లడ్డూ వివాదం ఏపీ రాజకీయాలను షేక్ చేస్తోంది. తిరుమల దర్శనానికి వెళ్లేందుకు సిద్ధమైన వైసీపీ అధినేత జగన్‌ను అడ్డుకున్నారన్న ఆరోపణల్ని సీఎం చంద్రబాబు కొట్టిపడేశారు.
తిరుపతిలో భారీ ర్యాలీలకు మాత్రమే అవకాశం లేదన్నారని క్లారిటీ ఇచ్చారు. వేరే మతాల వ్యక్తులు స్వామివారిని దర్శించుకోవాలంటే కచ్చితంగా అక్కడి సంప్రదాయాలు పాటించాల్సిందేనన్నారు. రివర్స్ టెండర్లతో నాసిరకం నెయ్యి తెచ్చి అపవిత్రం చేశారన్నారు. ఆలయాల్లోనూ ఇలాంటి అక్రమాలు జరిగాయని, అందుకే ప్రక్షాళన చేశామన్నారు చంద్రబాబు.
ఏపీలో లడ్డూ వివాదం నేపథ్యంలో తిరుమల దర్శనానికి వెళ్లేందుకు సిద్దమైన వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ను అడ్డుకున్నారంటూ ఆయన చేసిన విమర్శల్ని సీఎం చంద్రబాబు తోసిపుచ్చారు. ఆయన్ను ఎవరూ అడ్డుకోలేదన్నారు. తిరుపతిలో వైసీపీ నేతలు భారీ ర్యాలీలు తీస్తామంటే వద్దన్నట్లు తెలిపారు. శ్రీవారి మీద భక్తి ఉండే ఏ భక్తుడికైనా దర్శనం చేసుకునే అవకాశం ఉందన్నారు. అదే సమయంలో వేరే మతాల వ్యక్తులుంటే అక్కడి సంప్రదాయాలు గౌరవించాలన్నారు. తాజాగా దేవస్థానంలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని, ఇలాంటి సమయంలో జగన్ అక్కడికి వెళ్లేందుకు సిద్దమయ్యారని, వైసీపీ శ్రేణులు భారీ ర్యాలీలకు ప్రయత్నించినందుకే సెక్షన్ 30 పెట్టారన్నారు.
జగన్‌కు నోటీసులు ఇచ్చినట్లు దుష్ప్రచారం చేస్తున్నారని, అలా ఇచ్చి ఉంటే చూపించాలన్నారు. సమాజంలో ఏ మతానికైనా కొన్ని సంప్రదాయాలు, ఆచారాలుంటాయని, అక్కడికి వెళ్లినప్పుడు వాటిని పాటించాలని, వాటి కంటే ఎవరూ గొప్పవారు కాదన్నారు. ధిక్కార శైలి మాత్రం సరికాదన్నారు. జగన్ బాబాయ్ ఎక్కడ ?, ఇంత జరిగినా కూడా బయటకు రాలేదా ? తిరుమల పవిత్రత కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. అలా జరగకపోతే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని చంద్రబాబు తెలిపారు. గతంలో నిబంధనలు ఉల్లంఘించి తిరుమలకు వెళ్తే.. ఇప్పుడు కూడా వెళ్లాలా అని చంద్రబాబు ప్రశ్నించారు. రౌడీయిజం చేస్తాననడం సరికాదన్నారు. చట్టాలు పాలించే కాశ్మీర్ ముఖ్యమంత్రుల వంటి వారు కూడా డిక్లరేషన్ ఇచ్చి దర్శనానికి వెళ్లారన్నారు. హిందూ మతాన్ని గౌరవిస్తానంటున్న జగన్ .. తిరుమలలో ఆచారం పాటించాల్సిందేనన్నారు.
బైబిల్ ఇంట్లోనే కాదు బయట కూడా చదువుకోవచ్చన్నారు. తాను కూడా మత సామరస్యాన్ని పాటిస్తానన్నారు. తిరుమల లడ్డూ తయారీలో వాడే నెయ్యి కల్తీ జరిగిందని పదే పదే గుర్తించి ఈవో ఎన్డీడీబీకి పరీక్షలకు పంపారన్నారు. గతంలో కల్తీ నెయ్యి వాడారని, వాడలేదని జగన్ ఎలా చెప్తారని చంద్రబాబు ప్రశ్నించారు. ఈ రిపోర్టును బయటపెట్టకపోతే తాము తప్పుచేసినట్లు అవుతుందన్నారు. తాను తప్పుచేశానని జగన్ చెప్తున్నారని, కానీ టెండర్లకు షరతులు ఎందుకు మార్చారని ప్రశ్నించారు. రివర్స్ టెండర్ల ద్వారా నాసిరకం నెయ్యి తెచ్చి అపవిత్రం చేశారన్నారు. ఇప్పుడు ఈవో చెప్పలేదు, రిపోర్టులు లేవనంటున్నారన్నారు. అన్ని ఆలయాల్లోనూ ఇలాంటి అక్రమాలు జరిగాయని, వాటిని తాము ప్రక్షాళన చేశామన్నారు.