ఎన్జీ రంగా వర్సిటీలో బీఎస్సీ ఆనర్స్, బీటెక్ ప్రవేశాలు- దరఖాస్తు గడువు పొడిగింపు

www.mannamweb.com


గుంటూరు ఎన్‌జీ రంగా యూనివ‌ర్సిటీలో నాలుగేళ్ల బీఎస్సీ ఆన‌ర్స్‌, బీటెక్ కోర్సుల‌కు ద‌ర‌ఖాస్తు గడువు పొడిగించారు. అదనపు ఫీజుతో దరఖాస్తు గడువును ఆగస్టు 30 వరకు పొడిగించారు.బీఎస్సీ (ఆన‌ర్స్‌) అగ్రిక‌ల్చర్‌, బీటెక్ (ఫుడ్ టెక్నాల‌జీ) కోర్సుల కోసం ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీ నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. 2024-25 విద్యా సంవ‌త్సరానికి నాలుగేళ్ల బీఎస్సీ,

బీటెక్‌ కోర్సులో ప్రవేశాల‌కు ఆచార్య ఎన్జీ రంగా అగ్రిక‌ల్చర్‌ యూనివర్సిటీ (ఏఎన్‌జీఆర్ఏయూ) ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానించింది. ద‌ర‌ఖాస్తు దాఖ‌లు చేసేందుకు గడువు ముగియ‌డంతో అద‌న‌పు ఫీజుతో ఆగ‌స్టు 30 తేదీ వ‌ర‌కు గ‌డువు పొడిగించింది.

అర్హులు

రెండేళ్ల ఇంట‌ర్మీడియ‌ట్‌ పూర్తి చేసిన వారు ద‌ర‌ఖాస్తు చేయ‌డానికి అర్హులు. లేక‌పోతే దానికి స‌మాన‌మైన గుర్తింపు పొందిన విద్యా సంస్థల నుంచి ఫిజిక‌ల్ సైన్స్‌, బ‌యోల‌జీ, నేచుర‌ల్ సైన్స్ గ్రూపుల‌తో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 2024 డిసెంబ‌ర్ 31 నాటికి జ‌న‌ర‌ల్ కేట‌గిరీ అభ్యర్థులకు 17-22 ఏళ్ల వ‌య‌స్సు ఉండాలి. అంటే 2003 జ‌న‌వ‌రి 1-2007 డిసెంబ‌ర్ 31 మ‌ధ్య పుట్టిన‌వారై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల‌కు 17-25 ఏళ్ల వ‌య‌స్సు ఉండాలి. అంటే 2000 జ‌న‌వ‌రి 1 నుంచి 2007 డిసెంబ‌ర్ 31 మధ్య పుట్టిన‌వారై ఉండాలి. దివ్యాంగుల‌కు అభ్యర్థుల‌కు 17-27 ఏళ్ల వ‌య‌స్సు ఉండాలి. అంటే 1998 జ‌న‌వ‌రి 1 నుంచి 2007 డిసెంబ‌ర్ 31 మధ్య పుట్టిన‌వారై ఉండాలి.

కాలేజీలు

ఎన్‌జీ రంగా యూనివర్సిటీతో పాటు మొత్తం ఏడు కాలేజీల్లో బీఎస్సీ ఆన‌ర్స్ అగ్రిక‌ల్చ‌ర్ కోర్సు ఉంది. రాష్ట్రంలో రెండు కాలేజీల్లో బీటెక్ ఫుడ్ టెక్నాల‌జీ కోర్సు ఉంది. అలాగే ఏడు అనుబంధ కాలేజీల్లో బీఎస్సీ ఆన‌ర్స్ అగ్రిక‌ల్చర్ కోర్సు ఉంది. బీఎస్సీ ఆన‌ర్స్ అగ్రిక‌ల్చర్ కోర్సు సీట్లు ఎన్‌జీ రంగా యూనివర్సిటీ కాలేజీల్లో 980 ఉండ‌గా, అనుబంధ కాలేజీల్లో 252 సీట్లు ఉన్నాయి. అలాగే బీటెక్‌ ఫుడ్ టెక్నాల‌జీ కోర్సు సీట్లు ఎన్‌జీ రంగా యూనివర్సిటీ కాలేజీల్లో 73 ఉన్నాయి. అలాగే ఈడ‌బ్ల్యూఎస్ కోటా కింద కేటాయించిన 10 శాతం సూప‌ర్ న్యూమ‌రీ సీట్లు ఉన్నాయి.

