వైసీపీ ముఖ్య నాయకుడు, ఫైబర్‌నెట్ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ పూనూరు గౌతమ్‌రెడ్డిపై విజయవాడ పోలీసులు కేసు నమోదు చేశారు.భూవివాదం నేపథ్యంలో స్థలం యజమానిపై సుపారీ ఇచ్చి హత్యాయత్నం చేశారనే ఆరోపణలపై పలువురిని అరెస్ట్ చేశారు.ఇందులో వైసీపీ ముఖ్య నాయకుడి ప్రమేయం ఉందని పోలీసులు వెల్లడించారు.
భూకబ్జా నేపథ్యంలో ప్రత్యర్థిని హతమార్చేందుకు కిరాయి హంతకులకు కిరాయి చెల్లించారనే అభియోగాలపై విజయవాడలో వైసీపీ ముఖ్య నాయకుడు పూనూరు గౌతమ్‌రెడ్డిపై కేసు నమోదైంది. గత ప్రభుత్వంలో ఫైబర్‌నెట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా వ్యవహరించిన గౌతమ్‌రెడ్డి సత్యనారాయణపురంలో ఖాళీ స్థలాన్ని ఆక్రమించారనే ఆరోపణలు ఉన్నాయి.
తమ స్థలంలో అక్రమంగా నిర్మాణం చేపట్టి అసలైన యజమానులు ఫిర్యాదు చేస్తుండటంతో వారిని హతమార్చేందుకు సుపారీ ఇచ్చినట్టు బాధితుడు ఫిర్యాదు చేయడంతో బెజవాడ పోలీసులు సుపారీ గ్యాంగ్‌ను అరెస్ట్ చేశారు. కోట్లాది రుపాయల విలువైన భూ యజమాని ఉమామహేశ్వరశాస్త్రిని చంపేందుకు నిందితడు సుపారీ ఇచ్చినట్టు పోలీసులు గుర్తించారు.ఈ కేసు వివరాలను విజయవాడ సీపీ వెల్లడించారు.
విజయవాడ సత్యనారాయణ పురం శివాలయం వీధిలో నివసిస్తున్న గండూరి ఉమా మహేశ్వర శాస్త్రి తల్లి పేరు మీద ఉన్న స్థలాన్ని పూనూరు గౌతం రెడ్డి తప్పుడు పత్రాలతో కబ్జా చేసి రేకుల షెడ్ ను నిర్మించాడని, ఈ విషయాన్ని 2017 సంవత్సరంలో తను అమెరికా నుండి వచ్చిన తరువాత గమనించి, సత్యనారాయణ పురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. అప్పట్లో ఈ ఫిర్యాదుపై క్రిమినల్ కేసును నమోదు చేశారు.
అనుమతులు రద్దు చేసినా..
ఆ తర్వాత మునిసిపల్ కార్పొరేషన్ విచారణలోఆ స్థలం కబ్జాకు గురైందని తేల్చి, గౌతం రెడ్డికి కేటాయించిన ఎస్సస్మేంట్ నెంబర్లను రద్దు చేసి, బాధితులకు పేరిట పన్నుల్ని కొనసాగిస్తున్నారు. కబ్జాకు గురైన స్థలానికిమంజూరైన అనుమతుల్ని కూడా రద్దు చేశారు. పలుమార్లు మునిసిపల్ కార్పొరేషన్ ఆక్రమణలకు తొలగించడానికి ప్రయత్నించినా హైకోర్టులో స్టేటస్ కో ఉత్తర్వులతో వాటిని అడ్డుకున్నారు. 2019లో వైసీపీ అధికారంలో గత ప్రభుత్వం ఫైబర్ నెట్ కార్పొరేషన్ ఛైర్మన్ పదవిలో నియమించింది. ఆ సమయంలో నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు పొంది, భవన నిర్మాణం పూర్తి చేశారని సీపీ పేర్కొన్నారు.
