చిరంజీవికి బాధ్యతలు, రేవంత్ మూడ్ క్లియర్- ‘బెనిఫిట్’ పై కొత్త ఫార్ములా

www.mannamweb.com


తెలుగు సినీ ఇండస్ట్రీలో నేడు కీలకం. సంక్రాంతికి భారీ సినిమాల విడుదల వేళ తెలంగాణ ప్రభుత్వం ఆగ్రహం తగ్గించి.. ప్రసన్నం చేసుకునేందుకు టాలీవుడ్ ప్రముఖులు రంగంలోకి దిగుతున్నారు.

అల్లు అర్జున్ వివాదానికి ముగింపుతో పాటుగా బెనిఫిట్ షోలు .. టికెట్ ధరల పెంపు పై తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం మార్పు దిశగా ప్రయత్నం జరగనుంది. భేటీ వేళ సీఎం రేవంత్ స్పషమైన సంకేతాలు టాలీవుడ్ కు అర్దమయ్యాయి. దీంతో, చిరంజీవి పైనే రేవంత్ ను ఒప్పించే బాధ్యత అప్పగించిన సినీ పెద్దలు.. 36 మందితో ఏరి కోరి చర్చల టీం ఖరారు చేసారు.

చిరంజీవి కి బాధ్యతలు

అల్లు అర్జున్ ఎపిసోడ్ తో తెలంగాణ ప్రభుత్వం వర్సస్ టాలీవుడ్ అన్నట్లుగా పరిస్థితి మారింది. పుష్ప -2 ప్రీమియర్ షో తొక్కిసలాట ఘటనను సీఎం రేవంత్ సీరియస్ గా తీసుకున్నారు. సినీ ఇండస్ట్రీ మొత్తం జైలు నుంచి విడుదల అయిన అల్లు అర్జున్ ను పరామర్శించి.. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించక పోవటం పైన మండిపడ్డారు. దీంతో, ఇండస్ట్రీ నుంచి పలువురు వెళ్లి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను పరామర్శించారు. పుష్ఫ టీం రూ 2 కోట్ల ఆర్దిక సాయం ప్రకటించింది. ఇక, ఇప్పుడు ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్ రాజు జోక్యంతో టాలీవుడ్ తో చర్చల కోసం సీఎం రేవంత్ అంగీకరించారు. ఈ రోజు ఈ సమావేశం జరగనుంది.

ఏరి కోరి మెగా టీం కూర్పు

సీఎం రేవంత్ తో సమావేశం కోసం టాలీవుడ్ నుంచి 36 మందిని ఎంపిక చేసారు. రేవంత్ మనసు మార్చి.. సానుకూల నిర్ణయాల దిశగా ఒప్పించే బాధ్యత చిరంజీవికి అప్పగించారు. ఇండస్ట్రీలోని అన్ని విభాగాల నుంచి ప్రతినిధులు హాజరు కానున్నారు. అల్లు అరవింద్ జరిగిన ఘటన పైన సీఎం వద్ద వివరణ ఇచ్చేలా ముందస్తు చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. ఇక, ఇండస్ట్రీ నుంచి ప్రభుత్వానికి పూర్తి సహకారం అందిస్తామని ఈ భేటీలో హామీ ఇవ్వనున్నారు. బెనిఫిట్ షోలు .. టికెట్ ధరల విషయంలో రేవంత్ తీసుకున్న నిర్ణయం పైన సామాన్యుల నుంచి సానుకూలత వ్యక్తం అవుతోంది. కానీ, ఇండస్ట్రీలో మాత్రం సంక్రాంతి వేళ టెన్షన్ పెరిగిపోతోంది.

రేవంత్ మూడ్ క్లియర్

దీంతో, బెనిఫిట్ షో లు.. టికెట్ ధరల గురించి చర్చల వేళ సీఎం రేవంత్ మూడ్ కు అనుగుణం గా రాజీకి సిద్దపడాలని సినిమా పెద్దలు నిర్ణయించారు. బెనిఫిట్ షో ల తగ్గింపు .. టికెట్ ధరల అంశం లోనూ ప్రభుత్వానికి ప్రజల నుంచి వ్యతిరేకత లేకుండా పరిమితం అయ్యేలా కొత్త ప్రతిపాదన సీఎం ముందు చేసేలా ప్లాన్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ఇంట్లో కాకుండా.. పోలీసులకు సంబంధించిన అధికారిక భవనంలో సినీ ప్రముఖుల భేటీ ఏర్పాటు చేయటం ద్వారా రేవంత్..ఈ వ్యవహారంలో కఠినంగానే ఉండాలనే సంకేతాలు ఇచ్చినట్లు స్పష్టం అవుతోంది. అదే సమయంలో చర్చలకు అవకాశం ఇవ్వటంతో..దీనిని సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్నారు.

సీఎం నిర్ణయం ప్రజల్లోకి వెళ్లటంతో వాటి నుంచి వెనక్కు రావటం అంత సులభం కాదనే అభిప్రాయం ఉంది. దీంతో, ముఖ్యమంత్రిని చిరంజీవి టీం ఏ మేర ఒప్పిస్తుంది.. ఎలాంటి ఫలితాలు ఈ భేటీ లో వస్తాయనేది అటు సినీ – ఇటు పొలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తి కరంగా మారుతోంది.