3 ఏళ్లకే చేతికి డబ్బులు.. ఈ 7 బ్యాంకుల్లో ఎక్కువ వడ్డీ.. రూ.5 లక్షలు జమ చేస్తే ఎంతొస్తుంది?

www.mannamweb.com


వరుసగా 10వ సారి కీలక పాలసీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తూ ఇటీవలే కీలక నిర్ణయం తీసుకుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ). అయితే, వచ్చే డిసెంబర్‌లో జరిగే మానీటరీ పాలసీ కమిటీ సమావేశంలో రెపో రేటును తగ్గించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్‌బీఐ వడ్డీ రేట్లు తగ్గిస్తే బ్యాంకులు సైతం తమ డిపాజిట్లపై వడ్డీ రేట్లలో కోత పెడుతుంటాయి. అందుకే అధిక వడ్డీ కోరుకునే డిపాజిటర్లు ఇప్పుడే ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేయడం మంచిదని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. మీ ఆర్థిక లక్ష్యాలు 2-3 ఏళ్ల మధ్య ఉన్నాయని అనుకుంటే మీరు 3 ఏళ్ల మెచ్యూరిటీ టెన్యూర్ గల ఫిక్స్‌డ్ డిపాజిట్లను ఎంచుకోవచ్చు. ఈ మూడేళ్ల డిపాజిట్లపై 7 దిగ్గజ బ్యాంకులు మంచి వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. వాటి గురించి తెలుసుకుందాం.

ప్రముఖ ప్రైవేట్ బ్యాంకుల్లో..
ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో మూడేళ్ల టెన్యూర్ డిపాజిట్లను చూసుకుంటే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ జనరల్ కస్టమర్లకు 7 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.50 శాతం వడ్డీ రేట్లు ఆఫర్ చేస్తోంది. ఈ ఏడాది జులై 24 నుంచి కొత్త వడ్డీ రేట్లను అమలు చేస్తోంది. అలాగే ఐసీఐసీఐ బ్యాంక్, ఫెడరల్ బ్యాంకులు సైతం సాధారణ ప్రజలకు 7 శాతం, సీనియర్ సిజిటన్లకు 7.50 శాతం వడ్డీ ఇస్తున్నాయి. అయితే కోటక్ మహీంద్రా బ్యాంక్ మాత్రం సాధారణ పౌరులకు 7 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.60 శాతం వడ్డీ ఆఫర్ చేస్తున్నాయి. ఆయా బ్యాంకుల్లో ఒక సాధారణ కస్టమర్ రూ.5 లక్షలు జమ చేస్తే మూడేళ్ల తర్వాత చేతికి రూ. 6,03,074 వస్తాయి. అలాగే సీనియర్ సిటిజన్లు అయితే చేతికి రూ. 6,10,425 వరకు వస్తాయి. అదే కోటక్ మహీంద్రా బ్యాంకులో సీనియర్లకు రూ.6,11,887 వరకు అందుతాయి.

ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంకుల్లో..
ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంకుల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) మూడేళ్ల టెన్యూర్ డిపాజిట్లపై జనరల్ కస్టమర్లకు 6.75 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.25 శాతం వడ్డీ ఆఫర్ చేస్తోంది. ఈ కొత్త రేట్లను జూన్ 15, 2024 నుంచే అమలులోకి తీసుకొచ్చింది. ఇక పంజాబ్ నేషనల్ బ్యాంకులో జనరల్ కస్టమర్లకు 7 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.50 శాత వడ్డీ లభిస్తోంది. ఇక యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జనరల్ కస్టమర్లకు 6.7 శాతం వడ్డీ ఇస్తుండగా.. సీనియర్ సిటిజన్లకు 7.20 శాతం వడ్డీ లభిస్తోంది. ఒక జనరల్ కస్టమర్ రూ.5 లక్షలు జమ చేస్తే స్టేట్ బ్యాంకులో రూ.5,99,374 వస్తాయి. అదే పంజాబ్ నేషనల్ బ్యాంక్ అయితే రూ. 6,03,074 వస్తాయి. ఇక యూబీఐలో రూ. 5,98,638గా ఉంది. ఇక సీనియర్ సిటిజన్లు అయితే ఎస్‌బీఐలో రూ.6,06,743 వస్తాయి. ఇక పంజాబ్ నేషనల్ బ్యాంకులో అయితే రూ. 6,10,425 వరకు వస్తాయి. ఇక యూబీఐలో చేతికి రూ. 6,06,019 వస్తాయి.