2024-25 ఆర్థిక సంవత్సరానికి అగ్రశ్రేణి కంపెనీల్లో 1.25 లక్షల ఇంటర్న్‌షిప్‌లను అందజేసేలా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ పథకాన్ని ప్రారంభించిన విషయం చాలా మందికి తెలిసిందే.
ఐదేళ్లలో కోటి ఇంటర్న్‌షిప్‌లను అందించే పెద్ద పథకంలో భాగమైన పైలట్ ప్రాజెక్ట్ కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ షెడ్యూల్ విడుదల చేసింది. 2024-25 బడ్జెట్‌లో ప్రకటించిన ఈ పథకం పైలట్ దశకు రూ. 800 కోట్ల బడ్జెట్‌ను కేటాయించారు. ముఖ్యంగా కొత్తగా డిగ్రీ అయిన ఉద్యోగార్థులను దేశంలోని 500 అగ్రశ్రేణి కంపెనీలతో అనుసంధానం చేసేలా ఈ ప్రాజెక్టును రూపొందించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా అకడమిక్ లెర్నింగ్‌తో పాటు పరిశ్రమ అవసరాల మధ్య అంతరాన్ని తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతానికి, మహీంద్రా & మహీంద్రా, మాక్స్ లైఫ్, అలెంబిక్ ఫార్మా వంటి ప్రముఖ సంస్థలు ఇప్పటికే 1077 ఇంటర్న్‌షిప్ ఆఫర్‌లను అందించాయి. ఈ నేపథ్యంలో కొత్త ఇంటర్న్‌షిప్ స్కీమ్ గురించి వివరాలను తెలుసుకుందాం.
ఇంటర్న్‌షిప్‌కు వెళ్లాలనుకునే అభ్యర్థులు కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పోర్టల్‌లో అక్టోబర్ 12 నుంచి 25 మధ్య నమోదు చేసుకోవచ్చు. అలాగే ఎంపిక ప్రక్రియ అక్టోబర్ 27 నుంచి నవంబర్ 7 వరకు కొనసాగుతుంది. అనంతరం నవంబర్ 8 నుంచి 15 మధ్య ఇంటర్న్‌షిప్ ఆఫర్ లెటర్‌లు పంపుతారు. మొదటి బ్యాచ్ ఇంటర్న్‌లు డిసెంబర్ 2, 2024 నుంచి ఒక సంవత్సరం ఇంటర్న్‌షిప్‌లను ప్రారంభిస్తారు. ఈ స్కీమ్‌లో భాగస్వామ్యమయ్యే కంపెనీలు గత మూడేళ్లలో వారి కార్పొరేట్ సామాజిక బాధ్యత ఖర్చుల ఆధారంగా గుర్తించారు. ఇంటర్న్‌లు నెలకు రూ. 5,000 ఆర్థిక సహాయాన్ని అందిస్తారు. ప్రభుత్వం ద్వారా రూ. 4,500, అలాగే పాల్గొనే కంపెనీలు వారి సీఎస్ఆర్ నిధుల నుంచి రూ. 500 చెల్లించాల్సి ఉంటుంది. ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద చేరిన తర్వాత వారికి రూ. 6,000 వన్-టైమ్ గ్రాంట్, బీమా కవరేజీ కూడా అందిస్తారు.
పీఎం ఇంటర్న్‌షిప్ స్కీమ్‌కు అర్హులైన అభ్యర్థులు తప్పనిసరిగా 21-24 మధ్య వయస్సు కలిగి ఉండాలి. హై స్కూల్ లేదా హయ్యర్ సెకండరీ సర్టిఫికేట్, ఐటీఐ, డిప్లొమా లేదా బీఏ, బీఎస్సీ, బీకాం, బీసీఏ లేదా బీబీఏ వంటి గ్రాడ్యుయేట్ డిగ్రీలు కలిగి ఉండాలి. అయితే ఈ పథకంలో ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న వారు అర్హులు కారు. ఐఐటీ, ఐఐఎం, జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాల వంటి ప్రీమియర్ ఇన్‌స్టిట్యూట్‌ల నుంచి గ్రాడ్యుయేట్లు కూడా ఈ పథకానికి అర్హత ఉండదు. ఈ పథకం అమలులో వచ్చే ఫిర్యాదుల పరిష్కారం కోసం మల్టీ లాంగ్వేజెస్ హెల్ప్‌లైన్ 1800-116-090 కూడా ఏర్పాటు చేశారు.