మారుతీ సుజుకీ ఈ విటారా ప్రొడక్షన్‌ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. సింగిల్ ఛార్జ్‌తో 426 కి.మీ వరకు రేంజ్‌ని ఇచ్చే ఈ మారుతీ సుజుకీ తొలి ఎలక్ట్రిక్ కారు వివరాలను ఇక్కడ తెలుసుకోండి.
ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ మారుతీ సుజుకీ ఇండియా లిమిటెడ్ తన తొలి ఎలక్ట్రిక్ కారు ‘ఈ విటారా’ ఉత్పత్తిని ప్రారంభించింది. దీనితో ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలోకి మారుతీ సుజుకీ అడుగుపెట్టింది. గుజరాత్‌లోని హన్సల్‌పూర్ ప్లాంట్‌లో ఈ కారును ఉత్పత్తి చేయనున్నారు. ఈ-విటారా తొలి యూనిట్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు సెప్టెంబర్ 3 నాటికి భారత మార్కెట్‌లోకి విడుదలయ్యే అవకాశం ఉంది. అంతేకాదు, ఈ ఎలక్ట్రిక్ కారు 100 దేశాలకు ఎగుమతి కానుంది.
మారుతీ సుజుకీ ఈ విటారా- విశేషాలు..
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధాని మోదీతో పాటు గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, భారతదేశంలో జపాన్ రాయబారి కీచి ఓనో కూడా పాల్గొన్నారు. ఈ విటారా అనేది మారుతీ సుజుకీకి మొదటి బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికల్ (బీఈవీ). ఇది ప్రపంచవ్యాప్తంగా విక్రయించే ఉత్పత్తిగా నిలవనుంది. ఇప్పటికే యూకేలో విడుదలైన ఈ ఎస్‌యూవీ, భారతదేశంలో హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్, మహీంద్రా బీఈ 6, ఎంజీ జెడ్ఎస్ ఈవీ వంటి మోడళ్లతో గట్టి పోటీ ఇవ్వనుంది. ఈ కారులో 18-ఇంచ్ ఏరో-ఆప్టిమైజ్డ్ అల్లాయ్ వీల్స్‌తో పాటు గుడ్‌ఇయర్ టైర్లు ఉంటాయి.
మారుతీ సుజుకీ ఈ విటారా- బ్యాటరీ, పనితీరు..
అంతర్జాతీయ మార్కెట్లో ఈ విటారా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ రెండు బ్యాటరీ ప్యాక్‌లతో అందుబాటులో ఉంది. అవి 49 kWh, 61.1 kWh యూనిట్లు.
49 kWh ప్యాక్: ఇది ఫ్రెంట్ వీల్ డ్రైవ్ సెటప్‌తో 142 బీహెచ్‌పీ పవర్‌ని, 193 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే డబ్ల్యూఎల్టీపీ-టెస్ట్ ప్రకారం 344 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు.
61.1 kWh ప్యాక్: ఇది రెండు విభిన్న కాన్ఫిగరేషన్‌లలో లభిస్తుంది.
ఫ్రెంట్ వీల్ డ్రైవ్ వెర్షన్ 171 బీహెచ్‌పీ పవర్‌ని, 193 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేసి 426 కిలోమీటర్ల రేంజ్‌ను ఇస్తుంది.
ఆల్-వీల్ డ్రైవ్ వేరియంట్ 181 బీహెచ్‌పీ పవర్‌ని, 307 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేసి 395 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుంది.
బ్యాటరీ ప్యాక్‌ను బట్టి ఛార్జింగ్ సమయం మారుతుంది.
49 kWh ప్యాక్: 7 kW ఏసీ ఛార్జర్‌తో దాదాపు 6.5 గంటలు, 11 kW ఛార్జర్‌తో 4.5 గంటలు పడుతుంది.
61.1 kWh ప్యాక్: 7 kW ఛార్జర్‌తో దాదాపు 9 గంటలు, 11 kW ఛార్జర్‌తో 5.5 గంటలు పడుతుంది.
ఈ రెండు వెర్షన్లు కూడా డీసీ ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తాయి, దీని ద్వారా కేవలం 45 నిమిషాల్లో 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు!
మారుతీ సుజుకీ ఈ విటారా- ఇంటీరియర్, భద్రతా ఫీచర్లు..
ఈ విటారా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో రెండు స్క్రీన్లు ఉన్నాయి. ఇందులో 10.1 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10.25 ఇంచ్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉన్నాయి. ఇతర ముఖ్య ఫీచర్లలో డ్యూయల్-స్పోక్ స్టీరింగ్ వీల్, సెమీ-లెదరెట్ అప్‌హోలిస్ట్రీ, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, పది రకాలుగా అడ్జెస్ట్ చేయగల డ్రైవర్ సీటు, పనోరమిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, ఏసీ వెంట్స్ ఉన్నాయి.
భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ ఏడు ఎయిర్‌బ్యాగ్‌లు, 360 డిగ్రీ కెమెరా, డ్రైవర్‌కు వివిధ పరిస్థితులలో సహాయపడే అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (అడాస్) వంటి ఫీచర్లను చేర్చారు.
ఈ విటారా ప్రాముఖ్యత..
ఈ విటారా ఉత్పత్తి ప్రారంభం మారుతీ సుజుకీకి ఒక కీలకమైన మైలురాయి. ఈ కొత్త ఎస్‌యూవీ భారత మార్కెట్లో మారుతీ సుజుకీకి ఎలక్ట్రిక్ వాహన విభాగంలో గట్టి పునాది వేస్తుందని ఆశిస్తున్నారు. భారతదేశంలో ఉత్పత్తి చేసి 100 దేశాలకు ఎగుమతి చేయాలన్న ప్రణాళికతో, ఈ మోడల్ మారుతీ సుజుకీ ఈవీ లక్ష్యాలను దేశీయంగా, అంతర్జాతీయంగా బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు.































