తెలంగాణ ప్రభుత్వం తరహాలోనే ఏపీలోని కూటమి ప్రభుత్వం సైతం కొత్త రేషన్ కార్డులపై ఫోకస్ చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి రంగం సిద్ధమైంది.
రాష్ట్రవ్యాప్తంగా ఆగస్ట్ 25వ తేదీ నుంచి 31 వరకు అర్హులైన లబ్ధిదారులకు జారీ అయిన ఈ కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను అందజేయనున్నారు. ఈ మేరకు ఏపీ పౌర సరఫరాల శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
4,29,79,897కి చేరిన లబ్దిదారులు
ఈ కార్యక్రమంలో ఏపీ సర్కార్ మొత్తం 1,45,97,486 స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయనుందని సమాచారం. వీటితో కలిపితే రాష్ట్రంలో రేషన్ కార్డు లబ్దిదారుల సంఖ్య 4,29,79,897కి చేరిందని అధికారులు తెలిపారు. ఈ స్మార్ట్ కార్డులు ఆధునిక సాంకేతికతతో రూపొందించారు. స్మార్ట్ రేషన్ కార్డులో కుటుంబ పెద్ద ఫోటో, కుటుంబసభ్యుల పేర్లు, QR కోడ్ వంటి సెక్యూరిటీ ఫీచర్లు ఉంటాయి. దీని ద్వారా లబ్ధిదారుల గుర్తింపు మరింత తేలిక అవుతుందని సర్కార్ చెబుతోంది. కొత్త స్మార్ట్ కార్డుల ఆధారంగా లబ్ధిదారులు సెప్టెంబర్ నెల నుంచి రేషన్ సరుకులు పొందుతారని అధికారులు తెలిపారు.
రేషన్ సరుకుల పంపిణీకి ప్రభుత్వం స్పష్టమైన సమయాలను ప్రభుత్వం పేర్కొంది. ప్రతి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు సరుకులు తీసుకొవచ్చు.
అందులో ఉదయం: 8:00 AM నుంచి 12:00 PM వరకు,
సాయంత్రం: 4:00 PM నుంచి 8:00 PM వరకు
లబ్ధిదారులు ఈ సమయాల్లో తమ సమీప రేషన్ దుకాణాలను సందర్శించి సరుకులు తీసుకోవాలని అధికారులు సూచించారు. 65 సంవత్సరాల పైబడిన వృద్ధులకు, అలాగే ప్రభుత్వం పింఛన్లు పొందే దివ్యాంగులకు, ప్రతి నెలా 26 నుంచి 30 తేదీల మధ్య ఇంటి వద్దనే సరుకులు అందజేస్తారు.
మీ రేషన్ కార్డులో సభ్యుల పేర్లు, క్యూ ఆర్ కోడ్
మీ రేషన్ కార్డులో కుటుంబ పెద్ద పేరు, క్యూ ఆర్ కోడ్ ఉంటుంది. మీరు రేషన్ కార్డులోని సభ్యుల వివరాలను ఇప్పుడు ఈజీగా తెలుసుకోవచ్చు. ఏపీ ప్రభుత్వం ఇందుకోసం చర్యలు చేపట్టింది. ఆగస్టు 25 నుంచి కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేయనున్న ప్రభుత్వం కార్డుదారుల వివరాలు తెలుసుకునేందుకు సైతం వీలు కల్పించింది. అందుకోసం కేవలం కొన్ని స్టెప్స్ పాటిస్తే సరిపోతుంది.
రేషన్ కార్డు వివరాలు చెక్ చేసుకునే విధానం
– ముందుగా మీరు అధికారిక వెబ్సైట్ https://aepos.ap.gov.in/SRC_Trans_Int.jsp లింక్ను ఓపెన్ చేయాలి
– అందులో మీ రేషన్ కార్డు నెంబర్(Ration Card Number)ను ఎంటర్ చేయండి
– ఆ తరువాత Submit బటన్ పై క్లిక్ చేయండి
– మీ కొత్త రేషన్ కార్డులోని సభ్యుల వివరాలు మీకు స్క్రీన్ పై కనిపిస్తాయి. మీరు ఈ రేషన్ కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు
ఏపీలో రేషన్ కార్డుల పంపిణీ హైలైట్స్
– ఆగస్ట్ 25 నుండి 31 వరకు ఏపీలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ
– మొత్తం 1,45,97,486 స్మార్ట్ రేషన్ కార్డులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం
– తాజాగా జారీ చేసిన కార్డులతో కలిపి మొత్తం రేషన్ లబ్ధిదారుల సంఖ్య 4,29,79,897కి చేరింది.
– స్మార్ట్ రేషన్ కార్డులో కుటుంబ పెద్ద ఫోటోతో పాటు కుటుం సభ్యుల పేర్లు, QR కోడ్ వంటి సెక్యూర్ ఫీచర్లు ఉన్నాయి
– కొత్త కార్డుదారులు సెప్టెంబర్ నుంచి రేషన్ సరుకులు పొందుతారు
