మూడు ప్రైవేట్ యూనివర్సిటీ ల్లో బీఎస్సీ (ఆన‌ర్స్‌) అగ్రిక‌ల్చర్ కోర్సులో 273 సీట్లు అందుబాటులో ఉన్నాయి. స‌త్యసాయి జిల్లాలోని బీస్టీ యూనివర్సిటీలో 175 సీట్లు, తిరుప‌తి జిల్లాలోని ఎంబీ యూనివర్సిటీ లో 63 సీట్లు, అన్నమ‌య్య జిల్లాలోని అన్నమాచార్య యూనివర్సిటీ లో 35 సీట్లు ఉన్నాయి.
వ్యవ‌సాయ, గ్రామీణ ప్రాంతం వారికి 40 శాతం రైతు కోటా

వ్యవ‌సాయ, గ్రామీణ ప్రాంత కుటుంబాల నుంచి వ‌చ్చిన అభ్యర్థుల‌కు రైతు కోటా ఉంటుంది. 40 శాతం సీట్లు వ్యవ‌సాయ కుటుంబాల‌కే కేటాయించారు. అభ్యర్థి క‌నీసం నాలుగేళ్లు నాన్ మున్సిప‌ల్ ప్రాంతం (గ్రామీణ‌)లో చ‌ద‌వి ఉండాలి. ఒక ఎక‌రా కంటే త‌క్కువ భూమి ఉన్న అభ్యర్థులు అర్హులు కాదు. అభ్య‌ర్థి, త‌ల్లిదండ్రుల పేరు మీద భూమి ఉండాలి. తాత‌, నాన్న‌మ్మ‌, గార్డియ‌న్‌, ఇత‌ర కుటుంబ స‌భ్యులు ఎవ‌రి పేరు మీద భూమి ఉన్న అర్హులు కాదు.

రిజ‌ర్వేషన్లు ఇలా

ఓపెన్ కేట‌గిరిలో 41 శాతం సీట్లు ఉన్నాయి. ఎస్‌సీ కేట‌గిరిలో 15 శాతం సీట్లు, ఎస్‌టీ కేట‌గిరిలో 6 శాతం సీట్లు ఉన్నాయి. బీసీ కేట‌గిరిలో 29 శాతం సీట్లు ఉన్నాయి. అందులో బీసీ-ఏ 7 శాతం, బీసీ-బీ 10 శాతం, బీసీ-సీ 1 శాతం, బీసీ-డీ 7 శాతం, బీసీ-ఈ 4 శాతం సీట్లు ఉన్నాయి. అలాగే విక‌లాంగు (పీహెచ్) కేట‌గిరిలో 5 శాతం సీట్లు ఉన్నాయి. సైనిక సిబ్బంది పిల్లల కేట‌గిరిలో 2 శాతం, ఎస్‌సీసీ కేట‌గిరిలో 1 శాతం, స్పోర్ట్స్ కేట‌గిరీకి 0.5 శాతం, స్కౌట్స్‌, గైడ్స్ కేట‌గిరీలో 0.5 శాతం సీట్లు ఉన్నాయి. ఈడ‌బ్ల్యూఎస్ కేట‌గిరీ కింద 10 శాతం సీట్లు కేటాయించారు.
ఎంపిక విధానం

బీఎస్సీ ఆన‌ర్స్ అగ్రిక‌ల్చ‌ర్, బీటెక్ ఫుడ్ టెక్నాలజీ కోర్సులకు ఏపీ ఈఏపిసెట్-2024 రాష్ట్రస్థాయి ర్యాంక్ ఆధారంగా ఎంపిక చేస్తారు. యూనివర్సిటీ కాలేజీ, అనుబంధ కాలేజీల్లో సీట్లను 85 శాతం లోకల్ సీట్లు కాగా, అందులో ఆంధ్రాయూనివర్సిటీ , శ్రీ వెంక‌టేశ్వ‌ర యూనివర్సిటీ ప్రాంత అభ్య‌ర్థుల‌కు 42ః22 నిష్ప‌త్తిలో కేటాయిస్తారు. 15 శాతం సీట్లు అన్ రిజర్వ‌డ్‌, ఏయూ, ఎస్‌వీయుతోపాటు ఏపీఈఏపీసెట్‌-2024 ర్యాంకు సాధించిన ఉస్మానియా యూనివర్సిటీ అభ్య‌ర్థులు కూడా సీట్ల‌కు పోటీ ప‌డొచ్చు.