ఈ క్రమంలో బాధితుడు కార్పొరేషన్‌కు, పోలీసులకు ఫిర్యాదు చేయడం, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంతో అవి వైరల్‌గా మారాయి. గత ఎన్నికల సమయంలో బాధితుడు గౌతమ్‌రెడ్డికి వ్యతిరేకంగా ప్రచారం చేశాడు. ఈ క్రమంలో అక్టోబర్ 31న అతనిపై దాడి చేశారని, ఆ తర్వాత కూడా యూట్యూబ్‌లో ఇంటర్వ్యూలు పోస్ట్ చేస్తుండటంతో నవంబర్ ఆరో తేదీన హత్యాయత్నం చేసినట్టు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇంటి పత్రాలతో పాటు, ఫోన్ లాక్కుని వెళ్లారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ ఘటనపై విచారణ జరిపిన పోలీసులు సీసీ టీవీ ఫుటేజీలో అక్టోబర్ 31, నవంబర్ 6వ తేదీన నిందితులు బాధితుడి ఇంట్లోకి వెళుతున్న దృశ్యాలను సేకరించారు. పోలీసుల దర్యాప్తులో భూకబ్జా ఆరోపణలు చేస్తున్నందుకు అడ్డు తొలగించడానికి రూ.25లక్షలతో సుపారీ కుదుర్చుకున్నట్టు వెల్లడైందని సీపీ వివరించారు.
నిందితుల వివరాలు:
1. జగ్గయ్య పేట మండలం, చిల్లకల్లుకు చెందిన గడ్డం వినోద్ @ చిన్ని
2. జగ్గయ్య పేట మండలం, కాకా నగరానికి చెందిన తాలురి గణేష్
3. జగ్గయ్య పేట మండలం, చాకలి బజార్ కి చెందిన దేవళ్ళ వంశి
4. జగ్గయ్య పేట మండలం, కాగితాల బజార్ కి చెందిన ఉప్పతోల్ల అశోక్ కుమార్
హత్యాయత్నానికి పధకం రచించడంలో కీలకంగా వ్యవహరించిన పూనూరు గౌతం రెడ్డి, నిందితులతో ఒప్పందం కుదిర్చిన అనిల్, పృథ్వీరాజ్, బిట్ర పురుషోత్తం, బండ శ్రీనులను ఇంకా అరెస్ట్ చేయవలసి ఉందని, ప్రస్తుతం వారు పరారిలో ఉన్నట్లు తెలిపారు. వీరికోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.
ఇప్పటికే 42 క్రిమినల్ కేసులు, కబ్జా ఆరోపణలు..
పూనూరు గౌతం రెడ్డి పై ఎన్.టి.ఆర్.పోలీస్ కమీషనరేట్ లో 42 క్రిమినల్ కేసులు 1988 నుండి ఇప్పటి వరకు నమోదు కాబడినవి. రెండు హత్య కేసులు, రెండు హత్యాయత్నం కేసులు, ఒక డెకాయిటి కేసు, రెండు రాబరీ కేసులు, రెండు చీటింగ్ కేసులతోపాటు కొట్లాటలు, దౌర్జన్యం వంటి ఐ.పి.సి.కేసులు మరియు ప్రత్యేక చట్టాల క్రింద 34 కేసులు నమోదు ఉన్నాయని, సత్యనారాయణపురం లో-23, సూర్యారావుపేట లో – 8, అజిత్ సింగ్ నగర్ లో 4, వన్ టౌన్ లో 1, గవర్నర్ పేట లో 1, కృష్ణలంక లో 2, నున్న పోలీస్ స్టేషన్ లో 3 నమోదై ఉన్నాయని గతంలో రౌడీ షీట్ కూడా ఉండేదని వివరించారు. నేర చరిత్రకు రాజకీయ పలుకుబడిని అడ్డం పెట్టుకుని సెటిల్మెంటు చేయడం, ఆస్తులను కబ్జా చేసినట్టు గుర్తించారు. బాధితులు ఎవరైనా ఉంటే ముందుకు రావాలని పోలీసులు సూచించారు.