తెరపైకి కొత్త డిమాండ్‌.. దేశంలో మరో కొత్త రాష్ట్రం

www.mannamweb.com


ప్రత్యేక రాష్ట్రం అనగానే అందరికి ముందుగా గుర్తుకు వచ్చేది.. తెలంగాణ. ఎన్నో ఏళ్లు పోరాటం చేసి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నుంచి విడిపోయి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే దేశంలో మరి కొన్ని ప్రాంతాలకు సంబంధించి ఇలాంటి డిమాండ్లు ఎప్పటి నుంచో ఉన్నాయి. అనేక రాష్ట్రాల్లో పలు ప్రాంతాలు ప్రత్యేక గుర్తింపు కోరుతూ.. ఉద్యమాలు చేస్తున్నాయి. సిక్కుల కలిస్తాన్‌ డిమాండ్‌ ఈ కోవకు చెందినదే. ఈ క్రమంలో తాజాగా దేశ రాజకీయ వర్గాల్లో ఓ అంశం హాట్‌ టాపిక్‌గా మారింది. దాన్ని బట్టి చూస్తే.. త్వరలోనే దేశంలో మరో కొత్త రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతం ఏర్పాటు కానుంది అని తెలుస్తోంది. ఇందుకు కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్‌డీఏ ప్రభుత్వం సుముఖంగా ఉన్నట్లు అర్థం అవుతోంది. ఆ వివరాలు..

పశ్చిమ బెంగాల్‌ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర విద్యా శాఖ సహాయ మంత్రి సుకాంత్ మజుందార్ చేసిన ప్రకటనతో దేశంలో కొత్త రాష్ట్రం అంశం తెర మీదకు వచ్చింది. ఉత్తర బెంగాల్‌ను ఈశాన్య ప్రాంతంలో చేర్చి.. ప్రత్యేక రాష్ట్రం, లేదా కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలనే ప్రతిపాదనను సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘‘నేను ఈరోజు ప్రధానమంత్రిని కలిశాను. ఉత్తర బెంగాల్‌ను ఈశాన్య భారతదేశంలో కలిపి ప్రత్యేక రాష్ట్రం చేయాలని విన్నవించాను. అప్పుడే ఈ రంగం పాలనాపరంగా, ఆర్థికంగా, సంస్కృతింగా, న్యాయపరంగా అభివృద్ధి చెందుతుంది. కేంద్ర ప్రభుత్వం పథకాలు అందుతాయి అని తెలిపాను’’ అన్నారు. ఇక దీనిపై ప్రధానమంత్రినిర్ణయం తీసుకోవాల్సి ఉంది’’ అని చెప్పుకొచ్చారు. ఈ అంశంపై టీఎంసీ నేతలు విమర్శలు చేస్తున్నారు.

బెంగాల్ నుండి ఉత్తర బెంగాల్‌ను విడదీయడం గురించి బీజేపీ మాట్లాడటం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ఈ అంశం అనేక సార్లు తెర మీదకు వచ్చింది. పశ్చిమ బెంగాల్‌ నుంచి ఉత్తర బెంగాల్‌ను విడదీసి.. ప్రత్యేక రాష్ట్రంగా చేయాలని ఎప్పటి నుంచో డిమాండ్‌ చేస్తున్నారు. అయితే తాజాగా ఇప్పుడీ ప్రతిపాదన రావడం మాత్రం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. లోక్‌కసభ ఎన్నికల ఫలితాల తర్వాత.. బీజేపీ పలు రాష్ట్రాల్లో తన ఆధిక్యతను పెంచుకునే ప్రయత్నాలు చేస్తోంది.

ఇక పశ్చిమ బెంగాల్‌ విషయానికి వస్తే.. అక్కడ కాషాయ పార్టీనే రెండో అతి పెద్ద పార్టీ. పైగా ఇప్పుడు డిమాండ్‌ చేస్తోన్న ప్రత్యేక రాష్ట్రం నార్త్‌ బెంగాల్‌లో బీజేపీకీ మంచి పట్టుంది. దాంతో కమలం పార్టీ తరచుగా నార్త్‌ బెంగాల్‌ను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ను తెర మీదకు తీసుకొస్తుంటుంది. రానున్న పశ్చిమ బెంగాల్‌ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం దీనికి ఆమోదం తెలిపే అవకాశం ఉందంటున్నారు. అప్పుడు మరిన్ని కొత్త ప్రతిపాదనలు తెర మీదకు వస్తాయి అంటున్నారు.