అద‌న‌పు అప్లికేష‌న్ ఫీజు

అప్లికేష‌న్ ఫీజు జ‌న‌ర‌ల్ కేట‌గిరీ, బీసీ అభ్య‌ర్థులు రూ.1,000 ఉంది. అలాగే ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్య‌ర్థులు రూ.500 ఉంది. ఇప్పుడు అద‌న‌పు ఫీజుతో దాఖ‌లు చేసుకోవాల్సి ఉంటుంది. అద‌న‌పు ఫీజుతో ద‌ర‌ఖాస్తు చేయాల‌నుకునే జ‌న‌ర‌ల్ కేట‌గిరీ, బీసీ అభ్య‌ర్థులు రూ.2,000, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్య‌ర్థులు రూ.1,000 చెల్లించాల్సి ఉంటుంది.
కోర్సు ఫీజులు ఎలా ఉంటాయి?

బీఎస్సీ ఆన‌ర్స అగ్రికల్చర్, బీటెక్ ఫుడ్ టెక్నాలజీ కోర్సులకు ఫీజులు వేర్వేరుగా ఉన్నాయి. యూనివర్సిటీ కాలేజీల్లో అయితే బీఎస్సీ ఆన‌ర్స్ అగ్రిక‌ల్చర్ ఫీజు రూ.46,429 కాగా, బీటెక్ ఫుడ్ టెక్నాల‌జీ ఫీజు రూ.49,879గా ఉంటుంది. అదే అనుబంధ కాలేజీల్లో ఫీజులు ఒక్కొ కాలేజీలు ఒక్కొ విధంగా ఉన్నాయి. స‌త్య‌సాయి జిల్లాలోని బిస్టీ యూనివర్సిటీ లో ఫీజు ఏడాదికి రూ.99 వేలు, తిరుప‌తి జిల్లాలోని ఎంబీ యూనివర్సిటీ లో ఏడాదికి ఫీజు రూ.1,03,000, అన్న‌మ‌య్య జిల్లాలోని అన్న‌మాచార్య యూనివర్సిటీ లో ఏడాది ఫీజు రూ.44,500 ఉంటుంది.
ధ్రువీక‌ర‌ణ ప‌త్రాలు

అడ్మిష‌న్ స‌మ‌యంలో ఒరిజిన‌ల్ స‌ర్టిఫికేట్లు తీసుకుపోవాలి. ఇంట‌ర్మీడియ‌ట్‌ మార్కుల జాబితా, ఏపీఈఏపీసెట్‌-2024 హాల్ టికెట్టు, ర్యాంక్ కార్డు. ప‌దో త‌ర‌గ‌తి లేదా ప‌దో ఎస్ఎస్‌సీకి స‌మాన ప‌రీక్ష స‌ర్టిఫికేట్‌, కుల ధ్రువీక‌ర‌ణ ప‌త్రం, ఆరో త‌ర‌గ‌తి నుంచి ఇంట‌ర్మీడియ‌ట్‌ వ‌ర‌కు స్ట‌డీ స‌ర్టిఫికేట్‌, రెసిడెన్స్ స‌ర్టిఫికేట్‌, టీసీ, ఫార్మ‌ర్ కోటా కింద చేరే విద్యార్థులైతే రూర‌ల్ ఏరియా విద్యార్థులు నాన్ మున్సిప‌ల్ ఏరియా స్ట‌డీ స‌ర్టిఫికేట్, భూమికి సంబంధించిన అడంగ‌ల్‌, 1 బీ అద‌న‌పు స‌ర్టిఫికేట్లు తీసుకురావాలి. విక‌లాంగు విద్యార్థులైతే పిహెచ్ స‌ర్టిఫికేట్‌, డిఫెన్స్ పిల్ల‌లైతే ఐడీ కార్డు, ఎన్‌సీసీ అభ్య‌ర్థులైతే ఎన్‌సీసీ స‌ర్టిఫికేట్‌, స్పోర్ట్ అభ్య‌ర్థులైతే స్పోర్ట్స్ స‌ర్టిఫికేట్ త‌ప్ప‌ని స‌రిగా ఉండాలి. ఈ ధ్రువీక‌ర‌ణ ప‌త్రాల‌న్నీ అడ్మిష‌న్ స‌మ‌యంలో స‌మ‌ర్పించాల్సి ఉంటుంది.