాణాకు చెందిన సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు కి గవర్నర్ పదవి మీద మోజు ఉండేది ఆయన తనకు ఆ అవకాశం ఇప్పించాలని బాబుని కోరారు. దానికి చంద్రబాబు కూడా హామీ ఇచ్చారు.

బడుగు వర్గాలకు చెందిన ఆయనను రాజ్ భవన్ మెట్లెక్కించాలని బాబు త్రికరణశుద్ధిగానే తలచారు. కానీ అయిదేళ్ళ పాలనలో ఆనాడు బీజేపీ పెద్దలు టీడీపీకి ఒక్క గవర్నర్ పోస్టు కూడా ఇవ్వలేదు. వచ్చిన పదవులు అన్నీ తమకే అన్నట్లుగా వ్యవహరించారు. అలా మోత్కుపల్లి నర్సింహులు ఆశలు అయితే నెరవేరలేదు.

దాంతో ఆయన బాబు మీద ఆగ్రహం పెంచుకుని పార్టీకి దూరం కావడమే కాకుండా 2019 ఎన్నికల్లో వైసీపీకి అనుకూలంగా ప్రచారం కూడా చేశారు. ఇదంతా ఫ్లాష్ బ్యాక్. ఇపుడు చూస్తే మళ్ళీ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది. పొత్తు పెట్టుకుని ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఈసారి కూడా టీడీపీలో చాలా మంది సీనియర్లు తమకు తగిన పదవుల కోసం చూస్తున్నారు.

గవర్నర్ గా చేయాలని విజయనగరం జిల్లాకు చెందిన కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు చూస్తున్నారు. ఆయన ఏపీలో కీలక మంత్రిత్వ శాఖలు అన్నీ చేశారు. కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. ఇక రాజకీయంగా పూర్తి స్థాయి విరమణ చేసే దశలో ఉన్న తనకు రాజ్ భవన్ తగిన వేదికగా ఆయన భావిస్తున్నారు. రాజ్యాంగం పట్ల పూర్తి అవగాహన ఉన్న అశోక్ కి గవర్నర్ పదవి ఇస్తే బాగానే రాణిస్తారు అని అంటున్నారు.

అలాగే మరో సీనియర్ నేత యనమల రామక్రిష్ణుడు ఎమ్మెల్సీ పదవీ కాలం కూడా మార్చి 30తో పూర్తి అయింది. దాంతో ఆయన కూడా సరైన గౌరవం కోరుకుంటున్నారు. తనకు ఇస్తే రాజ్యసభ పదవి లేదా గవర్నర్ పదవి అయినా ఇవ్వాలని ఆయన ఆశిస్తున్నారు. బీసీ సామాజిక వర్గం నుంచి బలమైన నేతగా రాజకీయ మేధావిగా ఉన్న యనమలకు ఈ అత్యున్నత పదవి దక్కితే సముచితంగా ఉంటుందని అంతా భావిస్తున్నారు.

ఈ ఇద్దరే కాదు, టీడీపీలో మరికొందరు సీనియర్ల చూపు కూడా రాజ్ భవన్ మీద ఉందని అంటున్నారు. అయితే గవర్నర్ పదవుల విషయంలో టీడీపీకి వాటా ఎంత కేంద్ర బీజేపీ పెద్దలు ఒక పోస్ట్ అయినా ఇస్తారా అన్న చర్చ అయితే ఉండనే ఉంది.

నిజానికి బీజేపీ పెద్దల ఆలోచనలు చూస్తే పదవులు అన్నవి తమ పార్టీలో మొదటి నుంచి చేసిన వారికే ఇవ్వాలని భావిస్తారు. మరీ ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తారు. సోము వీర్రాజుని ఎమ్మెల్సీగా చేసినా నరసాపురం ఎంపీగా కేంద్ర మంత్రిగా శ్రీనివాసవర్మను చేసినా బీజేపీ ఇదే సిద్ధాంతాన్ని అనుసరిస్తుంది

పార్టీలో ఎంతో మంది నేతలు చేరవచ్చు కానీ పదవుల విషయంలో ప్రయారిటీ ఇలా పెట్టుకుంటుంది. మరి బీజేపీలో చేరిన వారికే ఈ పరిస్థితి ఉంటే మిత్రుల విషయంలో వేరేగా చెప్పాల్సింది లేదు అని అంటున్నారు. గవర్నర్ పదవులు ఇవ్వాలనుకుంటే ఏదో ఒక చోట ఇవ్వవచ్చు. ఈశాన్య రాష్ట్రాలలో అయినా సర్దుబాటు చేయవచ్చు. కానీ ఆ పదవులు కూడా బీజేపీలో వరిష్ట నేతలకే అన్న రూల్ పెట్టుకున్నట్లుగా కనిపిస్తోంది. అందువల్ల టీడీపీ వాటా ఎంత అంటే జవాబు చెప్పడం కష్టమే అని అంటున్నారు.

అయితే 2014లో రాజకీయం వేరు, ఇపుడు వేరు అన్నది కూడా ఉంది కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి టీడీపీ మద్దతు అవసరంగా ఉంది. దాంతో టీడీపీకి ఒక గవర్నర్ పదవి అయినా ఇస్తారు అన్న ఆశలు ఉన్నాయి. ఆ ఒక్కటీ మాత్రం దక్కేది అశోక్ కే అంటున్నారు. ఆయన మోడీకి బాగా నచ్చిన రాజకీయ నాయకుడు కావడం వల్ల ఆ విధంగా టీడీపీ కోటా తమ మాట అని ఉభయకుశలోపరి గా చేసుకుని ఈ పదవి ఇవ్వవచ్చు అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.