సామాన్యుడి సొంత కారు కలను నిజం చేస్తూ రతన్ టాటా ఆలోచనలో నుంచి వచ్చిందే టాటా నానో. కేవలం రూ. లక్షే కారు పేరుతో అందుబాటులోకి వచ్చిన నానో ఆశించిన స్థాయిలో మాత్రం సక్సెస్ కాలేకపోయింది. అయితే ఇప్పుడు టాటా మరో అద్భుతానికి శ్రీకారం చుట్టేందుకు సిద్ధమవుతోంది. ఈసారి ఎలక్ట్రిక్ వెర్షన్‌తో కారును తీసుకొచ్చేందుకు సన్నహాలు చేస్తోంది..
టాటా మోటార్స్ ఆటోమొబైల్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న విషయం తెలిసిందే. సేఫ్టీ విషయంలో టాటాను మించిన కారు మరోటి లేదని చాలా మంది విశ్వసిస్తుంటారు. ఎంతో మంది దేశ ప్రజల విశ్వాసానికి అనుగుణంగానే టాటా కార్లు సేఫ్టీ విషయంలో హై రేటింగ్స్‌ను పొందుతుంటాయి. అయితే అధునాతన ఫీచర్లతో కూడిన లగ్జరీ కార్లతో పాటు టాటా మిడ్ రేంజ్ వేరియంట్ కార్లను కూడా తీసుకొస్తున్నాయి. ఇదిలా ఉంటే టాటా కలల ప్రాజెక్ట్ అయిన నానో ఈవీకి సంబంధించి గత కొన్నేళ్లుగా చర్చ నడుస్తోన్న విషయం తెలిసిందే. ఈ కారు మార్కెట్లోకి ఎప్పుడొస్తుందన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది.
కొత్తేడాదిలో..
2025లో టాటా నానో ఈవీ మార్కెట్లోకి అందుబాటులోకి రావడం ఖాయమనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే డిజైన్, ఫీచర్లకు సంబంధించి దాదాపు తుది దశకు చేరుకోగా అధికారిక ప్రకటన ఒక్కటే తరువాయనే వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పటికే టాటా నానో కారుకు సంబంధించిన డిజైన్, ఫీచర్లు, ధరకు సంబంధించిన వివరాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతూనే ఉన్నాయి. అయితే టాటా కంపెనీ మాత్రం ఇప్పటి వరకు దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం చేయలేదు. అయితే తాజా సమాచారం ప్రకారం 2025లో టాటా నానో ఈవీ వెర్షన్ మార్కెట్లోకి రావడం ఖాయనమే వార్తలు వస్తున్నాయి. వచ్చే ఏడాది మిడిల్‌లో ఈ కారుకు సంబంధించిన ప్రకటన చేయనున్నారని, ఏడాది చివరి నాటికి డెలివరీలు అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఈసారి పకడ్బందీగా..
అయితే గతంలో నానో విషయంలో జరిగినట్లుగా కాకుండా ఈసారి టాటా పకడ్బందీగా వ్యవహరించబోతోందని తెలుస్తోంది. మరీ లక్ష రూపాయల ధరలో కాకుండా ధర ఎక్కువైనే మంచి ఫీచర్లతో కూడిన ఈవీ కారును మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. భారత్‌లో ప్రతీ కుటుంబానికి సొంత కారు ఉండాలనే లక్ష్యంతో టాటా ఈ దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఈ కారుకు సంబంధించిన కొన్ని ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. వీటి ప్రకారంగానే కారు ఉంటే మాత్రం సేల్స్ ఓ రేంజ్‌లో జరగడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ధర, ఫీచర్లు ఎలా ఉండనున్నాయి.?
ధర విషయానికొస్తే నానో ఈవీ ధర మిడిల్ క్లాస్‌కు అందుబాటులో ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. బేస్ వేరియంట్ ధరను రూ. 2.5 లక్షల నుంచి రూ. 3 లక్షల మధ్య ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇందులోనూ హైఎండ్ వెరియంట్ ధరను సుమారు రూ. 7 నుంచి రూ. 8 లక్షల వరకు ఫిక్స్ చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఇక ఫీచర్ల విషయంలో కూడా టాటా తగ్గేదేలే అన్న విధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కారులో 17 KWH సామర్థ్యంతో కూడిన బ్యాటరీని ఇచ్చే అవకాశం ఉంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 400 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుందని టాక్ నడుస్తోంది. ఈ కారులో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లతో పాటు యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్‌ను ఇవ్వనున్నారని తెలుస్తోంది. ఇక భద్రతాపరమైన ఫీచర్ల విషయంలో కూడా టాటా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మరి ఈ ఏడాదిలో అయినా నానో ఈవీ కారు మార్కెట్లోకి వస్తుందా? సామాన్యుల సొంత కారు కలను నెరవేరుస్తుందా చూడాలి.