ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు శుక్రవారంతో (నవంబర్ 22) ముగిశాయి. ఉభయ సభలను నిరవధికంగా వాయిదా వేశారు. అయితే అసెంబ్లీ సమావేశాల ఆఖరి రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శాసనసభలో కీలక వ్యాఖ్యలు చేశారు.
శుక్రవారం అసెంబ్లీలో సుదీర్ఘ ప్రసంగం చేసిన చంద్రబాబు.. కీలక వ్యాఖ్యలు చేశారు. ఐదోసారి కూడా ముఖ్యమంత్రిగా వస్తానంటూ చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు 4.0 వెర్షన్ ఇప్పుడే మొదలైందన్న చంద్రబాబు.. ఐదోసారి కూడా తానే ముఖ్యమంత్రిగా వస్తానన్నారు. మంచి చేసే వారిని ప్రజలు మళ్లీ మళ్లీ గెలిపిస్తారన్న చంద్రబాబు.. కొన్ని రాష్ట్రాలలో ఒకే పార్టీ 30 ఏళ్లు పాలించిన విషయాన్ని గుర్తు చేశారు.
ఇదే సమయంలో రాజధాని అమరావతి నిర్మాణంపై సభలో చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. వచ్చే డిసెంబర్ నుంచి అమరావతి రాజధాని నిర్మాణ పనులు ప్రారంభిస్తామన్న చంద్రబాబు.. డిసెంబర్ నుంచి వేసిన గేరు మార్చకుండా హైస్పీడుతో అమరావతి పనులు చేపడతామన్నారు. ఎన్జీవో, ఆలిండియా సర్వీసెస్ అధికారుల భవనాలను 9 నెలల్లోగా పూర్తిచేస్తామని.. ఆరు నెలల్లోపు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్ భవనాల నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. మొత్తంగా వచ్చే మూడేళ్లలోపు ఆమరావతికి ఓ రూపం తీసుకొస్తామని చంద్రబాబు స్పష్టం చేసారు. అలాగే ఏపీ జీవనాడి అయిన పోలవరానికి కూడా తమ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తు్ందన్న చంద్రబాబు.. 2027 నాటికి పోలవరం ప్రాజెక్ట్ పూర్తిచేస్తామన్నారు
మరోవైపు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను బ్యాలెన్స్ చేసుకుంటూ పాలన సాగిస్తు్న్నామన్న చంద్రబాబు నాయుడు.. స్వర్ణాంధ్ర -2027 విజన్ ఆధారంగా ముందుకెళ్తున్నట్లు చెప్పారు. వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ నినాదంతో తమ ప్రభుత్వం పనిచేస్తోందన్న చంద్రబాబు.. టీమ్ లీడర్‌గా తాను పనిచేస్తానని.. మిగతా సభ్యులు కూడా ఇందుకోసం కృషి చేయాలని సూచించారు. ఎమ్మెల్యేలు అందరూ తమ తమ నియోజకవర్గ పరిధిలోనూ విజన్ డాక్యుమెంట్ తయారు చేయాలని సూచించారు. 2047 నాటికి మీ నియోజకవర్గాన్ని ఎలా చూడాలని అనుకుంటున్నారో ఆ విజన్‌లో పొందుపరచాలని.. ఆ దిశగా పనిచేయాలని ఎమ్మెల్యేలకు సూచించారు. ప్రజలకు మంచి చేసేవారికి వారు ఎప్పటికీ గుర్తుపెట్టుకుని గెలిపిస్తారని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.