విద్యా సంవత్సరం మధ్యలో రిటైరైనా ఏడాదంతా కొనసాగించేలా వ్యూహం
ఎన్నికలకు ముందు ఉపాధ్యాయులకు వల
రిటైర్మెంట్ ప్రయోజనాలు సకాలంలో ఇచ్చే అవకాశం లేకుండా తప్పించుకునే ఎత్తుగడ
అమరావతి, ఫిబ్రవరి 7(ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయుల పదవీ విరమణ విషయంలో జగన్ ప్రభుత్వం కొత్త ఎత్తు వేస్తోంది. సర్వీసు నిబంధనలకు విరుద్ధంగా రిటైర్మెంట్ సమయాన్ని మార్చే ఆలోచన చేస్తోంది. తద్వారా వారిని ఎన్నికలకు ముందు మచ్చిక చేసుకోవడం ఒక ఎత్తయితే, రిటైర్మెంట్ ప్రయోజనాలను సకాలంలో అందించకుండా జాప్యం చేసే మరో ఎత్తుగడ ఈ వ్యూహం వెనుక దాగి ఉండడం గమనార్హం. వాస్తవానికి ఉపాధ్యాయులైనా, ఉద్యోగులైనా రిటైర్మెంట్ అనేది వారి పుట్టిన తేదీ ఆధారంగా ఉంటుంది.
గత ప్రభుత్వంలో 58 ఏళ్ల రిటైర్మెంట్ వయసును 60 ఏళ్లు చేస్తే, వైసీపీ ప్రభుత్వం దానిని 62 ఏళ్లకు పెంచింది. అయితే రిటైర్మెంట్ వయసు ఏదైనా పుట్టిన తేదీ ఆధారంగా నిర్దేశిత సమయం చేరుకున్నప్పుడు ఆ నెలలోనే రిటైర్ అవుతారు. కానీ, వైసీపీ ప్రభుత్వం టీచర్లు రిటైర్ అయినా విద్యా సంవత్సరం ముగిసే వరకు కొనసాగించాలని ప్రతిపాదించింది. ఏటా పాఠశాలలకు విద్యా సంవత్సరం జూన్‌లో ప్రారంభమై, ఏప్రిల్‌లో ముగుస్తుంది.
ఈ మధ్య కాలంలో ఎవరైనా టీచర్ రిటైర్ అయితే, వారిని ఆ విద్యా సంవత్సరం ముగిసే వరకు కొనసాగాలించాలనేది ప్రభుత్వ ఆలోచన. అంటే జూన్ నుంచి మార్చి మధ్యలో ఏ నెలలో రిటైర్ అయినా ఏప్రిల్ వరకు వారు కొనసాగనున్నారు. దీనివల్ల విద్యార్థులకు టీచర్ల కొరత ఉండదని ప్రభుత్వం చెబుతోంది. కానీ, గతంలో ఎప్పుడూ ఇలాంటి విధానం ఎక్కడా అమలుచేయలేదు.
సాధారణంగా విద్యా సంవత్సరం మధ్యలోనూ టీచర్లను బదిలీ చేస్తుంటారు. అప్పుడు కూడా విద్యార్థులకు ఇబ్బంది ఏర్పడుతుంది. అలాగే, ఒక టీచర్ రిటైర్ అయితే ఆ స్థానంలో కొత్తవారు పాఠాలు చెబుతారు. ఈ ప్రభుత్వంలోనూ ఇదే విధానం ఉంది.
ఇప్పుడు కొత్తగా విద్యార్థుల ఇబ్బంది గుర్తుకొచ్చింది. ఇకపై ఒక్క టీచర్ ఖాళీ కూడా ఉండకూడదనే లక్ష్యంతో ఇలా ఆలోచన చేసినట్లు చెబుతోంది. కానీ, గత నాలుగున్నరేళ్లుగా వేల సంఖ్యలో పోస్టులు ఖాళీగా ఉన్నా పట్టించుకోలేదు. 10 వేలకు పైగా పోస్టులు ఖాళీగా ఉంటే భర్తీ చేయకుండా వదిలేసింది.
ఇంతకాలం టీచర్ల కొరత ఉన్నా పట్టించుకోకుండా, ఇప్పుడు రిటైర్మెంట్ విధానాన్నే మార్చాలని చూస్తోంది. ఎన్నికలకు ముందు టీచర్లను ఆకర్షించడానికి రాజకీయ కోణంలో ఈ ఆలోచన చేస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనివల్ల నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుంది. అంతేకాదు, ఎప్పటి ఖాళీలు అప్పుడు భర్తీ చేయడంలో ఈ విధానం అడ్డంకిగా మారుతుంది. ఇప్పటికే రిటైర్ అయిన వారికి సకాలంలో పదవీ విరమణ ప్రయోజనాలు అందడం లేదని ఉద్యోగ, ఉపాధ్యాయులు గగ్గోలు పెడుతుంటే మళ్లీ ఈ కొత్త విధానాలు ఎందుకని ప్రశ్నిస్తున్నారు. కొత్త ఆలోచనతో ప్రయోజనాలను ఇంకా ఆలస్యం చేసే అవకాశం ప్రభుత్వానికి లభిస్తుంది. ఈ కొత్త విధానం అమల్లోకి వస్తే ఎవరైనా టీచర్ జూలైలో రిటైర్ అయినా వారికి ఆ తర్వాత ఏడాది ఏప్రిల్ వరకు ప్రయోజనాలు అందవు.