Andhra News: పేరు మార్చుకున్నారు.. ఆలోచనా విధానమే మారలేదు: ముద్రగడ కుమార్తె క్రాంతి

‘మా తండ్రి ముద్రగడ పద్మనాభం ఇటీవల తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకున్నారు. ఆయన ఆలోచనా విధానం మాత్రం మార్చుకోకపోవడం ఆందోళనగా ఉంది’ అని ఆయన కుమార్తె క్రాంతి.. ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు.


రాజమహేంద్రవరం: ‘మా తండ్రి ముద్రగడ పద్మనాభం ఇటీవల తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకున్నారు. ఆయన ఆలోచనా విధానం మాత్రం మార్చుకోకపోవడం ఆందోళనగా ఉంది’ అని ఆయన కుమార్తె క్రాంతి.. ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు. మాజీ మంత్రి ముద్రగడ ఇటీవల జనసేనాని పవన్‌ కల్యాణ్‌పై సవాలు విసిరి ఓటమి చెందిన నేపథ్యంలో తన పేరు మార్చుకున్న విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా క్రాంతి స్పందిస్తూ.. మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని ఎప్పుడూ ప్రశ్నించని తన తండ్రికి పవన్‌కల్యాణ్‌ను ప్రశ్నించే అర్హత ఉందా? అని నిలదీశారు. పేరు మార్చుకున్నాక కాపుల గురించి, ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ గురించి ఆయనకు ఎందుకని ప్రశ్నించారు. సమాజానికి ఏం చేయాలో పవన్‌కల్యాణ్‌కు స్పష్టత ఉందని, తన తండ్రికి మాత్రమే లేదని అనిపిస్తోందని అన్నారు. శేష జీవితాన్ని ఇంటికే పరిమితం చేసి విశ్రాంతి తీసుకోవాలని సలహా ఇస్తున్నానని, మరో దఫా పవన్‌కల్యాణ్‌ను విమర్శిస్తే గట్టిగా ప్రతిఘటిస్తానని క్రాంతి ఈ సందర్భంగా పేర్కొన్నారు.