Health: రక్తంలో కొలెస్ట్రాల్‌పై కొత్త మార్గదర్శకాలు.. తొలిసారి జారీ చేసిన సీఎస్‌ఐ

రక్తంలో కొలెస్ట్రాల్‌ స్థాయిల అసాధారణ హెచ్చుతగ్గులను (డిస్లిపిడెమియా) నివారించేందుకు దోహదపడేలా కార్డియోలాజికల్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా (సీఎస్‌ఐ) మన దేశంలో తొలిసారి మార్గదర్శకాలను గురువారం జారీ చేసింది.


దిల్లీ: రక్తంలో కొలెస్ట్రాల్‌ స్థాయిల అసాధారణ హెచ్చుతగ్గులను (డిస్లిపిడెమియా) నివారించేందుకు దోహదపడేలా కార్డియోలాజికల్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా (సీఎస్‌ఐ) మన దేశంలో తొలిసారి మార్గదర్శకాలను గురువారం జారీ చేసింది. రక్తంలో మొత్తంగా కొలెస్ట్రాల్‌ అధికంగా ఉండటం, ఎల్‌డీఎల్‌-కొలెస్ట్రాల్‌ (చెడు కొలెస్ట్రాల్‌) ఎక్కువవడం, ట్రైగ్లిసెరైడ్స్‌ అధికమవడం, హెచ్‌డీఎల్‌-కొలెస్ట్రాల్‌ (మంచి కొలెస్ట్రాల్‌) తక్కువవడం వంటివి డిస్లిపిడెమియా పరిధిలోకి వస్తాయి. గుండెపోటు, పక్షవాతం తదితర గుండె సంబంధిత వ్యాధులకు అది దారితీస్తుంటుంది. ఇది నిశ్శబ్ద హంతకిలాంటిదని సీఎస్‌ఐ అధ్యక్షుడు డాక్టర్‌ ప్రతాప్‌చంద్ర రథ్‌ తెలిపారు. అధిక రక్తపోటు, మధుమేహం వంటి సమస్యల తరహాలో దీని లక్షణాలు ముందుగా బయటపడవని పేర్కొన్నారు. రక్తంలో కొలెస్ట్రాల్‌ల స్థాయిలను నియంత్రణలో ఉంచుకునేందుకు తమ మార్గదర్శకాలు దోహదపడతాయని వివరించారు.

తాజా మార్గదర్శకాల ప్రకారం..
గుండెజబ్బులు వంశపారంపర్యంగా వస్తున్న కుటుంబాలకు చెందినవారు, రక్తంలో మొత్తం కొలెస్ట్రాల్‌ స్థాయిలు ఎక్కువగా ఉండే (హైపర్‌కొలెస్టెరోలెమియా) కుటుంబాలకు చెందినవారు తొలి లిపిడ్‌ ప్రొఫైల్‌ను 18 ఏళ్లు లేదా అంతకంటే తక్కువ వయసులోనే చేయించుకోవాలి.
సాధారణ ప్రజలు, ముప్పు తక్కువగా ఉన్నవారు ఎల్‌డీఎల్‌-సీ స్థాయిలను 100 ఎంజీ/డీఎల్‌కు, నాన్‌-హెచ్‌డీఎల్‌-సీ స్థాయిలను 130 ఎంజీ/డీఎల్‌కు తక్కువగా ఉండేలా చూసుకోవాలి.
ముప్పు ఎక్కువగా ఉన్న వ్యక్తులు (మధుమేహం, రక్తపోటు వంటి సమస్యలు ఉన్నవారు) ఎల్‌డీఎల్‌-సీ స్థాయిలు 70 ఎంజీ/డీఎల్‌కు, నాన్‌-హెచ్‌డీఎల్‌-సీ స్థాయిలు 100 ఎంజీ/డీఎల్‌కు లోబడి ఉండేలా జాగ్రత్త పడాలి.
ముప్పు అత్యధికంగా ఉన్నవారైతే (పక్షవాత బాధితులు, గుండెపోటు బారినపడ్డవారు, దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధుల బాధితులు) ఎల్‌డీఎల్‌-సీ స్థాయిలు 55 ఎంజీ/డీఎల్‌కు, నాన్‌-హెచ్‌డీఎల్‌-సీ స్థాయిలు 85 ఎంజీ/డీఎల్‌కు తక్కువగా ఉండేలా జాగ్రత్త వహించాలి.
ఆహారంలో చక్కెర, కార్బోహైడ్రేట్లను తక్కువగా తీసుకోవాలి.
గుండె ఆరోగ్యాన్ని కాపాడే యోగా, వ్యాయామం వంటివి చేయాలి.