బదిలీ నుంచి తప్పించు కోడానికి ఉద్యోగుల కొత్త పన్నాగాలు.. ఉద్యోగ సంఘాల పేరిట సిఫార్సులు

www.mannamweb.com


AP Employees Unions: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీ నుంచి తప్పించుకోడానికి కొందరు కొత్తకొత్త ఎత్తుగడలకు తెరతీస్తున్నారు.ఉద్యోగ సంఘాలను అడ్డు పెట్టుకుని ఉన్న చోటి నుంచి కదలకుండా ఉండేందుకు పావులు కదుపుతున్నారు. కొందరు ఏ పనిచేయకుండానే ప్రభుత్వ వేతనాలు పొందుతూ కాలక్షేపం చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల మార్గదర్శకాలు జారీ చేసింది. ఐదేళ్లుగా ఒకే చోట పనిచేస్తున్న ఉద్యోగులకు స్థాన చలనం కల్పించాలని నిర్ణయించింది. ఉపాధ్యాయులు, వైద్యులు మినహా అన్ని ప్రభుత్వ శాఖల్లో పాతుకుపోయిన ఉద్యోగులకు స్థాన చలనం కలిగించాలని నిర్ణయించింది. దీనికి విరుగుడుగా ఉద్యోగులు కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు.

ఉద్యోగ సంఘాల ఆఫీస్ బేరర్లకు ఇచ్చిన మినహాయింపులను అడ్డు పెట్టుకుని పనిచేసే చోట నుంచి బదిలీ కాకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇలా ప్రతి మండలం, తాలుకా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు రకరకాల క్యాడర్లలో ఉద్యోగులు తాము ఏదొక ఉద్యోగ సంఘానికి ప్రతినిధులమని చెప్పుకుంటూ బదిలీలను తప్పించుకోడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వాలు మారినా ఏ పని చేయకుండా పైరవీలు చేసుకుంటూ కాలక్షేపం చేసుకునే నాయకులు, వారికి అనుచరులుగా చలామణీ అయ్యే ఉద్యోగులు ఇలా బదిలీల నుంచి తప్పించుకునే ప్రయత్నాల్లో ఉన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాల్లో ఆఫీస్ బేరర్లుగా ఉన్నవారికి బదిలీల నుంచి 9 ఏళ్ల మినహాయింపు ఉంటుంది. ఈ నిబంధన దుర్వినియోగం కాకుండా ఉండేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. గురువారం ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన మార్గదర్శకాల్లో గుర్తింపు సంఘాలకు సంబంధించిన పలు నిబంధనల్ని జిఏడి సర్వీసెస్‌ అధికారులు విడుదల చేశారు.

జిఏడి సర్వీసెస్‌ గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాలు సాధారణ బదిలీల నుంచి మినహాయింపు కోరడానికి సంబంధించిన నియమ నిబంధనలు తెలపాల్సి ఉంటుంది. ఉద్యోగ సంఘాల ఓటర్ల జాబితాను అందచేయడంతో పాటు ఓటర్ల జాబితాలో మినహాయింపు కోరిన ఉద్యోగి పేరు సదరు సంఘం ఓటర్ల ఉన్నట్టు ధృవీకరించాలి.

గుర్తింపు ఉద్యోగుల సంఘం నియమనిబంధనల్లో సదరు పదవికి బదిలీ మినహాయింపు వర్తిస్తుందో లేదో ధృవీకరించాలి. సంఘం కార్యనిర్వాహకుల ఎన్నికకు సంబంధించిన ప్రొసీడింగ్స్‌ సమర్పించాలి. ఎన్నికల నోటిఫికేషన్, ఎన్నికల అధికారి ధృవీకరణలు అందచేయాలి. కో ఆప్టెడ్ మెంబర్లకు జనరల్ బాడీ మీటింగ్ తీర్మానం అందించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
రాష్ట్రంలో 100కు పైగా సంఘాలు…

రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాలు 100కు పైగా ఉన్నాయి. ఇవి కాకుండా రాష్ట్రస్థాయిలో మరో రెండు సంఘాలుంటాయి. వారి శాఖల అసోసియేషన్లలో చోటు దొరకని వారు ఈ రెండు సంఘాల్లో చేరి పోవడం రివాజుగా మారింది.

