మటన్, చికెన్, చేపలు ప్రోటీన్ యొక్క అత్యంత సాధారణ వనరులు. అయితే ఈ మూడింటిలోనూ ప్రత్యేకమైన పోషక, శారీరక ప్రభావాలు ఉంటాయి. ఇవి కేలరీలలో మాత్రమే కాకుండా కొవ్వు రకం, జీర్ణక్రియ, గుండె ఆరోగ్యం వంటి భౌతిక లక్షణాలలో కూడా విభిన్నంగా ఉంటాయి.
గుండె, మెదడు ఆరోగ్యానికి తోడ్పడే ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు చేపలలో పుష్కలంగా లభిస్తాయి. చికెన్ రోజువారీ వినియోగానికి అనువైన లీన్, సమతుల్య ప్రోటీన్‌ను అందిస్తుంది. మటన్ శక్తిని అందిస్తుంది.
కేలరీలు – కొవ్వు పోలిక
కేలరీల విషయంలో మటన్ (100 గ్రాములకు 230-260 కేలరీలు) అత్యధికంగా ఉంటుంది. చికెన్ (150 కేలరీలు) మితమైన ఎంపిక. చేపలు (90-210 కేలరీలు) రకాన్ని బట్టి మారుతాయి. కొవ్వు రకం విషయానికి వస్తే మటన్‌లో సంతృప్త కొవ్వు అధికంగా ఉంటుంది. ఇది తరచుగా తింటే శరీరంలో కొవ్వు పెరిగే అవకాశం ఉంది. చికెన్ ఆరోగ్యకరమైన అన్‌శాచురేటెడ్ కొవ్వులను కలిగి ఉంటుంది. చేపలలో ఉండే ఒమేగా-3లు యాంటీ ఇన్‌ఫ్లమేటరీగా పనిచేసి గుండె రక్షణకు తోడ్పడతాయి. అందుకే గుండె ఆరోగ్యానికి వాటి ప్రాధాన్యత క్రమం చేపలు > చికెన్ > మటన్‌గా ఉంటుంది.
ప్రోటీన్ నాణ్యత, జీర్ణవ్యవస్థ
ప్రోటీన్ నాణ్యతలో చికెన్ ముందుంది(100 గ్రాములకు 27-31 గ్రాములు). ఇది కండరాల మరమ్మత్తు, రోజువారీ అవసరాలకు మంచి మూలం. చేపలలో 20-25 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. జీర్ణవ్యవస్థపై చూపే ప్రభావం విషయానికొస్తే, చేపలు చాలా తేలికగా జీర్ణమవుతాయి. ఆమ్లత్వం ఉన్నవారికి మంచివి. చికెన్ కూడా సులువుగా జీర్ణమవుతుంది. అయితే మటన్ మాత్రం నెమ్మదిగా జీర్ణమవుతుంది. అందుకే జీర్ణక్రియకు సహాయపడటానికి దానిని సాంప్రదాయ భారతీయ సుగంధ ద్రవ్యాలతో వండటం మంచిది.
ఎప్పుడు దేనిని ఎంచుకోవాలి
మీరు తేలికైన ఆహారం, మెదడు, చర్మ ఆరోగ్యం కోసం చూస్తుంటే చేపలు ఎంచుకోవచ్చు. రోజువారీ ప్రోటీన్ అవసరాలకు, కండరాల బలాన్ని కాపాడుకోవడానికి చికెన్ అనుకూలం. పూర్తిగా సంతృప్తికరంగా, ఎక్కువ శక్తి అవసరమైన రోజులకు మటన్ సరైన ఎంపిక. మొత్తంగా ఈ మూడింటిలో దేనిని ఎంచుకోవాలో అనేది మీ శరీరానికి ఒక రోజులో అవసరమైన శక్తి, వాతావరణం, మీ శరీరం ఎలా స్పందిస్తుంది అనేదానిపై ఆధారపడి ఉంటుంది.































