తిరుమలకు కొత్త క్యాంటీన్లొచ్చాయ్

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. మంగళవారం నాడు 64,925 మంది భక్తులు శ్రీవారి దర్శించుకున్నారు. వారిలో 21,338 మంది తలనీలాలు సమర్పించారు.


తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్కరోజే హుండీ ద్వారా 3.90 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.

వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 11 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి 8 నుంచి 10 గంటల సమయం పట్టింది. కంపార్ట్‌మెంట్లు, క్యూ లైన్లల్లో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు అన్న ప్రసాదం, అల్పాహారం, పాలు, మంచినీరు పంపిణీ చేశారు.

తిరుమలలో కొత్తగా క్యాంటీన్లు ఏర్పాటయ్యాయి. ఇప్పటికే అందుబాటులో ఉన్న బిగ్, జనత క్యాంటీన్లకు ఇవి అదనం. ప్రస్తుతం తిరుమలలో 10 బిగ్ క్యాంటీన్లు, ఆరు జనతా క్యాంటీన్లు అందుబాటులో ఉన్నాయి. వీటికి అదనంగా మరో అయిదు చొప్పున ఈ రెండు క్యాంటీన్లు ఏర్పాటయ్యాయి. శ్రీవారి వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా అవి తమ కార్యకలాపాలను మొదలు పెట్టనున్నాయి. పారదర్శకంగా క్యాంటీన్లను కేటాయించామని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు.

ఇందుకోసం నూతన పాలసీ తయారు చేశామని వివరించారు. నిపుణుల కమిటీతో ఆయా సంస్థల కార్యకలాపాలు క్షేత్ర స్థాయిలో పరిశీలించి, అర్హత కలిగిన సంస్థలకు మాత్రమే క్యాంటీన్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. తిరుమల అన్నమయ్య భవన్ లో కార్యనిర్వాహణాధికారి జే శ్యామలరావు, అదనపు ఈఓ సీహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తుల ఆహార అవసరాలకు అనుగుణంగా కొత్త క్యాంటీన్లకు అనుమతులు ఇచ్చినట్లు చెప్పారు.

బిగ్ క్యాంటీన్లు:

1. శ్రీవత్స బిగ్ క్యాంటీన్- అడయార్ ఆనంద భవన్ స్వీట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, చెన్నై

2. కౌస్తుబం బిగ్ క్యాంటీన్- ధంతూరి గ్రూప్ ఆఫ్ హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్, హైదరాబాద్

3. సందీప బిగ్ క్యాంటీన్ – ప్రిజం హాస్పిటాలిటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, హైదరాబాద్

4. సప్తగిరి బిగ్ క్యాంటీన్ – సంకల్ప్ రిక్రియేషన్ ప్రైవేట్ లిమిటెడ్, అహ్మదాబాద్

5. శ్రీ వెంకటేశ్వర బిగ్ క్యాంటీన్ – శ్రీ సుఖ్‌సాగర్ హాస్పిటాలిటీ సర్వీసెస్, నవీ ముంబై

జనతా క్యాంటీన్లు

1. PAC (WEST) జనతా క్యాంటీన్ – త్రివర్గ ఫుడ్ అండ్ బేవరేజెస్, విజయవాడ

2. PAC (NORTH) – జనతా క్యాంటీన్ – శ్రీ రాఘవేంద్ర వెజ్ రెస్టారెంట్, హైదరాబాద్

3. SMC జనతా క్యాంటీన్ – సంతోష్ ధాబా ఎక్స్‌క్లూజివ్ A/C (సంతోష్ కాజిల్), హైదరాబాద్

4. HVC జనతా క్యాంటీన్ – శ్రీదేవి హాస్పిటాలిటీ సర్వీసెస్, నవీ ముంబై

5. MMT జనతా క్యాంటీన్ – పృథ్వీ హాస్పిటాలిటీ సర్వీసెస్, పూణే.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.