ఒకేచోట ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకుని వివిధ సంఘాల్లో ఆఫీస్ బేరర్లుగా చేరిపోయి, బదిలీల నుంచి తప్పించుకోడానికే ఈ సంఘాల సభ్యత్వాలు పనిచేస్తున్నాయి. సాధారణ బదిలీకి ఐదేళ్లు, ఆఫీస్ బేరర్లకు వచ్చే మినహాయింపు 9 ఏళ్లు కలిపి 14 ఏళ్ల పాటు బదిలీల్లేకుండా ఒకేచోట పనిచేస్తున్నారు.

ఇందులో ఎంతమంది నిబంధనల ప్రకారం ఆఫీస్ బేరర్లుగా నియమితులయ్యారో వారికి మాత్రమే ఆ 9 ఏళ్ల మినహాయింపు నిబంధన వర్తించేలా ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంది. సాధారణ బదిలీల మార్గదర్శకాల్లో కూడా ఆఫీస్ బేరర్ల జాబితా సంబంధిత జిల్లాల కలెక్టర్ల నుంచి మాత్రమే హెచ్‌ఓడిలకు రావాలని జిఏడి ఉత్తర్వుల్లో ఆదేశించారు.

రాష్ట్రస్థాయి సంఘాల ఆఫీస్ బేరర్ల జాబితా సాధారణ పరిపాలనా శాఖ నుంచి మాత్రమే సంబంధిత బదిలీ అథారిటీకి రావాల్సి ఉంటుంది. అలా వచ్చిన జాబితానే పరిగణనలోకి తీసుకోవాలని ఉత్తర్వుల్లో జిఏడి సర్వీసెస్ కార్యదర్శి పోలా భాస్కర్‌ ఆదేశించారు.

రాష్ట్రంలో ప్రతి తాలూకా స్థాయిలో 15 నుంచి 18 మంది ఆఫీస్ బేరర్స్ ఉండొచ్చు. సగటున ఒక్కో జిల్లాలో 7 – 8 తాలూకాలు ఉన్నాయి. అంటే బదిలీలు తప్పించుకునే వారి సంఖ్య తాలుకాకు 120వరకు ఉంటుంది. జిల్లాకు 960మంది ఇలా బదిలీ నుంచి తప్పించుకుంటారు. ఇక జిల్లా స్థాయిలో 25 బేరర్స్ ఉంటారు. 26జిల్లాల్లో 650మంది ఉద్యోగులకు ఈ మినహాయింపు ఉంటుంది. రాష్ట్ర స్థాయిలో మరో 25-30మంది ఉంటారు.

ఉద్యోగుల్లో దాదాపు 1500మందికి పైగా బదిలీ నుంచి మినహాయింపు కోరనుండటం, ఏళ్ల తరబడి అయా శాఖల్లో పాతుకుపోయి వాటిని శాసించడంపై ఉద్యోగుల్లో అసహనం వ్యక్తం అవుతోంది. ఇక కొన్ని సంఘాల నాయకులు అసలు పనిచేయకుండా ఎప్పుడూ జిల్లా పర్యటనలు, ఢిల్లీ పర్యటనలు, సచివాలయాల్లో చక్కర్లు కొడుతుంటారనే విమర్శలు ఉన్నాయి. రాష్ట్ర స్థాయి పదవుల్లో ఉన్న వారికి విధుల నుంచి మినహాయింపును అడ్డం పెట్టుకుని జల్సా చేస్తుంటారు. ప్రభుత్వం కూడా వీరిని కట్టడి చేయలేకపోతుందనే విమర్శలున్నాయి.