ప్రపంచ ప్రజలు కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకుంటున్న వేళ.. ఏపీ సీఎం చంద్రబాబు కీలకమైన ట్వీట్ చేశారు. అందులో చాలా విషయాలను ప్రస్తావించారు. ఆయన ఏం చెప్పినా..
సుదీర్ఘంగా, చాలా విషయాలను చెప్పడం మనం చూస్తుంటాం. తన అనుభవంతో.. సుదీర్ఘ ప్రసంగాలు చేస్తుంటారు. అలాగే.. కొత్త సంవత్సరం సందర్భంగా చేసిన ట్వీట్‌లో కూడా లోతైన అంశాలను ప్రస్తావించారు.
సీఎం చంద్రబాబు ట్వీట్‌లో ఒక విషయం అందర్నీ ఆకట్టుకుంటోంది. అదేంటంటే.. “కొత్త సంక్షేమ పథకాలు, మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు 2025 సంవత్సరం వేదిక కాబోతోంది” అన్నారు. ఇది కోట్ల మందిలో కొత్త ఆశలు చిగురింప చేసే మాట. ఏపీ ప్రజలు.. సూపర్ సిక్స్ పథకాల అమలు కోసం చూస్తున్నారు. వాటిలో ఒకటైన ఉచిత బస్సు పథకం.. ఉగాదికి వస్తుందనే అంచనా ఉంది. ఇంకా తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, నిరుద్యోగ భృతి, మహిళలకు నెలకు రూ.1,500 వంటి కీలక హామీలు ఉన్నాయి. వాటిని కొత్త సంవత్సరంలో ప్రారంభిస్తారనే అంచనాలో ప్రజలున్నారు.
ఈ ట్వీట్‌ని బట్టీ.. కూటమి ప్రభుత్వం 6 నెలల పాలనపై సీఎం చంద్రబాబు సంతృప్తిగా ఉన్నారని అర్థమవుతోంది. అభివృద్ధితోపాటూ.. సంక్షేమాన్ని కూడా చేసి చూపించామని అంటున్నారు. ఇదివరకు ఆయన సంక్షేమంపై పెద్దగా ఫోకస్ పెట్టేవారు కాదు. ఈసారి పేదలకు ఏదో ఒకటి చేస్తూ.. వారి ఇళ్లకు వెళ్లి మరీ కష్టసుఖాలు తెలుసుకుంటున్నారు. అది ఆయనలో కనిపిస్తున్న మార్పు. ప్రజల చెంతకు నేతలు ఎంత ఎక్కువగా వెళ్తే, అంతగా క్షేత్రస్థాయిలో సమస్యలు తెలుస్తాయి. అందువల్ల ప్రభుత్వం త్వరలో కొత్త పథకాలు అమలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అమలుచేస్తే అందరికీ మంచిదే కదా.
చంద్రబాబు ట్వీట్‌కి నెటిజన్లు పాజిటివ్‌గా స్పందిస్తున్నారు. వారు కూడా విషెస్ చెబుతున్నారు. ఆయన మరింత ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నారు. కొంత మంది మాత్రం తమ సమస్యలు చెప్పుకుంటున్నారు. వాటిపై కూడా దృష్టిపెట్టాలని కోరుతున్నారు. మరికొంతమంది సూపర్ సిక్స్ పథకాలన్నీ అమలు చెయ్యాలని కోరుతున్నారు.