విశాఖ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ఉత్కంఠ రేపుతోంది. పోటీకి టీడీపీ దూరంగా ఉండటంతో బరిలో ఇద్దరే ఉన్నారు. వైసీపీ నుంచి మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, స్వతంత్ర్య అభ్యర్థిగా షఫీ ఉల్లా నామినేషన్లు దాఖలు చేశారు. అయితే ఇండిపెండెంట్ అభ్యర్థి కూడా తన నామినేషన్‌ను ఉపసంహరించుకుంటే బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. లేదంటే ఎన్నిక అనివార్యం కానుంది. మరోవైపు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నామినేషన్ల గడువు ముగిసింది. ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు రెండు నామినేషన్లు దాఖలు అయ్యాయి. బుధవారం నామినేషన్లను పరిశీలించనున్నారు. ఈ నెల 30వ తేదీన ఉదయం 8 నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ జరగనుంది.
మరోవైపు ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో పోటీచేయరాదని టీడీపీ నిర్ణయించింది. టీడీపీ కూటమి పక్షాల బలం పరిమితంగా ఉండడంతో ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. జీవీఎంసీ కార్పొరేటర్లు, నర్సీపట్నం, యలమంచిలి మున్సిపల్ కౌన్సిలర్లు, జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు ఇందులో ఓటర్లు. వీరిలో 60 శాతానికిపైగా వైసీపీ నుంచి గెలిచిన వారే ఉన్నారు. పోటీ పెడితే.. గెలిపిస్తామని కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు ముందుకు వచ్చినా.. అంత ప్రయాసపడి గెలవాల్సిన అవసరం లేదని నాయకత్వం భావించింది.
ఒక ఎమ్మెల్సీ సీటు కోసం అంతమందిని ప్రత్యర్ధి పార్టీ నుంచి సమీకరించాల్సిన అవసరం లేదని, హుందా రాజకీయాల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చంద్రబాబు వెల్లడించారు. చంద్రబాబు నిర్ణయాన్ని కూటమి నేతలు కూడా ఆమోదించారు. స్వతంత్ర్య అభ్యర్థిగా షఫీ ఉల్లా నామినేషన్ ఉపసంహరించుకుంటారా? ఏకగ్రీవమా? లేక ఎన్నిక అనే ఉత్కంఠ నెలకొంది.