రాష్ట్రంలో కొత్త హైస్పీడ్‌ కారిడార్‌

రాష్ట్రానికి మరో హైస్పీడ్‌ కారిడార్‌ రానుంది. ప్రస్తుతం కోల్‌కతా-చెన్నై జాతీయ రహదారి-16 మన రాష్ట్రం మీదుగా వెళ్తుండగా, దీనికి సమాంతరంగా కొత్త హైవే నిర్మాణం జరగనుంది. సరకు రవాణాకు ప్రాధాన్యమిచ్చేలా పశ్చిమబెంగాల్‌లోని ఖరగ్‌పూర్‌ నుంచి ఏపీ మీదుగా చెన్నైకి హైస్పీడ్‌ గ్రీన్‌ఫీల్డ్‌ కారిడార్‌ నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. దీని ఎలైన్‌మెంట్‌పై కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ (మోర్త్‌) కసరత్తు ఆరంభించింది. సలహా సంస్థను ఎంపికచేసి, ఈ హైవే.. ఎటువైపు, ఎలా వెళ్తే అన్ని విధాలా ప్రయోజనం ఉంటుందనేది అధ్యయనం చేయిస్తోంది.


  • కోల్‌కతా-చెన్నై హైవేకి ఓ వైపు తీరప్రాంతం ఉంది. అందులో కత్తిపూడి-కాకినాడ నుంచి ఒంగోలు వరకు హైవే-216 ఉంది. దీంతో కోల్‌కతా-చెన్నై హైవేకి మరోవైపు హైస్పీడ్‌ కారిడార్‌ నిర్మాణం ఉండేలా చూడనున్నారు.
  • ఇది విశాఖపట్నం నగరానికి కొంత దగ్గరగా వెళ్తుంది.
  • విజయవాడ సమీపంలో అమరావతి అవుటర్‌ రింగ్‌ రోడ్‌లో కలుస్తుంది. గుంటూరు అవతల అదే అవుటర్‌ రింగ్‌ రోడ్‌ నుంచి మళ్లీ మిగిలిన భాగం మొదలవుతుంది.
  • దీనిని చెన్నై వరకు నిర్మించకుండా, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు మధ్య ప్రస్తుత కోల్‌కతా-చెన్నై హైవేలో కలపాలని భావిస్తున్నారు. అయితే చెన్నై వరకు ఈ కారిడార్‌ను నిర్మిస్తేనే పూర్తిస్థాయిలో ప్రయోజనం ఉంటుంది.
  • గ్రీన్‌ఫీల్డ్‌తో, యాక్సెస్‌ కంట్రోల్‌ హైవే నిర్మించాలని ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.

రాష్ట్రానికి, అమరావతికి కీలకం..

ఇప్పుడున్న కోల్‌కతా-చెన్నై హైవేలో వాహన రద్దీ విపరీతంగా పెరిగింది. అలాగే ఈహైవే పూర్తిస్థాయిలో ఆరు వరుసలుగా కూడా లేదు. కొన్నిచోట్ల నాలుగు వరుసలుగా ఉంది.  వాహనాలు వేగంగా వెళ్లేందుకు అవకాశం ఉండటంలేదు. దీనికి సమాంతరంగా మరొక హైవే వస్తే.. వాహనదారులకు పెద్ద ఊరట లభిస్తుంది. ఈ హైవే కొత్త ప్రాంతాల మీదుగా వెళ్తుండటంతో అనుసంధానం ఏర్పడి, అవి అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉంటుంది. మరోవైపు రాజధాని అమరావతి చుట్టూ నిర్మిస్తున్న అవుటర్‌ రింగ్‌ రోడ్‌.. ఏడు హైవేల మీదుగా వెళ్తుంది. ఉత్తర భారతం, దక్షిణాది రాష్ట్రాలను అమరావతి/విజయవాడ అనుసంధానం చేస్తుంది. అలాగే అమరావతిలో అనేక కొత్త సంస్థలు ఏర్పాటవుతున్నాయి. మున్ముందు ఇతర రాష్ట్రాల నుంచి రాష్ట్ర రాజధానికి రాకపోకలు సాగించే వాహనాలు భారీగా పెరగనున్నాయి. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుంటే.. కొత్త హైవే నిర్మాణం అటు రాష్ట్రానికి, ఇటు రాజధాని అమరావతికి ఎంతో కీలకం కానుంది. రాష్ట్రంలో కోల్‌కతా-చెన్నై హైవేకి ప్రత్యామ్నాయంగా మరో జాతీయ రహదారి ఉండాలనే డిమాండ్‌ చాలాకాలంగా ఉంది. ఇప్పుడు అది సాకారమయ్యే అవకాశం ఏర్పడింది.

నెలరోజుల్లో స్పష్టత

దిల్లీలోని మోర్త్‌ ఉన్నతాధికారులు హైస్పీడ్‌ కారిడార్‌కు సంబంధించి ఎలైన్‌మెంట్ల తయారీని పరిశీలిస్తున్నారు. నెల రోజుల్లో వీటిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలతో సమావేశాలు నిర్వహించి, వారి సమ్మతి తీసుకున్న తర్వాత తుది ఎలైన్‌మెంట్‌ను ఖరారు చేయనున్నారు. అప్పుడు ఈ ప్రాజెక్టుకు ఎంత వ్యయం అవుతుంది? ఎంతమేరకు భూసేకరణ చేయాల్సి ఉంటుంది? తదితర వివరాలన్నింటిపై స్పష్టత వస్తుంది.

మూలపేట-విశాఖపట్నం కారిడార్‌ను కొనసాగిస్తారా?

శ్రీకాకుళం జిల్లాలోని మూలపేట పోర్టు నుంచి విశాఖపట్నం వరకు 6/8 వరుసలతో గ్రీన్‌ఫీల్డ్‌ కోస్టల్‌ కారిడార్‌ నిర్మించాలనే ప్రతిపాదన ఉంది. 165 కి.మీ. మేర ఉండే ఈ కారిడార్‌ కోసం జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) డీపీఆర్‌ సిద్ధంచేస్తోంది. దీనికి రూ.8,300 కోట్ల వ్యయమవుతుందని ప్రాథమిక అంచనా కూడా వేశారు. మోర్త్‌ రూపొందించే హైస్పీడ్‌ గ్రీన్‌ఫీల్డ్‌ కారిడార్‌లో దీనిని భాగం చేయాలని భావించారు. ఇప్పుడు మోర్త్‌.. హైస్పీడ్‌ కారిడార్‌ను.. సముద్రతీరం వైపున కాకుండా, కోల్‌కతా-చెన్నై హైవేకి అటువైపు నుంచి వెళ్లేలా కసరత్తు చేస్తోంది. దీంతో మూలపేట-విశాఖపట్నం కోస్టల్‌ కారిడార్‌ను ఏం చేస్తారనేది తెలియాల్సి ఉంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.