ఏపీలో సంచలనం సృష్టించిన హత్య కేసు.. ఒకే రోజు 34 మంది అరెస్ట్‌

www.mannamweb.com


ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ దుమారం రేపిన మరియమ్మ హత్య కేసులో మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. ఈ హత్యకు సంబంధించి ఒకేసారి 34 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
2020, నవంబర్ 27.. అంటే సరిగ్గా నాలుగేళ్ల క్రితం గుంటూరు జిల్లా వెలుగపూడిలో మరియమ్మ హత్యకు గురయ్యారు. ఆమె గతంలో వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. స్థానిక వైసీపీ నాయకులే హత్య చేశారంటూ ప్రచారం జరిగినా.. అప్పటి ప్రభుత్వం ఈ కేసును సీరియస్‌గా తీసుకోలేదు.

ఇక, ఏపీలో 2024లో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఈ కేసుపై పోలీసులు దూకుడు పెంచారు. ఈ కేసుతో సంబంధం ఉందని ఇప్పటికే బాపట్ల మాజీ ఎంపీ, వైసీపీ నాయకుడు నందిగామ సురేష్‌ను అరెస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ హై కోర్టు సురేష్‌కు రిమాండ్ విధించింది. ఇటీవలే ఆయన సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ వేయగా.. ఛార్జిషీట్ నమోదు చేసే వరకు ఈ కేసులో తాము జోక్యం చేసుకోలేమని కోర్టు తేల్చి చెప్పింది. తాజాగా తుళ్లూరు పోలీసులు ఈ కేసు విషయంలో 34 మందిని ఒకేసారి అరెస్ట్ చేయడంతో, మరో సారి మరియమ్మ హత్య కేసు వార్త వెలుగులోకి వచ్చింది.

మరియమ్మ హత్యతో రాజకీయ దుమారం:

మరియమ్మ హత్యకు గురికావడంతో ఏపీలో రాజకీయ దుమారం రేగింది. మరియమ్మ ఒక దళితురాలు కావడంతో ప్రతిపక్ష నాయకులు వైసీపీని తీవ్ర స్థాయిలో విమర్శించారు. వైసీపీ పార్టీ, ముఖ్యంగా వైఎస్ జగన్ దళితులకు వ్యతిరేకమని టీడీపీ నేతలు పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చాకా.. ఈ కేసును సీరియస్‌గా తీసుకుని కేసు విచారణ వేగం పెంచింది. తాజాగా ఈ కేసుకు సంబంధించి 34 మందిని పోలీసులు అరెస్ట్ చేసి, మంగళగిరి కోర్టులో హాజరుపరిచారు.