ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని అందరికీ ఉంటుంది. జాబ్ కొట్టడమే లక్ష్యంగా ప్రిపరేషన్ కొనసాగిస్తుంటారు. మంచి ఉద్యోగం సాధించి లైఫ్ లో సెటిల్ అవ్వాలని భావిస్తుంటారు. కానీ అది కొందరికే సాధ్యమవుతుంటుంది. వందల్లో ఖాళీ పోస్టులుంటే వేలల్లో అభ్యర్థులుంటున్నారు. అందులో డెడికేషన్ తో ప్రిపేర్ అయి ప్రయత్నించిన వారు ప్రభుత్వ ఉద్యోగాన్ని సొంతం చేసుకుంటున్నారు. గవర్నమెంట్ కొలువులకు మొదట్లో శాలరీలు తక్కువగా ఉన్నా ఎక్స్ పీరియన్స్ పెరిగే కొద్ది హైక్ అవుతుంటాయి. ప్రభుత్వం పలు రకాల సౌకర్యాలను కల్పిస్తూ ఉంటుంది. సెక్యూరిటీ ఉంటుంది కాబట్టి ప్రభుత్వ ఉద్యోగాలకు డిమాండ్ ఎక్కువ. మరి మీరు కూడా జాబ్ సెర్చ్ లో ఉన్నారా? ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే మీ లక్ష్యమా? అయితే ఈ ఛాన్స్ ను వదలకండి.
కేంద్ర ప్రభుత్వ సంస్థలో జాబ్ కొట్టే అవకాశం వచ్చింది. నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దేశవ్యాప్తంగా ఎన్‌ఐసీఎల్ కార్యాలయాల్లో ఓపెన్ మార్కెట్ ప్రాతిపదికన క్లాస్-III కేడర్‌లో అసిస్టెంట్ పోస్టుల భర్తీకి రెడీ అయ్యింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 500 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిల్లో ఆంధ్రప్రదేశ్‌లో 21, తెలంగాణలో 12 ఖాళీలు ఉన్నాయి. అభ్యర్థులు ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు.. స్థానిక భాష చదవడం, రాయడం, మాట్లాడటం వచ్చి ఉండాలి. అభ్యర్థుల వయసు 21 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
ఈ పోస్టులకు ఆన్‌లైన్ ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామినేషన్, రీజనల్ లాంగ్వేజ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.22 వేల 405 నుంచి రూ.62 వేల265 జీతం అందిస్తారు. దరఖాస్తు ఫీజు రూ.850 చెల్లించాలి. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ ఎక్స్‌సర్వీస్‌మెన్ అభ్యర్థులు రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. అప్లికేషన్ ప్రక్రియ అక్టోబర్ 24 నుంచి ప్రారంభం కానున్నది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు నవంబర్ 11 వరకు ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు పూర్తి వివరాలకు nationalinsurance.nic.co.in అధికారిక వెబ్‌సైట్ ను సందర్శించాల్సి ఉంటుంది.