ప్రధాని మోదీ రాఖీ గిఫ్ట్ ప్రకటనకు సిద్దమయ్యారు. మహిళలకు రాఖీ వేళ వంట గ్యాస్ సిలిండర్ ధర తగ్గిస్తూ నిర్ణయం ప్రకటించేందుకు దాదాపు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ఈ రోజు జరిగే కేంద్ర మంత్రి వర్గ సమావేశంలో ఈ మేరకు అధికారికంగా ఆమోద ముద్ర వేయనున్నారు. గతంలోనూ రాఖీ వేళ మోదీ మహిళల కోసం పలు నిర్ణయాలు వెల్లడించారు. రేపు దేశ వ్యాప్తంగా రాఖీ పర్వదినం జరుపుకుంటున్న వేళ వంట గ్యాస్ ధర తగ్గింపు దిశగా ఈ రోజు కేంద్రం కీలక ప్రకటన దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది.
ప్రధాని మోదీ అధ్యక్షతన ఈ రోజు కేంద్ర కేబినెట్ కీలక భేటీ జరగనుంది. అమెరికా సుంకాలే ప్రధాన అజెండాగా ఈ భేటీ నిర్వహిస్తున్నారు. అమెరికా వరుసగా విధిస్తున్న సుంకాలు.. ట్రంప్ నిర్ణయాల పైన భారత్ ఇప్పటికే తమ వైఖరి వెల్లడించింది. సుంకాల విషయంలో మరింత వ్యూహాత్మకంగా వెళ్లేందుకు ప్రధాని మోదీ సిద్దమయ్యారు. ఈ పరిస్థితుల పైన మంత్రివర్గ సహచరు లతో చర్చించనున్నారు. అదే విధంగా ఉప రాష్ట్రపతి ఎన్నిక.. అభ్యర్ధి… ఈసీ పైన రాహుల్ చేస్తున్న విమర్శల గురించి బీజేపీ క్యాంపులో చర్చ జరుగుతోంది. పాలనా పరమైన అంశాలతో పాటుగా రాజకీయంగానూ మోదీ కీలక నిర్ణయాలకు సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది.
ఇక.. రేపు రాఖీ పండుగ వేళ వంట గ్యాస్ సిలిండర్ల ధరను తగ్గించేందుకు కేబినెట్ ముందుకు ప్రతిపాదనలు రానున్నాయి. ఏ మేర తగ్గిస్తే ఎంత భారం పడుతుందనేది చర్చించి.. రాయితీని మరింతగా పెంచుతూ నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ప్రతీ నెల ఒకటో తేదీన అంతర్జాతీయ మార్కెట్ కు అనుగుణంగా ధరల్లో మార్పులు, చేర్పులు జరుగుతున్నాయి. అయితే, సాధారణ వంట గ్యాస్ వినియోగదారుల పైన భారం పడకుండా.. వాణిజ్య సిలిండర్ల ధరలను మాత్రమే పెంచుతున్నారు. కేంద్రం ఈ మేరకు డొమెస్టిక్ సిలిండర్ల పైన రాయితీ భరిస్తోంది. ఇక, ఇప్పుడు రాఖీ వేళ కేంద్రం మరింతగా రాయితీ ప్రకటించి.. అదనపు భారం భరించేందుకు సిద్దం అయినట్లు సమాచారం.
గతంలో ఇదే విధంగా రాఖీ గిఫ్ట్ గా మోదీ ప్రభుత్వం వంట గ్యాస్ పై రాయితీ రూ 200 వరకు ప్రకటించింది. ప్రధాన మంత్రి ఉజ్వల యోజనా పథకం లబ్ధిదారులకు ఈ ప్రయోజనం దక్కింది. ఇప్పటికే కేంద్రం ఎల్పీజీ సిలిండర్లపై రూ.200 రాయితీ ఇస్తోంది. కాగా.. ఇప్పుడు ఎంత మేర ఈ రాయితీ పెంచుతూ నిర్ణయం తీసుకుంటారనేది కీలకంగా మారుతోంది. ఈ రోజు మధ్నాహ్నం జరిగే కేంద్ర మంత్రి వర్గ భేటీలో ఈ అంశం పైన తుది నిర్ణయం తీసుకోనున్నారు.
































